logo

మండే ఎండలో ప్రచారం... పదవి కోసం సాహసం

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఎన్నికల ప్రచారం చేసే నేతలు, కార్యకర్తలు అప్రమత్తం కావాలని వాతావరణ అధ్యయన శాఖ (ఐఎండీ) యంత్రాంగం హెచ్చరిస్తోంది. వీటిని ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు.

Published : 18 Apr 2024 05:43 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఎన్నికల ప్రచారం చేసే నేతలు, కార్యకర్తలు అప్రమత్తం కావాలని వాతావరణ అధ్యయన శాఖ (ఐఎండీ) యంత్రాంగం హెచ్చరిస్తోంది. వీటిని ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. పోటీలో ఉన్న నేతలకు రానున్న అయిదేళ్లలో అధికారం కనిపిస్తోంది. అలసిపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. శీతల పానీయాలు, పండ్ల రసాలు తాగుతూ సాగుతున్నారు. పాదయాత్రలు చేస్తున్నారు.

సమయం లేకపోవడంతో...

తొలివిడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. రాష్ట్రంలో నాలుగు విడతల్లో (మే 13, 20, 25, జూన్‌ 1) పోలింగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే ముందస్తుగా అభ్యర్థుల జాబితాలు ఖరారు చేస్తామన్న బిజద, భాజపా, కాంగ్రెస్‌ నాయకత్వాలు ఇంతవరకు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. జాబితాలు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారంలో ముందంజ వేయకపోతే ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడంలో వెనుకబడిపోతామన్న దూరాలోచనతో నేతలు చెమటోడుస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతున్న ప్రచారం రాత్రి 9 వరకు జరుగుతోంది.

ఎన్నెన్ని సిత్రాలో  

గడిచిన అయిదేళ్లు ఏసీ గదులు, కార్లలో తిరిగిన నేతలిప్పుడు మండుటెండలో ఆయాసం అనిపించినా ముందుకు కదులుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆయాచోట్ల నేతలు కర్భూజాలు తింటూ శీతల పానీయాలు, పండ్ల రసాలు తాగుతున్నారు. కొన్నిచోట్ల వాటిని ఓటర్లకు పంచుతున్నారు. వృద్ధులకు పాదాభివందనాలు చేస్తున్నారు. యువతతో కరచాలనాలు చేస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి హామీలిస్తున్నారు. కొన్నిచోట్ల ఓటర్లు ఎదురు ప్రశ్నలు వేసినా, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా భరిస్తున్నారు.

బిజద, భాజపా ముందంజ

ఇంతవరకు ప్రచారంలో బిజద, భాజపా నేతలు ముందంజ వేశారు. కాంగ్రెస్‌ నాయకులు కాస్తంత ఆలస్యంగా ప్రారంభించారు. ఆ రెండు పార్టీల వద్ద సొమ్ములున్నాయని, అధికారంలో లేని తమకు జనం అండదండలు మినహా కాసులు లేవని హస్తం పెద్దలు చెప్పుకుంటున్నారు. ప్రధాన పార్టీల అగ్రనేతలు ఇక ప్రచారానికి దిగనుండగా ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు