logo

YSRCP: మూడో కృష్ణుడొచ్చారు

వైకాపా సమన్వయకర్తగా రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాకం విజయసాయిరెడ్డి తాజాగా నియమితులయ్యారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తగా నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులిచ్చింది.

Updated : 26 Jul 2023 07:38 IST

తొలుత బాలినేనికి ఉద్వాసన
ప్రస్తుతం సమన్వయకర్తలుగా బీదా, కరుణాకర్‌రెడ్డి
తాజాగా రంగంలోకి విజయసాయిరెడ్డి

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: వైకాపా సమన్వయకర్తగా రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాకం విజయసాయిరెడ్డి తాజాగా నియమితులయ్యారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తగా నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులిచ్చింది. బాధ్యతలు స్వీకరించటమే తరువాయి. ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలతో కునారిల్లుతున్న జిల్లా వైకాపాను విజయసాయిరెడ్డి సమన్వయం చేస్తారా అనే చర్చ సాగుతోంది.

కుమ్ములాటలు.. పోటాపోటీలు...: తొలుత ప్రాంతీయ సమన్వయకర్త హోదా నుంచి మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని బాధ్యతల నుంచి తప్పించారు. నెల్లూరు, చిత్తూరు, కడప బాధ్యతలు అప్పగించారు. మార్కాపురంలో సీఎం పర్యటనలో తలెత్తిన ప్రొటోకాల్‌ వివాదం తర్వాత ఆయన ఆ బాధ్యతల నుంచి కూడా వైదొలిగి కేవలం ఒంగోలు నియోజకవర్గం పైనే దృష్టి సారించి పనిచేస్తున్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావు, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆ విధులు నెత్తికెత్తుకున్నప్పటికీ.. పార్టీలో లుకలుకలు, పలు నియోజకవర్గాల్లో పోటాపోటీ కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోయారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి నూతన ప్రాంతీయ సమన్వయకర్తగా నియమితులయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో అనుబంధ విభాగాల పనితీరును కూడా పర్యవేక్షించారు. నిన్నామొన్నటి వరకు ఉత్తరాంధ్ర బాధ్యతలు చూశారు. ఆ ప్రాంతానికి తానే సీఎం అన్నట్లుగా వ్యవహరించారు. పలు విమర్శలు, ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఇప్పటికే అంతర్గత కుమ్ములాడుతున్న జిల్లాలోని అధికార పార్టీని ఆయన ఎలా సమన్వయం చేసి ఏకతాటిపై నడిపిస్తారో వేచిచూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని