logo

చెరువులను చెరబట్టారు!

నగర, పట్టణ ప్రాంతాల్లో చెరువులు కనుమరుగవుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో వైకాపా నాయకుల ధోరణితో గట్లు, కాలువలే కాదు.. శిఖం భూములు కూడా ప్లాట్లుగా మారిపోయాయి. చెరువులతో రూ. కోట్లలో స్థిరాస్తి వ్యాపారం జరుగుతోంది.

Published : 29 Mar 2024 03:25 IST

నగర, పట్టణాల్లో ఇష్టారాజ్యంగా ఆక్రమణలు
అధికారం ఉండగా.. వైకాపా నాయకుల దుశ్చర్యలు
ఈనాడు, నెల్లూరు: నెల్లూరు(కలెక్టరేట్‌), దుత్తలూరు, న్యూస్‌టుడే

నగర, పట్టణ ప్రాంతాల్లో చెరువులు కనుమరుగవుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో వైకాపా నాయకుల ధోరణితో గట్లు, కాలువలే కాదు.. శిఖం భూములు కూడా ప్లాట్లుగా మారిపోయాయి. చెరువులతో రూ. కోట్లలో స్థిరాస్తి వ్యాపారం జరుగుతోంది. ఫలితంగా ఏటా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు నగరంతో పాటు కావలిలో పలు ప్రాంతాలు నీటమునుగుతూ సామాన్య ప్రజలు తల్లడిల్లుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులను ఆక్రమించుకుని సొంత పొలాలు గామార్చి మార్చి సాగు చేయడం, తోటలు పెంచడం తదితరాలతో అనేక చోట్ల ఆయకట్టుకు సరిగా నీరు చేరని దుస్థితి నెలకొంది.

జిల్లాలో చిన్న, పెద్ద కలుపుకొని మొత్తం 1004 చెరువులు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతుండగా- వీటిలో 15,661 ఎంసీఎఫ్‌టీ(మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్‌) నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. ఈ చెరువుల కింద 1.61 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండటంతో వందలాది గ్రామాల దాహార్తి తీర్చుతున్నాయి. భూగర్భ జలాల వృద్ధికీ ఉపయోగపడుతున్నాయి. ఇంతటి విలువైన నీటి వనరులు ఏళ్లుగా ఆక్రమణలకు గురవుతున్నా.. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అవి మరింత పెరిగాయి. నెల్లూరు నగరంతో పాటు పట్టణ ప్రాంతాలకు దగ్గరగా 154 చెరువులు ఉండగా.. వాటిలో సుమారు 30 శాతం వరకు ఆక్రమణకు గురైనట్లు సంబంధిత అధికారులే చెబుతుండటం గమనార్హం. నగరంలో సుమారు 14 పంట కాలువలు ఉండగా- వీటి పొడవు దాదాపు 180 కి.మీ.లు. ఇందులో 100 కి.మీ. వరకు కాలువకు రెండు వైపులా ఆక్రమణకు గురైంది. 40 అడుగుల వరకు వెడల్పు ఉండాల్సిన కాలువలు పలు ప్రాంతాల్లో పది అడుగుల కంటే తక్కువే ఉన్నాయి. ఉన్న కొద్దిపాటి కాలువలను ఆక్రమించి వైకాపా నాయకులు నిర్మాణాలు చేపడుతున్నా.. ఇరిగేషన్‌, నగరపాలక సంస్థ అధికారులు చోద్యం చూస్తున్నారు.

ఉదాసీనతతో.. ఆజ్యం

కొందరు ప్రజాప్రతినిధులే చెరువులను ఆక్రమించి వెంచర్లు వేశారు. తమ పలుకుబడితో చెరువు గర్భాల్లో నిర్మించిన నివాసాలకు విద్యుత్తు, నీటి వసతి ఏర్పాటు చేయించారు. తప్పుడు డాక్యుమెంట్లతో భూముల విక్రయాలు చేస్తున్నారు. వాటిని అడ్డుకోవడంలో అధికార యంత్రాంగం ఉదాసీనతే కబ్జాలకు కారణమవుతోందని నిపుణులు విమర్శిస్తున్నారు. ఆక్రమణలు గుర్తించినా తొలగించకపోవడం, రెవెన్యూ, నీటిపారుదలశాఖ, పురపాలక శాఖల మధ్య సమన్వయలోపం, వరదొచ్చి మునిగినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఆక్రమణలపై దృష్టి సారించకపోవడంతో అధికారపార్టీ నాయకులు ఆడిందే ఆటగా మారింది. రూ.కోట్ల విలువైన భూములు చేతులు మారాయి. ఫలితంగా భవిష్యత్తులో కొద్దిపాటి వర్షానికే నీట మునిగే ప్రమాదముంది.

దీనిపై ఇరిగేషన్‌ అధికారుల వివరణ కోరగా.. నగర, పట్టణ ప్రాంతాల్లోని ఇరిగేషన్‌ స్థలాలు ఆక్రమణకు గురవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, కొన్నింటిని పోలీసుల సాయంతో అడ్డుకున్నామన్నారు. రెవెన్యూ, కార్పొరేషన్‌ అధికారుల సహకారం ఉండటం లేదని, సర్వే కోసం ఇప్పటికే చాలా లేఖలు రాసినా స్పందించడం లేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని