logo

ప్రతికూలతలు అధిగమించి.. సివిల్స్‌లో ర్యాంకు సాధించి..

‘యూపీఎస్‌సీ-2023’ పరీక్షల్లో జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన రాష్ట్ర యువకుడు అనిమేష్‌ ప్రధాన్‌ను రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ప్రధాని మోదీ, గవర్నరు రఘుబర్‌దాస్‌, సీఎం నవీన్‌లు ‘ఎక్స్‌’ సామాజిక మాధ్యమం ద్వారా అభినందించారు.

Published : 18 Apr 2024 05:29 IST

యువతకు ఆదర్శప్రాయం అనిమేష్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ‘యూపీఎస్‌సీ-2023’ పరీక్షల్లో జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన రాష్ట్ర యువకుడు అనిమేష్‌ ప్రధాన్‌ను రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ప్రధాని మోదీ, గవర్నరు రఘుబర్‌దాస్‌, సీఎం నవీన్‌లు ‘ఎక్స్‌’ సామాజిక మాధ్యమం ద్వారా అభినందించారు. ఈ ఘనత సాధించేందుకు ఆయన ఎన్నో ప్రతికూలతలను అధిగమించారు.

తల్లిదండ్రులను కోల్పోయారు

అనుగుల్‌ జిల్లా తాల్చేరుకు చెందిన అనిమేష్‌ విద్యార్థి దశలో తండ్రి ప్రభాకర్‌ ప్రధాన్‌ను కోల్పోయారు. గుండెపోటుతో ఆయన 2015లో మృతి చెందారు. ఆయన తాల్చేరు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహించేవారు. తండ్రి మరణం అనిమేష్‌కు తీవ్ర ఆవేదనకు గురి చేసింది. తల్లి అరుణా భరత్‌పూర్‌ ఎంసీఎల్‌కు చెందిన బొగ్గు గనుల్లో ఉద్యోగిని. ఆమె ప్రోద్బలంతో అనిమేష్‌ రవుర్కెలా ప్రభుత్వ ఎస్‌ఐటీలో బీటెక్‌ పూర్తిచేశారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌)లో దిల్లీలో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం చేస్తూ రోజుకు నాలుగు గంటలు సివిల్స్‌ రాసేందుకు పాఠ్యపుస్తకాలు చదివేవారు. ఈ తరుణంలో తల్లికి కేన్సర్‌ వ్యాధి సోకింది. తరచూ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో ఆయన కోచింగ్‌ తీసుకోకపోయినా గతేడాది సివిల్స్‌ రాశారు. ఫలితాలు వెల్లడికాక ముందే గత నెల ఆయన తల్లి తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యుల్లో సోదరి అన్వేషా ప్రధాన్‌ మాత్రమే ఆయనకు అండగా నిలిచారు. తాను పడిన వేదనంతా దిల్లీలో పాత్రికేయులకు వివరించిన అనిమేష్‌ భౌతికంగా తల్లిదండ్రులు లేకపోయినా వారి ఆశీస్సులు తన ఆశయాన్ని నెరవేర్చడంలో సహాయపడ్డాయన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఇది తాను నేర్చుకున్న పాఠమని, యువత దీన్ని అలవర్చుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని