logo

జనాలు తక్కువ.. జెండాలెక్కువ

విజయనగరం సమీపంలోని చెల్లూరులో మంగళవారం వైకాపా సిద్ధం సభ పేలవంగా సాగింది.

Updated : 24 Apr 2024 05:57 IST

సిద్ధం సభతో ఇక్కట్లు

 

ట్రాఫిక్‌ అంతరాయంతో చోదకుల అవస్థలు

విజయనగరం పట్టణం, రింగురోడ్డు, మయూరి కూడలి, అయ్యన్నపేట, కంటోన్మెంట్‌, గ్రామీణం, కోట, డెంకాడ, భోగాపురం, నెల్లిమర్ల, పూసపాటిరేగ, న్యూస్‌టుడే: విజయనగరం సమీపంలోని చెల్లూరులో మంగళవారం వైకాపా సిద్ధం సభ పేలవంగా సాగింది. ఎండ కారణంగా చాలామంది ఆలస్యంగా వచ్చారు. అంతకు ముందు ప్రాంగణమంతా వెలవెలబోయింది. సభ కోసం భారీగా ఆర్టీసీ బస్సులను కేటాయించారు. అవేవీ సకాలంలో చేరుకోలేదు. సీఎం వచ్చి ప్రసంగం ప్రారంభించినా ఇంకా వస్తూనే ఉన్నాయి. వేదికతో పాటు ప్రాంగణమంతా జెండాలతో నింపేశారు. అనుకున్నంత స్థాయిలో జనాలు రాకపోవడంతో డ్రోన్‌ కెమెరాల్లో ఎక్కువ మంది వచ్చినట్లు చూపించేందుకు వాటిని పీకి పక్కన పడేశారు. చాలామంది సీఎం ప్రసంగం కాకుండానే వెళ్లిపోయారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. సభకు తీసుకొచ్చిన వారిలో ఎక్కువగా ఉపాధి కూలీలు, మహిళా సంఘాల సభ్యులున్నారు. విజయనగరం ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు సాయంత్రం వేళ ఉపాధి పనులకు వెళుతుండగా.. వారిని కూడా అడ్డగించి, సభకు తీసుకెళ్లారు.

రహదారుల దిగ్బంధం

విజయనగరం- విశాఖ, చెల్లూరు- గొట్లాంకు వెళ్లే రెండు ప్రధాన రహదారులకు మధ్యలో వేదిక ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచే వాహనాలు, ప్రయాణికులు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేదిక లోపలికి చరవాణులను అనుమతించలేదు.

బస్సులన్నీ ఖాళీ..

సభ కోసం ఏకంగా 1100 వరకు ఆర్టీసీ బస్సులను కేటాయించారు. ఒక్కో గ్రామానికీ రెండు, మూడు చొప్పున పంపించారు. అయితే చాలావరకు నిండలేదు. కొన్ని ఖాళీగానే చెల్లూరు చేరుకున్నాయి. గంట్యాడ మండలానికి వెళ్లిన బస్సుల్లో కొన్ని ఐదారుగురితోనే వచ్చేశాయి. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ఒక్కొక్క డివిజన్‌కు 5 నుంచి 10 బస్సులు ఏర్పాటు చేశారు. సాయంత్రం 3 గంటలు దాటిన తర్వాత కూడా పలుచోట్ల కదల్లేదు. వాలంటీర్ల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలను తరలించారు.
అమలాపురం డిపో నుంచి వచ్చిన ఆరు బస్సులు విజయనగరం తోటపాలెం నాయుడుకాలనీలో నిలిపివేశారు. దగ్గర ప్రాంతాల్లోని ప్రయాణికుల కోసమైనా వీటిని వినియోగించాల్సిందని అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు.

పెట్రోల్‌ మాది.. ప్రచారం మీది

జగన్‌ సభకు కార్యకర్తలను భారీ సంఖ్యలో తరలించేందుకు నాయకులు పెట్రోల్‌ కూపన్లు అందజేశారు. వాటితో తమ వాహనాలకు పెట్రోలు కొట్టించుకునేందుకు అందరూ ఒక్కసారిగా రావడంతో చింతలవలస సమీపంలోని ఓ పెట్రోలు బంకు కిక్కిరిసిపోయింది.
న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం


 సాయంత్రం 4 గంటల వరకు..

మాది బొబ్బిలి మండలం పిరిడి గ్రామం, మా అమ్మాయి అత్తవారిది శ్రీకాకుళం జిల్లా కందివలస. అక్కడికి నా కుమార్తెను తీసుకెళ్లేందుకు వచ్చాం. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్టాండులోనే పడిగాపులు కాశాం. అన్నీ సభలకు తరలిస్తే ఎలా.
రెడ్డి అప్పారావు, పిరిడి

  అన్నీ సభకు తరలిస్తే ఎలా?

ఆర్టీసీ బస్సులన్నీ సీఎం సభకు తీసుకెళ్లిపోతే ఎలా. మేము రామేశ్వరం యాత్ర ముగించుకుని వచ్చాం. చీపురుపల్లి సమీపంలోని మా గ్రామానికి వెళ్లడానికి విజయనగరం బస్టాండుకు వచ్చాం. రెండు గంటల పైగా ఉన్నా బస్సులు రాలేదు. వచ్చిన ఒక్క దాంట్లో ఎక్కడానికి వీలులేకుండా ఉంది.    
 ఎస్‌.రామచంద్ర, చీపురుపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని