logo

రెండు నెలలే ప్లాస్టిక్‌ నిషేధం..!

పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ప్లాస్టిక్‌ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ఏకవినియోగ పాలిథిన్‌ సంచులు, గ్లాసులతో పాటు మరికొన్ని వస్తువులను పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Updated : 02 Oct 2022 06:06 IST

కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు గాలికి
యథేచ్ఛగా వినియోగం
న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ప్లాస్టిక్‌ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ఏకవినియోగ పాలిథిన్‌ సంచులు, గ్లాసులతో పాటు మరికొన్ని వస్తువులను పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామాలు, పట్టణాల్లో పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. పల్లెల్లో ప్లాస్టిక్‌ వినియోగిస్తే రూ.500- 5 వేల వరకు, పురపాలికల్లో రూ.500- 25 వేల వరకు జరిమానాలు విధించాలని పేర్కొన్నారు. ఈ మేరకు తనిఖీలు చేపట్టిన సిబ్బంది వివిధ దుకాణ సముదాయాలకు నోటీసులు జారీ చేశారు. కొందరికి జరిమానాలు విధించారు. దీంతో మిగతా వ్యాపారులు ప్లాస్టిక్‌ను కొన్ని రోజులు బహిష్కరించాయి. తర్వాత షరామామూలే అయింది. ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల ప్లాస్టిక్‌ సంచులు, గ్లాసులు దొరుకుతున్నాయి.

ఇళ్లల్లో నిల్వలు..
పలు దుకాణదారులు పాలిథిన్‌ సంచులను రహస్యంగా తెప్పించుకుంటున్నారు. వాటిని ఇళ్లలో నిల్వ చేసుకొని విడతలుగా బయటకు తీసుకొస్తున్నారు. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు గతంలో తెప్పించిన సరకులో చివరగా మిగిలింది ఇదేనంటూ చూపిస్తున్నారు. కాగా నిషేధం మునుపటి కంటే చౌకగా ప్లాస్టిక్‌ వస్తువులు లభ్యమవుతున్నట్లు తెలుస్తోంది. మొదట్లో కఠినంగా వ్యవహరించిన అధికారులు తర్వాత చేతులెత్తేశారనే విమర్శలున్నాయి. పంచాయతీలు, పల్లెల్లో కలిపి మొత్తం 50కి మించి జరిమానాలు విధించింది లేదు. దీనినే అలుసుగా తీసుకుంటున్న వ్యాపారస్థులు మళ్లీ యథేచ్ఛగా వినియోగిస్తున్నారు.

ఒప్పందాలు సరే  సేకరణేదీ..
గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరణ జరుగుతోంది. పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా కంపోస్టు షెడ్డుకు తరలిస్తున్నారు. అక్కడే ప్లాస్టిక్‌, చెత్త, సీసాలు, ఇనుప వస్తువులు వేరు చేయడానికి స్థానికంగా ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకున్నారు. కొన్ని చోట్ల మండలానికి ఒకటి చొప్పున ఉండగా మరికొన్ని చోట్ల రెండు మండలాలకు ఒకే ఏజెన్సీ ఉంది. వ్యర్థ్యాలు పోగైనట్లు సమాచారం అందించగానే గ్రామానికొచ్చి తీసుకెళ్లేలా ఒప్పందం చేసుకున్నారు. కొన్ని గ్రామాల్లో ప్లాస్టిక్‌ సేకరణ సరిగా జరగడం లేదు. ఇనుప వస్తువులు, సీసాలనే తీసుకెళ్తున్నారు. ఏం చేయాలో తెలియక స్థానిక సిబ్బంది కాల్చివేస్తున్నారు.

గతంలో విజయవంతం..
మూడున్నరేళ్ల క్రితం జిల్లావ్యాప్తంగా ప్లాస్టిక్‌ నిషేధంపై అనేక చైతన్య కార్యక్రమాలు రూపొందించారు. అప్పటి కలెక్టర్‌ సత్యనారాయణ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి పంచాయతీ ప్లాస్టిక్‌ సేకరించి రీసైక్లింగ్‌కు పంపించారు. మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలైంది. చాలా పంచాయతీలు ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల ప్రజలకు జనపనార సంచులు పంపిణీ చేశారు. ఆ తర్వాత అటువంటి కార్యక్రమాలు తగ్గిపోయాయి.

జూన్‌లోనే నోటీసులిచ్చాం : - శ్రీనివాస్‌రావు, డీపీవో, కామారెడ్డి
జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ప్లాస్టిక్‌ నిషేధం కొనసాగుతోంది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ ప్రతినిధులు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్‌ నిషేధంపై కార్యదర్శులు జూన్‌లోనే దుకాణ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని