logo

బిజదలో అసమ్మతి సెగ

ఎన్నికల ముందు అధికార పక్షం బిజదలో అసమ్మతి సెగ తగలడంతో పార్టీకి తలనొప్పిగా మారుతోంది. రాయగడ శాసనసభ నియోజకవర్గ టికెట్‌ అనుసూయ మాఝికి కేటాయించడంపై రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటుండడం పార్టీ శ్రేణులకు మింగుడుపడడం లేదు

Published : 29 Mar 2024 07:26 IST

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పలువురు ప్రజాప్రతినిధుల రాజీనామా

మాట్లాడుతున్న గంగాధర్‌, వేదికపై టుని, సుజాత తదితరులు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: ఎన్నికల ముందు అధికార పక్షం బిజదలో అసమ్మతి సెగ తగలడంతో పార్టీకి తలనొప్పిగా మారుతోంది. రాయగడ శాసనసభ నియోజకవర్గ టికెట్‌ అనుసూయ మాఝికి కేటాయించడంపై రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటుండడం పార్టీ శ్రేణులకు మింగుడుపడడం లేదు. ఓ వర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయగా, పురాధ్యక్షుడు మహేష్‌ పట్నాయక్‌ తన రాజీనామా పత్రాన్ని పార్టీ పరిశీలకుడు అతాను సవ్యసాచి నాయక్‌కు పంపారు. నేతల ఒత్తిడి వల్లే వారంతా ఈ చర్యకు పాల్పడుతున్నట్లు మరోవర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఇరు వర్గాలు వేర్వేరుగా విలేకరుల సమావేశాలు నిర్వహించడం ప్రాముఖ్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి ఆయా నేతలు ఏమన్నారంటే...

 అనుసూయ ఆదివాసీ కాదు: తేజస్వీ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్‌ మాజీ అధ్యక్షుడు గంగాధర్‌ పువ్వల మాట్లాడుతూ అనుసూయ మాఝికి టికెట్‌ కేటాయించడం సరికాదన్నారు. ఆమె ఆదివాసీ కాదని, ఇంతవరకు ఒక్క సమావేశం, కార్యక్రమంలో ఆమె ఆదివాసీ భాషలో మాట్లాడిందా అని ప్రశ్నించారు. గిరిజన భాష, సంస్కృతి, సంప్రదాయాలు తెలియని, పాటించని ఆమె ఆదివాసీ మహిళ ఎలా అవుతుందని ప్రశ్నించారు. అనుసూయకు టికెట్‌ కేటాయించడం నచ్చకే రాయగడ సమితి అధ్యక్షురాలు టుని హుయిక, ఉపాధ్యక్షుడు హరప్రసాద్‌ హెప్రిక, పలువురు కౌన్సిలర్లు, జడ్పీ సభ్యులు, సమితి సభ్యులు, సర్పంచులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారన్నారు. రానున్న రోజుల్లో వేలాది మంది పార్టీ శ్రేణులు రాజీనామా చేయనున్నారని పువ్వల పేర్కొన్నారు.

 ఇది సమంజసం కాదు: ఏడు దశాబ్దాల రాజకీయ చరిత్రలో రాయగడ అసెంబ్లీ స్థానం టికెట్‌ ఓ మహిళకు దక్కడం మనకెంతో గర్వకారణమని, దీనిని స్వాగతించాల్సింది పోయి లేనిపోని ఆరోపణలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని బిజద సీనియర్‌ నేత వై.వెంకటేశ్వరరావు (కొండబాబు) అన్నారు. పార్టీ కార్యకర్తల కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ సీనియర్‌ నేత ఒత్తిడి వల్లే కొందరు రాజీనామాలు చేస్తున్నారని, ఇది సరికాదన్నారు. నాలుగైదు రోజుల్లో అంతా సర్దుకుంటుందని, స్వప్రయోజనాల కోసం కొందరు లేనిపోని ప్రలోభాలు పెడతారని, వారి మోసంలో ఎవరూ పడొద్దని పార్టీ శ్రేణులకు కొండబాబు హితవు పలికారు. అనుసూయను భారీ మెజార్టీతో గెలుపించుకునేందుకు కార్యకర్తలంతా ఏకతాటిపై నడవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని