logo

మార్కెట్‌ కమిటీల గల్లాపెట్టెలు గలగల

జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల గల్లా పెట్టెలు ఒక్కసారిగా నగదుతో నిండాయి. పౌరసరఫరాల నుంచి ఎప్పటి నుంచో రావల్సిన బకాయిలు కమిటీలకు జమకావడంతో వసూలులో లక్ష్యాన్ని దాటిపోయాయి.

Published : 27 Mar 2023 04:18 IST

లక్ష్యానికి మించి రుసుముల వసూళ్లు
న్యూస్‌టుడే, బొబ్బిలి, పార్వతీపురం పట్టణం

బొబ్బిలిలోని మార్కెట్ కమిటీ చెక్‌పోస్టు

జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల గల్లా పెట్టెలు ఒక్కసారిగా నగదుతో నిండాయి. పౌరసరఫరాల నుంచి ఎప్పటి నుంచో రావల్సిన బకాయిలు కమిటీలకు జమకావడంతో వసూలులో లక్ష్యాన్ని దాటిపోయాయి. మరికొన్ని 200 శాతానికి మించడం విశేషం.

జిల్లాలోని  ఎనిమిది వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి ఈ ఏడాది రూ.10.43 కోట్ల మార్కెట్ రుసుములు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇంతవరకు రూ.12.14 కోట్లు వచ్చాయి. ఇందులో ఇతర పంటల నుంచి వసూలు చేసిన మార్కెట్ రుసుం రూ.5.78 కోట్లు రాగా, పౌరసరఫరాల సంస్థ నుంచి రూ.6.36 కోట్లు జమకావడంతో ఆ మొత్తానికి చేరుకుంది. ఇది 116 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలిన నాలుగు రోజుల వ్యవధిలో మరింత మొత్తం వసూలయ్యే అవకాశం ఉంది.

విడుదలయ్యాయి...

వ్యవసాయ ఉత్పత్తులపై మార్కెట్ కమిటీలు ఒక శాతం పన్ను వసూలు చేస్తున్నాయి. దీనివల్ల కమిటీలకు ఆదాయం సమకూరుతోంది. జిల్లాలో అత్యధికంగా పండేది వరి. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను చేపట్టడంతో మార్కెట్ రుసుములు పెండింగ్‌లో ఉన్నాయి. దీనివల్ల ఏటా కమిటీలు లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయి. ఈ ఏడాది మాత్రం ఆయా బకాయిలు పౌర సరఫరాల నుంచి రూ.6.36 కోట్లు విడుదలయ్యాయి. ఒక్కో కమిటీకి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకూ రావడంతో నిధులు సమకూరాయి. దీంతో లక్ష్యం వంద శాతం దాటిపోయింది.


పార్వతీపురం మన్యం జిల్లాలో మార్కెట్‌ కమిటీల ఆదాయం లక్ష్యాన్ని మించి సమకూరింది. ఈ ఏడాది లక్ష్యం రూ.7.27 కోట్లకు గానూ రూ.11.91 కోట్లు వసూలు అయినట్లు ఏడీ అశోక్‌ కుమార్‌ తెలిపారు.


ప్రణాళికా యుతంగా
- శ్యామ్‌, ఏడీ, మార్కెటింగ్‌శాఖ,  విజయనగరం.

మార్కెట్ కమిటీలు లక్ష్యాలకు చేరువ అయ్యేందుకు ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్లాం. చెక్‌పోస్టుల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేసి రవాణా అయ్యే సరకులపై నిబంధనల మేరకు రుసుములు వసూలు చేశాం. ఆన్‌లైన్‌లో రుసుముల చెల్లింపుపై అవగాహన కల్పించాం. ట్రేడర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. దీనివల్ల ఆదాయం మరింత పెరిగింది. పౌరసరఫరాల నుంచి సకాలంలో బకాయిలు విడుదలయ్యాయి. దీంతో లక్ష్యానికి మించి వసూలు చేయగలిగాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని