logo

చీర కొంగులతోనే ఉరిబిగించారు

కామారెడ్డి సబ్‌ డివిజన్‌లోని మాచారెడ్డి, దేవునిపల్లి పోలీసుస్టేషన్ల పరిధిలో జరిగిన వేర్వేరు హత్య కేసులను పోలీసులు ఛేదించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల

Published : 09 Dec 2021 03:43 IST

రెండు హత్య కేసులను ఛేదించిన పోలీసులు

మాట్లాడుతున్న కామారెడ్డి డీఎస్పీ సోమనాథం, పక్కన గ్రామీణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, మాచారెడ్డి, దేవునిపల్లి ఎస్సైలు శ్రీనివాస్‌రెడ్డి, రవికుమార్‌

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: కామారెడ్డి సబ్‌ డివిజన్‌లోని మాచారెడ్డి, దేవునిపల్లి పోలీసుస్టేషన్ల పరిధిలో జరిగిన వేర్వేరు హత్య కేసులను పోలీసులు ఛేదించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ సోమనాథం వివరాలు వెల్లడించారు. దేవునిపల్లి ఠాణా పరిధిలోని లింగాపూర్‌ శివారులో హత్యకు గురైన కామారెడ్డి మండలానికి చెందిన మహిళ(32)ను లింగంపేట మండలం పర్మళ్ల తండాకు చెందిన బాదావత్‌ ప్రకాశ్‌ చంపినట్లు గుర్తించారు. వీరిద్దరికీ గతంలో ఉన్న పరిచయం మేరకు నవంబరు 17న జిల్లా కేంద్రం నుంచి ద్విచక్రవాహనంపై కంది చేనులోకి వెళ్లారు. ఇద్దరూ కలిసి మద్యం తాగిన అనంతరం డబ్బుల విషయమై గొడవపడ్డారు. ఇన్నాళ్లూ తనను శారీరకంగా వాడుకున్నందుకు నీకు ఇవ్వాల్సిన రూ.లక్ష చెల్లిపోయిందని మహిళ చెప్పడంతో కోపగించిన ప్రకాశ్‌ ఆమె కొంగునే గొంతుకు బిగించి హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న వెండి పట్టగొలుసులు ఎత్తుకెళ్లి రూ.1500కు అమ్ముకున్నాడు. భార్య కనిపించడం లేదని ఆమె భర్త దేవునిపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ప్రకాశ్‌ను పట్టుకొని విచారించగా విషయం బయటపడింది. నిందితుణ్ని రిమాండుకు తరలించామని పేర్కొన్నారు.

సొంత మరిది చేతిలోనే..  మాచారెడ్డి మండలం వాడి గ్రామ శివారులో తాడ్వాయి మండలానికి చెందిన మహిళ(38) నవంబరు 28న హత్యకు గురయ్యారు. ఆమె మృతదేహం ఈ నెల 1న బయట పడింది. పోలీసుల దర్యాప్తులో సొంత మరిది కుంట అల్లూరి రాజు హత్య చేసినట్లుగా గుర్తించారు. భర్త మరణించినప్పటి నుంచి చనువుగా ఉన్న ఆమె కొన్నాళ్లుగా దూరం పెట్టడంతో మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో నవంబరు 28న వాడి గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో చీర కొంగుతో ఉరేసి హత్య చేశాడు. తర్వాత ఆమె పర్సులో ఉన్న నగదు తీసుకొని ఉడాయించాడు. నిందితుణ్ని పట్టుకొని రిమాండుకు తరలించామన్నారు. రెండు హత్య కేసుల ఛేదనలో చురకైన పాత్రను పోషించిన కామారెడ్డి గ్రామీణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, మాచారెడ్డి, దేవునిపల్లి ఎస్సైలు శ్రీనివాస్‌రెడ్డి, రవికుమార్‌, ప్రొబెషనరీ మహిళా ఎస్సై శ్రీహిత, కానిస్టేబుళ్లు రవికిరణ్‌, మురళి, విశ్వనాథ్‌, నరేష్‌, కిరణ్‌, రామస్వామి తదితరులను డీఎస్పీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని