logo

Vizianagaram news : మాట్లాడి.. ముంచేస్తున్నారు!

బాధితుల సంఖ్య ఇటీవల ఎక్కువవుతోంది. మాయమాటలు చెప్పి.. మోసగించడం అవతలి వారి పనైతే.. సులువుగా సొమ్ము ఇచ్చేస్తూ గందరగోళానికి గురవడం బాధితుల వంతవుతోంది. విద్యావంతులు, ఉద్యోగులు, అధికారులు సైతం ఇందులో ఇరుక్కుపోతున్నారు.

Updated : 10 Aug 2022 07:14 IST

సైబర్‌ నేరాలను మించిపోతున్న ఫోన్‌కాల్‌ దోపిడీలు

హలో అంటూ మాటలు కలుపుతారు.. నమ్మేటట్లు మాయమాటలు చెబుతారు.. అవసరమైతే కుటుంబ సభ్యులతోనూ ముచ్చటిస్తారు.. వారమయ్యాక డబ్బులంటారు.. రూ.వేలల్లో కాజేసి ఉడాయిస్తారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల జరుగుతున్న పలు ఘటనలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. సైబర్‌ కేసులతో సతమతమవుతున్న పోలీసులకు ఈ తరహా చోరీలు కొత్త చిక్కులు తెస్తున్నాయి.

న్యూస్‌టుడే, విజయనగరం నేరవార్తావిభాగం: బాధితుల సంఖ్య ఇటీవల ఎక్కువవుతోంది. మాయమాటలు చెప్పి.. మోసగించడం అవతలి వారి పనైతే.. సులువుగా సొమ్ము ఇచ్చేస్తూ గందరగోళానికి గురవడం బాధితుల వంతవుతోంది. విద్యావంతులు, ఉద్యోగులు, అధికారులు సైతం ఇందులో ఇరుక్కుపోతున్నారు. 2016 నుంచి 2021 వరకు ఉమ్మడి జిల్లాలో 437 వరకు ఈ తరహా కేసులు నమోదు కాగా, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో గత ఏడు నెలల వ్యవధిలో సుమారు 52 కేసులను గుర్తించారు. ఇందులో విజయనగరం ఒకటో పట్టణ స్టేషన్‌ పరిధిలోనే అధికంగా ఉన్నాయి.
‘అత్తా బాగున్నావా..? నేను నీ మేనల్లుడిని.. మీ అమ్మాయి లేదా..? ఎలా ఉన్నావు..?’ అంటూ బాపట్లకు చెందిన మాయగాడు విజయనగరానికి చెందిన 50 ఏళ్ల మహిళకు ఫోన్‌ చేశాడు. ఆమెతో మాట్లాడుతూనే అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరితో ఇదే తీరున ఫోన్‌ చేశాడు. కొన్ని రోజులయ్యాక ముగ్గురి నుంచి రూ.80 వేల వరకు వసూలు చేసి, మోసగించాడు.

విజయనగరానికి చెందిన విద్యార్థి ఓ సైట్‌లో చరవాణిని అమ్మకానికి పెట్టాడు. ప్రకటన చూసిన విశాఖకు చెందిన వ్యక్తి తీసుకుంటానని చెప్పి, విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌కు ద్విచక్రవాహనంతో వచ్చాడు. తన భార్యకు ఫోన్‌ చూపించి వస్తానని, నమ్మకం కలగాలంటే బైక్‌ ఉంచుకోవాలని చెప్పాడు. నమ్మేసిన విద్యార్థి మొబైల్‌ను ఇచ్చేయడంతో నిందితుడి పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇచ్చిన వాహనాన్ని దొంగతనం చేసి తీసుకొచ్చినట్లు గుర్తించారు.

అసలు నమ్మొద్దు..
* తెలియని వ్యక్తులు ఫోన్‌ చేస్తే అప్రమత్తం కావాలి ‌్ర అవతలివారు మభ్యపెట్టేలా మాట్లాడితే అక్కడితో ఆపేయడం మంచిది * కుటుంబ సభ్యులకు చెందిన స్నేహితులు, ఇతరులు కాల్‌ చేస్తే వారికి వెంటనే తెలియజేయాలి * ఎవరైనా డబ్బులు డిమాండు చేస్తే ఆలోచిస్తామని చెప్పాలి. అనుమానమొస్తే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు * బ్యాంకుల నుంచి ఎవరూ నేరుగా ఫోన్‌ చేయరు * పొరపాటున మోసపోతే 24 గంటల్లోగా సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదివ్వాలి

అప్రమత్తత అవసరం
ఒకప్పుడు నేరుగా దొంగతనాలు చేసేవారు. కొన్ని రోజులుగా సైబర్‌ కేసులు జరుగుతున్నాయి. ఇటీవల నేరుగా మాట్లాడుతూ.. సులువుగా సొమ్ము కొట్టేస్తున్నారు. బాధితులే నేరుగా నగదు వేసేలా మభ్యపెడుతున్నారు. సాధ్యమైనంత వరకు అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలి. అనవసర ఫోన్‌కాల్‌లు మాట్లాడొద్దు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఏవైనా ఇబ్బందులుంటే స్టేషన్లలో గానీ.. సైబర్‌స్టేషన్‌ నెంబరు 70131 36137ను గానీ సంప్రదించవచ్చు. - టి.త్రినాథ్‌, డీఎస్పీ

కొన్ని ఘటనలు ఇలా..
‘నా పేరు శివ. రైల్వేశాఖలో లోకోపైలెట్‌గా పనిచేస్తున్నా. మ్యారేజ్‌ బ్యూరోలో మీ ప్రకటన చూశా. చాలా బాగున్నారు. అందుకే ఫోన్‌ చేశా’ అంటూ ఓ ఆగంతకుడు నగరానికి చెందిన యువతితో మాటలు కలిపాడు. మీ తల్లిదండ్రులు ఒప్పుకొంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొన్నిరోజులయ్యాక రూ.20 వేలు కావాలని, నిశ్చితార్థం రోజున ఇచ్చేస్తా అని నమ్మబలికాడు. బాధితురాలు నగదు పంపించాక చరవాణిని ఆపేశాడు. ఇలా ఉమ్మడి జిల్లాతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర జిల్లాలో పలువుర్ని మోసగించిన వ్యక్తిని పార్వతీపురానికి చెందిన యువకుడిగా గుర్తించారు. ఇటీవల దిశా పోలీసులకు చిక్కినట్లే చిక్కి పరారైపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని