logo

ఒకేరోజు నేత్రోత్సవం, రథయాత్ర

విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్ర నిర్వహణ ఈసారి యంత్రాంగానికి పరీక్ష కానుంది. జులై 7న పురుషోత్తముని నేత్రోత్సవం (నవయవ్వన దర్శనం), అదేరోజు రథయాత్ర నిర్వహించాల్సి ఉంది.

Published : 18 Apr 2024 05:40 IST

ఇబ్బందులు లేకుండా నిర్వహణపై సమీక్ష

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్ర నిర్వహణ ఈసారి యంత్రాంగానికి పరీక్ష కానుంది. జులై 7న పురుషోత్తముని నేత్రోత్సవం (నవయవ్వన దర్శనం), అదేరోజు రథయాత్ర నిర్వహించాల్సి ఉంది. భక్తులకు ఈ ఏడాది స్వామి నవయవ్వన రూపాన్ని తిలకించే అవకాశం లేకపోవచ్చు. మంగళవారం రాత్రి నీలాద్రి భక్తనివాస్‌లో రథయాత్ర రెండో సమన్వయ సంఘ సమావేశం పూరీ కలెక్టరు సిద్దార్థ్‌ శంకర్‌ స్వయిన్‌ అధ్యక్షతన జరిగింది. అధికారులు, సేవాయత్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. రెండు ప్రధాన వేడుకలు ఒకేరోజు కావడంతో ఏర్పాట్లపై కూలంకషంగా చర్చ జరిగింది. 1971లో ఇదే పరిస్థితి నెలకొంది. అప్పట్లో జగన్నాథ సేవలు ఎలా చేపట్టారన్న దానిపై సమీక్షించారు. అపశ్రుతులకు తావీయకుండా స్వామి వేడుకలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

ఈసారి గోప్య ఉపచారాలు 13 రోజులు..: జూన్‌ 22న దేవస్నాన పౌర్ణమి, పురుషోత్తముని గజానన అవతార దర్శనం వేడుకలు జరుగుతాయి. అదేరోజు రాత్రి జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల (ఛతుర్థామూర్తులు)ను ‘ఒనొసోనో’ (చీకటి) గదికి తరలిస్తారు. అస్వస్థతకు గురైన చతుర్థామూర్తులకు ఆనవాయితీ ప్రకారం గోప్యసేవలు, ఉపచారాలు జరుగుతాయి. ఇది పక్షం రోజుల కార్యక్రమం. తిథి, వార, నక్షత్రాల మేరకు ఈ ఏడాదిలో గోప్య సేవలు 13 రోజులు చేపడతారు.

నిబంధనలకు అనుగుణంగా.. ఎన్నికల నిబంధన (కోడ్‌) అమల్లో ఉన్నందున దీనికి అనుగుణంగా రథయాత్ర సమన్వయ సంఘాల సమీక్షా సమావేశాల నిర్వహణకు శ్రీక్షేత్ర యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. శ్రీజగన్నాథ పరిక్రమణ మార్గం, ఇతర నిర్మాణాలు జరిగాక పూరీకి భక్తుల రాకపోకలు పెరిగాయి. ఈసారి రథయాత్రకు  యాత్రికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్న యంత్రాంగం తాగునీరు, వసతి, పారిశుద్ధ్యం, వైద్యం, భద్రతకు ప్రాధాన్యమిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని