logo

వేదన వినండి

ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. కలెక్టరేట్‌కు వచ్చి తమ వేదన వినిపించుకుంటే పరిష్కారం లభిస్తుందన్న ఆశ. సోమవారం నిర్వహించిన ‘స్పందన’లో కనిపించిన కొంతమందిని పలకరించినపుడు తమ ఆవేదన వినిపించారు

Published : 31 Jan 2023 01:51 IST

- ఈనాడు, ఒంగోలు

ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. కలెక్టరేట్‌కు వచ్చి తమ వేదన వినిపించుకుంటే పరిష్కారం లభిస్తుందన్న ఆశ. సోమవారం నిర్వహించిన ‘స్పందన’లో కనిపించిన కొంతమందిని పలకరించినపుడు తమ ఆవేదన వినిపించారు


చక్రాల కుర్చీలో స్పందన భవన్‌కు వస్తున్న యాకూబ్‌

మర్రిపూడి మండలం యల్లంపల్లికి చెందిన యాకూబ్‌ బెంగళూరులో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవారు. తొమ్మిదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంతో నడవలేని స్థితికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోరుతూ ఇప్పటికి పది దఫాలు స్పందనకు వచ్చి వినతులు అందించారు. తనకు వచ్చే పింఛనుతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని, రేషన్‌ బియ్యమే ఆధారమన్నారు. తనకు సాయం కోరుతూ మరో దఫా వినతి ఇచ్చారు.


ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధ దంపతుల పేర్లు కాశింపీరా, ఖాదర్‌బి. వీరిది కంభం మండలం కందులాపురం. 1994లో గ్రామంలో కొంత స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌  చేయించుకున్నారు. అనంతరం బతుకుదెరువు కోసం కర్నాటక వలస వెళ్లారు. వీరు స్థానికంగా లేకపోవడంతో ఓ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఆ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించేశాడని వీరు వాపోయారు. మండల అధికారులు, పోలీసులను కలిసి తమ సమస్యపై పలు దఫాలు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో సోమవారం కలెక్టర్‌ను కలిసి అర్జీ అందించారు.


ఏడాదిగా వేతనాలు లేవు

కలెక్టర్‌కు సమస్యలు వివరిస్తున్న ఎఫ్‌ఎన్‌ఓలు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పారిశుద్ధ్య కార్మికులుగా, కాపలాదారులుగా, వైద్యులకు సహాయకులుగా (ఎఫ్‌ఎన్‌ఓలు) దాదాపు వందమంది పనిచేస్తున్నారు. ‘ఆప్కాస్‌’ కింద ఒప్పంద ఉద్యోగులుగా ప్రభుత్వం వీరిని నియమించింది. అందరికీ వ్యక్తిగత గుర్తింపు కార్డులూ మంజూరు చేశారు. 60 మందికి మాత్రమే ప్రతీ నెలా వేతనాలు వస్తున్నాయి. మిగిలిన 40 మందికి గత ఏడాదిగా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో సంక్షేమ పథకాలూ వీరి కుటుంబ సభ్యులకు వర్తించకుండా పోయాయి. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ను కలిసి వారంతా తమ గోడు విన్నవించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు