logo

ఎక్కడి చెత్త అక్కడే

పురపాలికల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. కార్మికుల హాజరు తక్కువగా ఉంటోంది. కేవలం 65 శాతం మందే విధులకు వస్తున్నారు. ఇంటింటి చెత్త సేకరణ 50 శాతమే జరుగుతోంది. కొందరు అధికారులు సిబ్బంది హాజరు తీసుకొని జారుకుంటున్నారు.

Published : 05 Dec 2021 06:17 IST

పురాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఆపసోపాలు

సిబ్బంది హాజరు 65 శాతమే

పురపాలికల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. కార్మికుల హాజరు తక్కువగా ఉంటోంది. కేవలం 65 శాతం మందే విధులకు వస్తున్నారు. ఇంటింటి చెత్త సేకరణ 50 శాతమే జరుగుతోంది. కొందరు అధికారులు సిబ్బంది హాజరు తీసుకొని జారుకుంటున్నారు. శనివారం ఉదయం పారిశుద్ధ్య నిర్వహణను ‘న్యూస్‌టుడే’ బృందం పరిశీలించగా లోపాలు వెలుగుచూశాయి.


పర్యవేక్షణ కరవు

కామారెడ్డి గోదాంరోడ్డులో ఉదయం 8 గంటల సమయంలో..

కామారెడ్డి పట్టణం: జిల్లాకేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణపై యంత్రాంగం దృష్టి పెట్టడం లేదు. సిబ్బంది మొక్కుబడిగా పని చేస్తున్నారు. ఆయా వార్డుల్లో శనివారం పరిశీలించగా ఎక్కడా పకడ్బందీ చర్యలు కనిపించలేదు. ఉదయం 8 గంటలైనా.. విద్యానగర్‌, అశోక్‌నగర్‌, వివేకానందకాలనీ, స్టేషన్‌రోడ్డు, డెయిలీ మార్కెట్‌, పెద్దబజార్‌, నిజాంసాగర్‌రోడ్డు, దేవునిపల్లి, ధర్మశాల, సిరిసిల్ల రోడ్డులో చెత్త తొలగలేదు. బల్దియా కార్యాలయం ఎదుట ఉదయం 7.15 గంటల వరకు తరలించలేదు. గోదాం రోడ్డులో చెత్త పునర్వినియోగ కేంద్రం మూసేశారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణ లేదు.


కాల్వలు లేక ఇబ్బందులు

బాన్సువాడ పట్టణం ఒకటో వార్డులో...

బాన్సువాడ పట్టణం: బాన్సువాడ పురపాలికలోని 19 వార్డుల్లో 38 మంది, ప్రధాన రహదారిశుభ్రం చేయడానికి నలుగురిని కేటాయించారు. శనివారం ఏడుగురు గైర్హాజరయ్యారు. ఉదయం 5.14 నుంచి 5.30 మధ్య ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి చెత్త సేకరణ ఆటోలు బయలుదేరినా సమయానికి క్షేత్రస్థాయికి చేరుకోలేదు. 14వ వార్డుల్లో ఉదయం 5.38కి ఒక్క కార్మికురాలే కనిపించారు. 3, 4వ వార్డుల్లో ఉదయం 5.50- 6.20 మధ్య ఎవరూ లేరు. పర్యవేక్షణకు నలుగురు జవాన్లు ఉన్నా.. పుర కార్యాలయం చుట్టే తిరుగుతున్నారు. ఎన్జీవోస్‌ కాలనీ, సాయికృపానగర్‌లో చెత్త పేరుకుపోయింది. వాసవీకాలనీ, నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ, బండగల్లీలో కాల్వల నిర్మాణం లేక ఖాళీ ప్రదేశాల్లో మురుగు నిలుస్తోంది.


* జిల్లాలో మూడు పురపాలికల్లో నిత్యం 15-20 శాతం మంది కార్మికులు గైర్హాజరవుతున్నారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డిలో రోజుకు సరాసరి 70- 90 మంది విధులకు డుమ్మా కొడుతున్నారు. కొందరు వరుసగా 3- 4 రోజుల పాటు రాకపోవడంతో వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రభావం పడుతోంది.

 

ఎల్లారెడ్డిలో వేకువజామునే హాజరు నమోదు చేస్తున్న అధికారి


పరిశీలన మరిచారు

ఎల్లారెడ్డి పురపాలిక: పంచాయతీ నుంచి పురపాలక స్థాయికి ఎదిగినా ఎల్లారెడ్డిలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. ఏ వార్డులోనూ సకాలంలో చెత్త తొలగడం లేదు. 80 శాతం సిబ్బంది విధులకు హాజరయ్యారు. ఇంటింటి చెత్త సేకరణకు ఆటోలు కొనుగోలు చేసినా పూర్తిస్థాయిలో పని చేయడం లేదు. వార్డుల్లో అధికారులు పరిశీలించలేదు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లేక పర్యవేక్షణకు అగచాట్లు తప్పడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని