logo

దారి తప్పుతోంది

‘‘కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తాజాగా గుట్కా స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బీటెక్‌ విద్యార్థి కావడం చర్చనీయాంశంగా మారింది. ఇదే తరహాలో చాలా మంది గంజాయి, డ్రగ్స్‌

Published : 27 Jan 2022 05:05 IST

గంజాయి, డ్రగ్స్‌కు బానిసవుతున్న యువత

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నేరవార్తలు

* ‘‘కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తాజాగా గుట్కా స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బీటెక్‌ విద్యార్థి కావడం చర్చనీయాంశంగా మారింది. ఇదే తరహాలో చాలా మంది గంజాయి, డ్రగ్స్‌ అక్రమ రవాణాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.’’

* ‘‘వేల్పూర్‌ మండలానికి చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. కరోనా నేపథ్యంలో ఇంటి నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు గంజాయికి బానిసగా మారాడు. ఇందుకోసం బస్సులో రాజధానికి వెళ్లి సరకును తీసుకొచ్చాడు. తీరా గంజాయితో నేరుగా పోలీసులకు చిక్కాడు.’’

* ‘‘డ్రగ్స్‌ ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 28న ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమీక్షలో కమిషనరేట్‌ నుంచి సీపీ నాగరాజు, ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు సైతం పాల్గొంటున్నారు. వీటి కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమీక్షలో సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.’’

రాజధానికి వెళ్లి..

గంజాయి, గుట్కా, ఇతర మాదక ద్రవ్యాల కోసం యువత బానిసగా మారుతున్నారు. కొంతకాలంగా అక్రమ రవాణాలోనూ భాగస్వామ్యం అవుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన వారు అక్కడ దారి తప్పుతున్నారు.

* ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జిల్లాకు గుట్కా దిగుమతి అవుతోంది. ఏవోబీ సరిహద్దుల నుంచి ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, హైదరాబాద్‌ మీదుగా గంజాయి జిల్లాకు తరలివస్తోంది. నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నా తరచూ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు.

* ఇలాంటి వారిపై పీడీ అస్త్రాన్ని ప్రయోగించాలని గతంలోనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. తాజాగా గుట్కా అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన నిందితులపై పీడీ ప్రయోగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సీపీ నాగరాజు ప్రకటించారు. ఇదే తరహాలో పాత నేరస్థులు, స్మగ్లర్లపై తిరిగి షీట్లు తెరిస్తే కట్టడికి ఆస్కారం ఉంటుంది.

పెరిగిన వినియోగం

గతంతో పోలిస్తే మత్తు పదార్థాల వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది. ఒకవైపు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. ఫలితంగా 2020తో పోలిస్తే 2021లో కేసుల సంఖ్య రెండింతలైంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల యువత, డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులు బానిసలుగా మారుతుండడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

కేసులు ఇలా...

సం||              గంజాయి            గుట్కా

2019                  7                  28

2020                  4                 132

2021                116                  13

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని