logo

పోలింగ్‌శాతంపై అభ్యర్థుల బెంగ

లోక్‌సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్‌శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.

Updated : 24 Apr 2024 06:45 IST

పెరిగిన ఉష్ణోగ్రత ప్రభావం

కామారెడ్డి కలెక్టరేట్‌, పట్టణం, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్‌శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. మే 13న జరిగే ఎన్నికల్లో పోలింగ్‌శాతం ఎలా నమోదవుతుందోనని అభ్యర్థులు బెంగ పడుతున్నారు. జహీరాబాద్‌ నియోజకవర్గంలో 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌శాతాల్లో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి పోలింగ్‌శాతం పెంచడానికి అధికారులు స్వీప్‌ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు.

ఎవరి లెక్కలు వారివే..

జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోకవర్గాల పరిధిలో 16.32 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 8.34 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మున్నూరుకాపులు, ముస్లింలు, లింగాయత్‌లు, ముదిరాజ్‌ వర్గాల ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అభ్యర్థులు వారి సామాజికవర్గాల ఓట్లు తమకే పడుతాయనే నమ్మకంతో ఉన్నారు. యువఓటర్ల తీర్పు కీలకం కానుంది. ఆయా వర్గాలు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఎంత మంది ఓటు హక్కు వినియోగించుకుంటారనేది చర్చనీయాంశం అవుతోంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే వృద్ధులు ఎండలో వచ్చి ఓటు వేయడం కష్టమేనని ఇటీవల ఓ పార్టీ అభ్యర్థి చర్చించినట్లు తెలిసింది. ఇలా ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు.

అవగాహన కార్యక్రమాలు

పోలింగ్‌శాతం పెంచడానికి కామారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే పోలింగ్‌శాతం తక్కువగా నమోదైందో ఆయా బూత్‌లపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అర్హులైన ప్రతి వయోజనుడు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళా స్వయంసంఘాలను రంగంలోకి దింపారు. వారితో చైతన్య ర్యాలీలు తీయించారు. ప్రతి కళాశాలలో ఇద్దరు విద్యార్థులను అంబాసిడర్లుగా నియమించారు. ఇటీవల 5కే పరుగు కార్యక్రమాల ద్వారా పోలింగ్‌పై అవగాహన పెంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని