logo

సత్యాలు తెలుసుకుందాం.. సత్యాలు నింపుదాం

సమస్త ప్రాణకోటి నివసించే నేల తల్లి గుండెలపై గునపాలు దించుతున్నారు. ఎన్నో సహజ వనరులను తన పిల్లల కోసం అందించే భూమిని అవసరం మేరకు వినియోగించుకోవాల్సింది పోయి ఇష్టారీతిగా ధ్వంసం చేస్తున్నారు. స్వార్థం కోసం మొరం, ఇసుక తవ్వకాలు,

Published : 22 May 2022 06:26 IST
నేడు జీవ వైవిధ్య దినోత్సవం

న్యూస్‌టుడే, ఇందూరు ఫీచర్స్‌


నిస్సారమవుతున్న భూమి...

మస్త ప్రాణకోటి నివసించే నేల తల్లి గుండెలపై గునపాలు దించుతున్నారు. ఎన్నో సహజ వనరులను తన పిల్లల కోసం అందించే భూమిని అవసరం మేరకు వినియోగించుకోవాల్సింది పోయి ఇష్టారీతిగా ధ్వంసం చేస్తున్నారు. స్వార్థం కోసం మొరం, ఇసుక తవ్వకాలు, విషపూరిత రసాయనాల వాడకంతో నేలను నిస్సారం చేస్తున్నారు. కాంక్రీటుమయంగా మారుస్తుండటంతో నీరింకక, ఇష్టారీతిన బోర్ల తవ్వకంతో భూగర్భ జలాలు ఏటేటా అడుగంటుతున్నాయి. వానలు పడకుండా చెట్లు నరికేస్తున్నారు. జనాభా అవసరాల కోసం అధికోత్పత్తికి రసాయన ఎరువులతో లవణీకరణం చేస్తున్నారు. వీటికి తోడు ప్లాస్టిక్‌ తదితర విషపూరిత సామగ్రితో భూమిని కలుషితం చేస్తున్నారు. జిల్లా భూముల్లో భాస్వరం ఎక్కువ ఉందని ఇటీవల ప్రభుత్వ అధ్యయన సంస్థే తేల్చింది.

నష్టాలు : లవణీయత పెరిగితే ఉత్పాదకత తగ్గి ఆహార కొరత ఏర్పడుతుంది. అడవుల నరికివేత, ఇతర కారణాలతో ఏటా 0.9 ఎం.ఎం. మందం భూమి పై పొర గాలికి కొట్టుకుపోయి సారం కోల్పోతుందట. ఇదే విధానం కొనసాగితే 2050 నాటికి 50 శాతం నేలలు లవణీకరణ చెంది దిగుబడుల్లో 10 శాతం తగ్గుదల నమోదవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరితే ఆహార కొరత ఏ స్థాయిలో ఉంటుందో మనం ఊహించుకోవచ్ఛు

చేయాల్సింది : భూమి సారం కోల్పోకుండా రసాయన ఎరువులు, కీటక నాశక ఎరువుల వాడకం తగ్గించాలి. భూ సారం పెరిగేలా ఎక్కడికక్కడ చెట్లను పెంచి వరదను నియంత్రించాలి. భూమిలోకి నీరు ఇంకే మార్గాలను యథాతథంగా ఉంచుతూ ఇంకుడు గుంతలు కొత్తగా తవ్వించాలి.

మొత్తం సాగు భూమి : 5.78 లక్షలు ఎకరాలు

2021 లో వినియోగించిన ఎరువులు (ఒక్క వానాకాలంలోనే) : 1.28 లక్షల మె.ట.


82 శాతం గృహ వ్యర్థాల వల్లే..

ప్రాణులన్నింటికీ జలమే జీవనాధారం. జలం, ఆహారం అందకే అటవీ జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. చిరుతలు, ఎలుగుబంట్లు, కోతులు గ్రామాల్లోకి వస్తున్న ఉదంతాలు మనం చూస్తూనే ఉన్నాయి. ప్రాధాన్యమున్న జలవనరుల సహజ ప్రవాహానికి ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి 122 దేశాల నదుల్లో జల నాణ్యతపై చేసిన సర్వేలో భారత్‌కు 120వ ర్యాంకు లభించింది. సర్వేలో పరిగణనలోకి తీసుకున్న నదుల్లో నిజామాబాద్‌ జిల్లాలో పారే గోదావరి, మంజీర ఉండటం ఆందోళనకరం. కలుషిత నదుల జాబితాలో చేరడానికి మన చర్యలే కారణం. పరిశ్రమలు, పరిసర గ్రామాల్లో సేద్యానికి వినియోగించే రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు జలవనరుల్లోకి వెళ్తున్నాయి. గోదావరి కాలుష్యానికి 82 శాతం గృహ వ్యర్థాలే కారణమని చెబుతున్నారు. చెరువులు, వాగులు డంపింగ్‌ కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రధానంగా మున్సిపాలిటీల్లోనే ఈ సమస్య ఉంది.

నష్టాలు: ఇప్పటికే జలవనరుల విస్తీర్ణం తగ్గి చిన్న వర్షానికే ముంపు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పట్టణాల్లో కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు ప్రవాహం ద్వారా నదుల్లోకి చేరడంతో జలచరాలు మనుగడ సాగించలేకపోతున్నాయి.

చేయాల్సింది : మురుగు ఎక్కడికక్కడ శుద్ధి చేసి పునర్వినియోగించుకోవడం. కాల్వలు, చెరువుల సంరక్షణ, కలుషిత జలాలు నదుల్లోకి చేరకుండా నిరోధించాలి. ఉమ్మడి జిల్లాలో వ్యర్థ జలాల శుద్ధీకరణ ఒక్క నిజామాబాద్‌ నగరంలో అదీ నామమాత్రంగా కొనసాగుతోంది.

ఉమ్మడి జిల్లాలో పట్టణ జనాభా : 7,65,061

ఏటా ఓ వ్యక్తి వెలువరించే ప్లాస్టిక్‌ వ్యర్థాలు : 11 కిలోలు

పట్టణాల్లో వినియోగించే నీరు (రోజుకు) : 80 ఎంఎల్‌డీ

వెలువడే గృహ వ్యర్థ జలాలు (రోజుకు) : 40 ఎంఎల్‌డీ


కనుమరుగవుతున్న అడవులు...

జీవ వైవిధ్యానికి కేంద్ర బిందువు అడవులే. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లు చెట్లను నరికి చదను చేసి సాగు, నివాస ప్రాంతాలుగా మార్చుకుంటున్నాం. వాస్తవానికి అడవులు మనకు అవసరమైన ఆహారం, ఔషధాలు, స్వచ్ఛమైన గాలి, నీరు అందిస్తాయి. 75 శాతం స్వచ్ఛమైన నీటి ప్రవాహం అడవుల్లోనే ఉంటుంది. మనుషులు తీసుకునే ఆహారంలో 80 శాతం మొక్క ఆధారమైనవైతే 20 శాతం ఇతర రకాలుంటాయి. 2010-20 మధ్య దేశవ్యాప్తంగా 47 లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణం తగ్గిపోయిందని అధ్యయనమొకటి తేల్చింది.


జంతుజాలం, చెట్లు, జలవనరులు లేకుండా మనిషి జీవించడం సాధ్యమా?

ఈ ప్రశ్నకు కాగితంపై సమాధానం రాయండి. భవిష్యత్తులో మన పరిస్థితి ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది. విచక్షణ జ్ఞానం ఉన్న మనిషికే వీటి అవసరం ఎక్కువ. తన మేధస్సును సహజ సంపద దుర్వినియోగానికే వినియోగిస్తూ కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నారు. వివిధ జాతుల జీవులు ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ జీవ వైవిధ్యం కాపాడుతుంటే మనం ఆధునిక పోకడల పేరుతో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నాం. ఇదే జీవన శైలి కొనసాగితే భవిష్యత్తులో మానవ మనుగడే ప్రమాదంలో పడనుందని గుర్తించి ప్రజలను చైతన్య పరచడానికి ఏటా మే 22న జీవ వైవిధ్య దినోద్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతి మనకెలాంటి మేలు చేస్తుంది, విధ్వంసానికి పాల్పడితే కలిగే ముప్పుపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరముంది.

నష్టాలు: అడవుల ధ్వంసంతో వాతావరణం గతి తప్పి భూతాపం పెరిగి అధిక, అత్యల్ప వర్షాలు పడుతున్నాయి. వర్షానికి పై పొరల్లో మృత్తిక క్రమక్షయం జరుగుతోంది. ప్రకృతికి మేలు చేసే జంతువులు, అరుదైన జంతుజాలం అంతరిస్తుండటంతో జీవ వైవిధ్యం దెబ్బతింటోంది.

చేయాల్సింది : రాష్ట్ర ప్రభుత్వం హరితహారంతో అటవీ విస్తీర్ణం పెంచడానికి చర్యలు తీసుకుంటోంది. దీనికి తోడు అటవీ భూముల ఆక్రమణ, చెట్ల నరికివేత, జంతువుల వేటను నియంత్రించడానికి రూపొందించిన చట్టాలు పక్కాగా అమలు చేయాలి.

గతేడాది హరితహారం లక్ష్యం : 59,20,444

ఉమ్మడి జిల్లా అటవీ విస్తీర్ణం : 4.32 లక్షల ఎకరాలు

ఈ ఏడాది నిర్దేశించింది : 45,31,238

ఏడేళ్లలో నాటిన మొక్కలు : 14 కోట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని