logo

నామపత్రం.. నేడే ఆరంభం

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 11 శాసనసభ స్థానాలు, విజయనగరం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. తొలి రోజు నెల్లిమర్ల వైకాపా అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు నామినేషన్‌ దాఖలు చేస్తారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.

Published : 18 Apr 2024 05:11 IST

19, 24న ముహూర్తాలు

కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 11 శాసనసభ స్థానాలు, విజయనగరం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. తొలి రోజు నెల్లిమర్ల వైకాపా అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు నామినేషన్‌ దాఖలు చేస్తారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. వైకాపా అభ్యర్థుల్లో ఈ నెల 19న చీపురుపల్లి- మంత్రి బొత్స సత్యనారాయణ, గజపతినగరం- బొత్స అప్పలనర్సయ్య, బొబ్బిలి- శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, కురుపాం- పాముల పుష్పశ్రీవాణి, పాలకొండ-  కళావతి, శృంగవరపుకోట- కడుబండి అప్పలనాయుడు, రాజాం- డాక్టర్‌ రాజేశ్‌, 24న పార్వతీపురం- అలజంగి జోగారావు, 22 లేదా 24న విజయనగరం- కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్‌ వేయనున్నట్లు సమాచారం. సాలూరు అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర 19న పత్రాలపై ముహూర్తానికి సంతకాలు చేసి 24న దాఖలు చేస్తారని తెలిసింది.


ఈనాడు-విజయనగరం, న్యూస్‌టుడే- విజయనగరం అర్బన్‌, రాజాం: ఎన్నికల అధ్యాయంలో ప్రథమ ఘట్టం గురువారం మొదలు కానుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి రోజే ప్రధాన పార్టీల శ్రేణుల నుంచి నాయకుల వరకు ఆత్రుత కనిపించింది. ముహూర్త బలంతో మంచి ఆధిక్యత వస్తుందనే నమ్మకంతో పలువురు పండితులను ఆశ్రయించారు. మరికొందరు ఆయా పార్టీల అధినేతల నుంచి బి-ఫారాలు అందుకోవడం నుంచి నామినేషన్‌ పత్రాలపై సంతకం పెట్టే వరకు శుభఘడియలు చూసుకున్నారు.

రెండు రోజులు మంచివే

18న దశమి, 19న ఏకాదశి ముహూర్తం బాగుంటుందని పండితులు సూచించడంతో అత్యధికంగా అభ్యర్థులు ఈ రెండు రోజుల్లో నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తొలిరోజు 18 కావడంతో తొమ్మిది సంఖ్య కూడా అదనపు బలాన్ని తెస్తుందని చెబుతున్నారు. తొలి రోజు కొందరు, రెండో రోజు 19న మరికొందరు దాఖలు చేసే అవకాశం ఉంది. మిగిలిన వారు ఈ నెల 24వ తేదీన ముహూర్తం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

కూటమి అభ్యర్థుల్లో నెల్లిమర్ల- నాగమాధవి, గజపతినగరం- కొండపల్లి శ్రీనివాస్‌, రాజాం- కోండ్రు మురళీమోహన్‌ 19న, పాలకొండ - నిమ్మక జయకృష్ణ 20న, పార్వతీపురం- బోనెల విజయచంద్ర, కురుపాం- జగదీశ్వరి 22న, చీపురుపల్లి- కిమిడి కళా వెంకటరావు, ఎస్‌.కోట-  కోళ్ల లలితకుమారి, విజయనగరం-  అదితి గజపతిరాజు, సాలూరు- గుమ్మిడి సంధ్యారాణి 24న నామినేషన్లు దాఖలు చేస్తారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. మిగిలిన వారు ఇంకా ముహూర్తాలు పెట్టుకోలేదని తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు 19న వేయనున్నట్లు సమాచారం.

సీసీ కెమెరాల నిఘాలో..

పూర్తిగా సీసీ కెమెరాలు, రికార్డింగ్‌ నడుమ ప్రక్రియ జరగనుంది. నామపత్రాలు స్వీకరించే గది, అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద కెమెరాలు ఏర్పాటు చేశారు. పోటీ చేయబోయే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించి పత్రాలు అందజేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నాగలక్ష్మి తెలిపారు. నామపత్రాలపై సూచనలు, సలహాలకు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌తో పాటు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సువిధ యాప్‌ ద్వారా దాఖలు చేసిన వారు, వాటి ప్రతులను భౌతికంగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేయాలని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని