logo

నేటి నుంచి గోదావరి హారతి యాత్ర

నది జలాలను సంరక్షించాలని, నీటిని పొదుపుగా వినియోగించాలనే లక్ష్యంతో గోదావరి మహా హారతి ఉత్సవ సమితి ‘గోదావరి హారతి యాత్ర’కు శ్రీకారం చుట్టింది.

Published : 03 Jun 2023 05:45 IST

త్రివేణి సంగమం వద్ద ప్రారంభం

న్యూస్‌టుడే, రెంజల్‌ (ఎడపల్లి) : నది జలాలను సంరక్షించాలని, నీటిని పొదుపుగా వినియోగించాలనే లక్ష్యంతో గోదావరి మహా హారతి ఉత్సవ సమితి ‘గోదావరి హారతి యాత్ర’కు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోకి మొట్టమొదటగా గోదావరి నది ప్రవేశించే ప్రాంతం కందకుర్తి. ఆధ్యాత్మికం, జలవనరుల పరంగా ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పుష్కరాలు, ఇతర రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి నదిలో పుణ్యస్నానాలు చేస్తుంటారు. శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘గోదావరి హారతి యాత్ర’ ఇక్కడే ప్రారంభమై ఈ నెల 8 వరకు కొనసాగనుంది. తొలిరోజు కందకుర్తి, బాసర, 4న ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల, 5న జగిత్యాల జిల్లా ధర్మపురి, 6న కాళేశ్వరం, 7న ములుగు జిల్లా రామన్నగూడెం, 8న భద్రాచలంలో యాత్ర సాగనుంది.
వేడుక ఇలా.. : ఉత్సవ సమితి ప్రతినిధులు, స్వాములు మొదట సాటాపూర్‌ నుంచి భారీ ర్యాలీ, భజనలు, ఊరేగింపుగా కందకుర్తికి చేరుకుంటారు. అనంతరం అక్కడ మహా హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ వేడుకకు హరిద్వార్‌ నుంచి పలువురు స్వాములు, ఉత్సవ సమితి వ్యవస్థాపకుడు మురళీధర్‌రావు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.

లోక కల్యాణార్థం..

నదుల ప్రాముఖ్యాన్ని ప్రజలకు చెప్పేందుకు ఉత్సవ సమితి వ్యవస్థాపకులు మురళీధర్‌రావు గోదావరి హారతి యాత్రకు శ్రీకారం చుట్టారు. గత 30 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. లోక కల్యాణార్థం హారతి యాత్ర చేపట్టనున్నాం. నది జలాలను పరిరక్షించడం, కలుషితం కాకుండా చూడటం, నీటి ఆవశ్యకతను ప్రజలకు వివరించడం, నది పరివాహక ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉండేలా చూడటం, నీటిని పొదుపుగా వినియోగించడం ఈ యాత్ర ఉద్దేశం.
తిరుపతి, ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని