logo

గుంత పూడ్చడానికీ.. డబ్బుల్లేవ్‌..!

కొత్త రహదారుల నిర్మాణంతో పాటు పాత వాటిపై ఉన్న గుంతలను పూడ్చాల్సిన బాధ్యత రహదారులు, భవనాల శాఖది.

Updated : 31 May 2023 06:11 IST

పార్వతీపురం-కూనేరు రహదారిపై అర్తాం వద్ద పరిస్థితి

పార్వతీపురం, న్యూస్‌టుడే: కొత్త రహదారుల నిర్మాణంతో పాటు పాత వాటిపై ఉన్న గుంతలను పూడ్చాల్సిన బాధ్యత రహదారులు, భవనాల శాఖది. జిల్లాలో ఏటా రోడ్ల నిర్వహణకు రూ.కోటిన్నర వరకు అవసరం కాగా ప్రభుత్వం బడ్జెట్‌లో 272 ప్రధాన పద్దులో కేటాయిస్తుంది. జిల్లాల వారీగా సమర్పించిన ప్రతిపాదనల మేరకు విడుదల చేస్తుంది. ప్రస్తుతం నిర్వహణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో ర.భ.శాఖ ఆధ్వర్యంలో రోడ్లపై గుంతలున్నా బాగు చేయలేని పరిస్థితిలో ఇంజినీరింగ్‌ విభాగం ఉండిపోతోంది.

ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు భారీ వాహనాలు జిల్లా మీదుగా రాకపోకలు సాగిస్తుండటంతో ఎక్కడికక్కడ రహదారులపై గోతులు పడుతున్నాయి. ఈ సమయంలో వర్షాలు పడితే ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. గతంలో రాష్ట్ర హైవేల నిర్వహణ బాధ్యతను ఐదేళ్ల పాటు గుత్తేదారులకు అప్పగించేవారు. పెద్దా, చిన్నా లేకుండా ఎలాంటి మరమ్మతులు అయినా వారు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎక్కడైనా గుంతలు పడితే వాటిని పూడ్చడానికి ప్రభుత్వమే నిధులు విడుదల చేస్తూ వస్తుంది. 2022-23లో నిర్వహణ పనులకు రాష్ట్ర రహదారులకు రూ.77 లక్షలు, జిల్లా స్థాయి మేజర్‌ రోడ్లకు రూ.54 లక్షలు మంజూరయ్యాయి. దీంతో పనులు చేపట్టగా ఇప్పటికీ కొన్నింటికి బిల్లుల చెల్లింపులు జరగలేదు.

బాగు చేయాల్సి ఉంది

జిల్లాలో రహదారులు, భవనాల శాఖ పరిధిలో 463.726 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వీటిలో 180 కిలోమీటర్ల పొడవున నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉంది. దీని కోసం రూ.85.54 లక్షలు అవసరమవుతుంది. కురుపాం, బలిజిపేట, సీతంపేట, తోటపల్లి, వీరఘట్టం, సీతానగరం సెక్షన్ల పరిధిలో 15 కిలోమీటర్లకు పైగా రహదారులను మెరుగుపర్చాల్సి ఉందని ర.భ.శాఖ అంచనా వేసింది. వీటితో పాటు మేజర్‌ జిల్లా రహదారులు, జిల్లా రహదారులు 565.813 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. వీటిలో 297 కిలోమీటర్ల మేర ఈ ఏడాది నిర్వహణ పనులు చేపట్టాలి. ఇందుకోసం రూ.120.31 లక్షలు అవసరమని ప్రతిపాదించారు. ఇప్పటికే పలు చోట్ల రోడ్లు పాడవుతున్న నేపథ్యంలో వాటిని బాగు చేయకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.  

నిధులు వస్తాయని చూస్తున్నాం

ఏటా రహదారుల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఈ సారి రూ.205.85 లక్షలతో జిల్లాలో రాష్ట్ర, జిల్లా రహదారుల నిర్వహణకు ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటి వరకు మంజూరు కాలేదు. అత్యవసర పనులు గుర్తించి ఉన్నంతలో చేస్తున్నాం. గతేడాది నిర్వహణ పనులు కూడా పూర్తి చేశాం. దానికి సంబంధించి కొంత మొత్తం రావాల్సి ఉంది. ఈ ఏడాది కూడా నిధులు వస్తాయని ఆశిస్తున్నాం. వచ్చిన వెంటనే ప్రతిపాదిత పనులు చేస్తాం.

జేమ్స్‌, ర.భ.శాఖ ఈఈ, పార్వతీపురం మన్యం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని