logo

Andhrapradesh news: మంత్రిగారి మాటల మోసం

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసిన గుత్తేదారుల బిల్లుల చెల్లింపునకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అంగీకరించారు.

Updated : 14 Sep 2023 09:21 IST

గుదిబండగానే ట్యాంకర్ల బకాయిలు
నాలుగున్నరేళ్లుగా పైసా విదిల్చలేదు
జీవో ఇచ్చినా బిల్లులకు తప్పని నిరీక్షణ

పెద్దదోర్నాల మండలం రామచంద్రకోటలో ట్యాంకర్ల వద్ద తాగునీరు పట్టుకుంటున్న గ్రామస్థులు(పాత చిత్రం)

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసిన గుత్తేదారుల బిల్లుల చెల్లింపునకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అంగీకరించారు. వారం రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. గుత్తేదారులు అన్‌లైన్‌లో బిల్లులు అప్‌లోడ్‌ చేయించకపోతే త్వరగా పూర్తిచేయండి...

ఇదీ ఆగస్టు 21న మంత్రి ఆదిమూలపు సురేష్‌ చేసిన ప్రకటన.

మంత్రి ప్రకటనతో గుత్తేదారులు ఎంతగానో సంతోషించారు. కాంట్రాక్టర్లలో అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులే ఎక్కువగా ఉండటంతో.. ముఖ్యమంత్రి మాటిస్తే తప్పరని, బిల్లులు విడుదల చేస్తారని ఆశించారు. వై.పాలెం నియోజకవర్గంలో అయితే ఏకంగా సంబరాలే చేసుకున్నారు. వాస్తవ పరిస్థితులు మాత్రం వారికి ఆలస్యంగా అర్థమయ్యాయి. ప్రకటించి రోజులు గడిచినా బిల్లులు మంజూరు కాలేదు. మంత్రి మాటలతో తాము మోసపోయామని గుర్తించారు. చాలా చోట్ల ట్యాంకర్లతో నీటి సరఫరా నిలిపేశారు. ఊకదంపుడు హామీలు తప్ప ఉపయోగం లేదంటూ ఈ నెల 1న మూకుమ్మడిగా ఆందోళన కూడా చేశారు.

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

మొర వినని ప్రభుత్వం...: వేసవిలో నీటి వనరుల లభ్యత లేని చోట ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. అందుకు అత్యవసరం కింద ప్రకృతి వైపరీత్యాల నిధులను కేటాయిస్తుంది. పశ్చిమ ప్రకాశంలో వర్షపాతం తక్కువ కావడంతో సంవత్సరం పొడవునా సమస్య తలెత్తుతుంది. ఆ ప్రాంత వాసులకు ట్యాంకర్ల నీరే దిక్కు. కానీ నాలుగున్నరేళ్లుగా ట్యాంకర్ల గుత్తేదారులకు కోట్లాది రూపాయల మేర బిల్లుల చెల్లింపులు అపరిష్కృతంగా ఉన్నాయి. స్థానిక రవాణాదారులు మొర పెట్టుకుంటున్నా... గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపినా నిధుల విడుదల ఉత్తర్వులకే పరిమితమైంది.

నిధులు లేక జీతాలూ ఇవ్వడం లేదు...: గ్రామాలకు సురక్షితమైన నీరు అందించాలనే ఉద్దేశంతో సమగ్ర రక్షిత మంచి నీటి పథకాలను అమల్లోకి తెచ్చారు. వీటి నిర్వహణకు నిధుల విడుదల అంతా జడ్పీ నుంచి కేటాయిస్తారు. పర్యవేక్షణ గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులది. గత మూడేళ్లుగా గుత్తేదారులకు బిల్లులు పెండింగ్‌ ఉండటంతో పథకాల నిర్వహణ గురించి అంతగా పట్టించుకోవడం లేదు. మరోపక్క పనిచేస్తున్న సిబ్బందికి నెలల తరబడి గుత్తేదారులు వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో సదరు పథకాల నిర్వహణ మొక్కుబడిగానే కొనసాగుతోంది. జిల్లా ప్రజా పరిషత్‌ యాజమాన్య పరిధిలో మొత్తం 50 సీపీడబ్ల్యూ పథకాలున్నాయి. వీటి నిర్వహణకు ఏటా సుమారు రూ.30 కోట్ల నిధులు అవసరం. అందుకు ఆర్థిక సంఘం నిధులే కేటాయిస్తారు. కొందరు గుత్తేదారులు కోర్టుకెళ్లి బిల్లులు తెచ్చుకున్నారు. ఇంకా 14, 15వ ఆర్థిక సంఘం కింద గుత్తేదారులకు మరో రూ.20 కోట్ల వరకు పెండింగ్‌ ఉంది. బిల్లుల చెల్లింపు నిమిత్తం అప్‌లోడ్‌ చేసినా ఆంక్షల కారణంగా జమ కావడం లేదు. దీంతో బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తాగునీటి పథకాలకు సంబంధించి విద్యుత్తు బకాయిల కింద మరో రూ.150 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది.

వైకాపా ప్రభుత్వం  వచ్చినప్పటి నుంచి...

గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి రవాణాకు సంబంధించిన బిల్లులు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పెండింగ్‌ ఉన్నాయి. కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదించడంతో ఈ ఏడాది మే 30న నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు. సుమారు రూ.2 కోట్ల మేర మాత్రమే చెల్లించగా, ఆ తర్వాత నిధుల కోసం నిరీక్షిస్తూ వచ్చారు. నీటి సరఫరా అత్యవసరం అయినా నాలుగేళ్లుగా కోట్లాది రూపాయల మేర బిల్లులు పెండింగ్‌ ఉండటంతో అధికారులకు సైతం సరఫరాపై పర్యవేక్షణ కొరవడింది. ఎన్నికల ఏడాది కావడంతో గుత్తేదారులకు బిల్లుల చెల్లింపు ప్రశ్నార్థకంగా మారింది. నెల రోజుల క్రితం జిల్లాలోని 123 ఆవాస గ్రామాలకు నీటి సరఫరా చేస్తుండగా, ప్రస్తుతం 72 ప్రాంతాలకు తగ్గింది. బిల్లులు ఇవ్వని కారణంగా గుత్తేదారులు కొన్ని గ్రామాల్లో ఇప్పటికే రవాణా నిలిపివేశారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో మొత్తం 17,692 తాగునీటి బోర్లున్నాయి. తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బోర్ల మరమ్మతులు చేపట్టేందుకు గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు గతంలో క్రాష్‌ కార్యక్రమం చేపట్టారు. వీటిలో సుమారు 2 వేల బోర్లు ఎండిపోయినట్లు గుర్తించారు. కొన్ని గ్రామాల్లో వాటి మరమ్మతులకు నిధులు లేక గ్రామ కార్యదర్శులు పట్టించుకోవడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని