logo

ఆధార్‌ అనుసంధానమైతేనే సాయం

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం వర్తించాలంటే తప్పనిసరిగా రైతులు ఈ-కేవైసీ చేసుకోవాలనే నిబంధనలను జారీ చేసింది. గతంలో బ్యాంకు

Published : 12 May 2022 02:13 IST

కిసాన్‌ సమ్మాన్‌ నిధికి ఈ-కేవైసీ తప్పనిసరి 

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం వర్తించాలంటే తప్పనిసరిగా రైతులు ఈ-కేవైసీ చేసుకోవాలనే నిబంధనలను జారీ చేసింది. గతంలో బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకున్న రైతులు సైతం మరోసారి ఈ ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియ పూర్తయితేనే లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ అవుతాయని స్పష్టం చేసింది. 

నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న 1,52,54 మంది కిసాన్‌ సమ్మాన్‌ లబ్ధిదారుల్లో ఇప్పటివరకు కేవలం 12 వేల వరకు మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగతా 1.40 లక్షల మంది ఇంకా దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరు ఫోన్లో, మీ-సేవ కేంద్రాల్లో నిక్షిప్తం చేసుకోవాలని సూచించింది. ఈ నెల 31 లోగా నమోదు చేసుకోవాలని, ఇందుకోసం ఆయా మండల వ్యవసాయాధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, అందరికి ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్‌ ఆదేశించారు.

అనర్హులకు దక్కకుండా..

రైతులకు ఏడాదికి మూడు పర్యాయాలు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేల పెట్టుబడి సాయాన్ని కేంద్రం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకం కింద అందిస్తోంది. ఇప్పటివరకు పది సార్లు ఎలాంటి షరతులు లేకుండా సాయం చేసింది. తప్పుడు ఖాతాలతో అనర్హులు నగదు పొందకుండా ఈసారి సర్కారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. కొందరు చనిపోయినవారి ఖాతాల్లోకి నగదు వెళ్తుందని గుర్తించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేసింది. మున్ముందు ఈ పథకాన్ని మరింత ప్రక్షాళన చేసే దిశగా ఈ-కేవైసీ పని చేయనుంది.

దరఖాస్తు ఇలా..

రైతులు తమ ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా, పట్టాదారు పాసుపుస్తకం వివరాలతో ఫోన్, మీసేవల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే మండల వ్యవసాయాధికారి, విస్తర్ణాధికార్ల సాయం తీసుకోవచ్చు. www.pmkisan. gov.in  లింకును తెరిస్తే అందులో ఈ-కేవైసీ అప్‌డేట్‌ వస్తుంది. దానిపై నొక్కి ఆధార్‌ నంబరును నమోదు చేయాలి. కొద్దిసేపటికే ఆధార్‌ లింకుతో ఉన్న చరవాణికి ఓటీపీ వస్తుంది. దానిని గెట్‌ పీఎం కిసాన్‌ ఓటీపీ కాలంలో నమోదు చేయాలి. అనంతరం సబ్మిట్‌పై క్లిక్‌ చేస్తే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. మీ-సేవ కేంద్రాల్లో బయోమెట్రిక్‌ ద్వారా అనుసంధానం చేయించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు