logo

Balineni: చెల్లుబాటు కాని బాలినేని మాట.. కింకర్తవ్యం!

అయిదుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి మాట చెల్లుబాటు కాకుండా పోయింది. ఆయన ప్రతిపాదనలను వైకాపా అధిష్ఠానం తోసిపుచ్చింది.

Updated : 31 Jan 2024 08:50 IST

ప్రకాశం సమన్వయకర్తగా చెవిరెడ్డి

 మళ్లీ అలకబూనిన మాజీ మంత్రి

 భవిష్యత్తుపై కుటుంబీకులతో చర్చ

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: అయిదుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి మాట చెల్లుబాటు కాకుండా పోయింది. ఆయన ప్రతిపాదనలను వైకాపా అధిష్ఠానం తోసిపుచ్చింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు ఎంపీ స్థానం కేటాయించేది లేనేలేదని ఖరాఖండిగా తేల్చేసింది. ఆయనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తానన్న ప్రతిపాదనను అంగీకరించకుంది. మాగుంట కాకుంటే కనీసం తన కుమారుడు ప్రణీత్‌రెడ్డినైనా పరిగణనలోకి తీసుకోవాలని చేసిన ప్రతిపాదననూ సమ్మతించకుంది. అదే సమయంలో ఒంగోలు పార్లమెంట్‌ స్థానం నుంచి తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోటీ చేస్తారని చెప్పింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల పార్టీ సమన్వయకర్త బాధ్యతలను కూడా ఆయనకే కట్టబెట్టేందుకు సిద్ధమైంది. దీంతో బాలినేనికి పరాభవం ఎదురైనట్లైంది. ఇదే మీ నిర్ణయమైతే నా దారి నేను చూసుకుంటానంటూ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన్ను బుజ్జగించే యత్నం చేసినా వినలేదు. భవిష్యత్తు కార్యాచరణపై కుటుంబీకులతో సమాలోచనలు సాగిస్తున్నారు. ఈ పరిణామాలతో జిల్లా రాజకీయం మరోసారి వేడెక్కింది.

  •  స్థానికేతరుల వైపే మొగ్గు...: ఒంగోలు పార్లమెంట్‌ స్థానం వైకాపా అధిష్ఠానికి చిక్కుముడిగా మారింది. బాలినేని ఎంతగా పట్టుబట్టినా మాగుంటకు అవకాశం ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. ఇళ్లస్థలాలకు నిధుల మంజూరుతో ఆయన కాస్తంత మెత్తబడినట్లు కనిపించినా, ఆ వెంటనే స్వరం మార్చారు. మాగుంట కోసం తాను ప్రయత్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఇంతలోనే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంత్రి ఆర్కే రోజా పేర్లు తెర మీదకు వచ్చాయి. స్థానికేతరులంటూ వారి అభ్యర్థిత్వం పట్ల బాలినేని విముఖత ప్రదర్శించారు. మాగుంటను కాదనుకుంటే తన కుమారుడు ప్రణీత్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించారు. అందుకు అంగీకరించని అధిష్ఠానం మాత్రం స్థానికేతరుల వైపే మొగ్గు చూపింది. చెవిరెడ్డి పేరునే దాదాపు ఖరారు చేసింది. ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని బాలినేని ఆ పార్టీ పెద్దలకు వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది.
  •  చేసేది లేక వెనుదిరిగిన సజ్జల...: పార్టీ అధిష్ఠానం వైఖరితో అలకబూనిన బాలినేని తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి నేరుగా విజయవాడ వెళ్లారు. బందరు రోడ్డులోని ఓ హోటల్‌లో తన అంతరంగీకులతో సమాలోచనలు చేపట్టారు. బాలినేని మరోసారి అలకబూనిన విషయం తెలుసుకున్న అధిష్ఠానం సలహాదారు సజ్జలని రంగంలోకి దింపింది. ఆయన నేరుగా హోటల్‌ వద్దకు వెళ్లి సుమారు గంటన్నరసేపు బుజ్జగింపులు చేపట్టారు. పార్టీలో మీ ప్రాధాన్యానికి ఢోకా లేదని హామీ ఇచ్చినప్పటికీ బాలినేని శాంతించలేదని సమాచారం. సాయంత్రం మూడు గంటలకు సీఎంతో భేటీకి అపాయింట్‌మెంట్‌ ఉన్నప్పటికీ సీఎంవోకు వెళ్లకుండా మాగుంట సీటు విషయం తేల్చాల్సిందేనని పట్టుబట్టినట్లు తెలిసింది. బుజ్జగించినా ప్రయోజనం లేకపోవటంతో చేసేదేమీ లేక సజ్జల వెనుదిరిగారు.
  •  ఏం చేద్దామంటూ సమాలోచనలు...: మాగుంటకు టికెట్‌ కేటాయించలేమంటూ స్పష్టం చేయడం.. ప్రతిపాదనలను కనీసం ఖాతరు చేయకపోవడంతో బాలినేని తన కుమారుడు ప్రణీత్‌రెడ్డి, వియ్యంకుడు భాస్కర్‌రెడ్డిలతో హోటల్‌లో సమావేశమై భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. బాలినేని నిర్ణయం కోసం అనుచరులు ఇప్పుడు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆయన మాగుంటతో కలిసి తెదేపాలోకి వెళ్లే అవకాశం ఉందని, లేదంటే షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్‌లోకి వెళ్లడాన్నీ కొట్టి పారేయలేమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  • షర్మిల విమర్శించనందుకేనా..!:  మాగుంట విషయం ప్రస్తావించొద్దు అని వైకాపా అధిష్ఠానం పది రోజుల క్రితమే బాలినేనికి సూటిగా చెప్పేసింది. ఆ తర్వాతే ఇళ్ల స్థలాలకు భూ సేకరణ నిమిత్తం నిధులు మంజూరు చేసింది. అప్పటికి 42 రోజులుగా ఒంగోలుకు దూరంగా ఉన్న బాలినేని విజయోత్సవం పేరుతో ఒంగోలులో బల ప్రదర్శన నిర్వహించారు. ఇక మాగుంట జోడీ లేకపోయినా ఆయన ఒంగోలు నుంచే బరిలో ఉంటారని అంతా భావించారు. ఇంతలోనే ఒక్కసారిగా కథ మారిపోయింది. ఈ నెల 27న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల ఒంగోలులో కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో వై.వి.సుబ్బారెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టిన ఆమె.. అదే సమయంలో ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే బాలినేనిలను మాత్రం పల్లెత్తు మాట అనలేదు. ఈ అంశం కూడా వైకాపా వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే వైకాపా అధిష్ఠానం బాలినేని మాటలను పట్టించుకోవడం లేదనే చర్చ సాగుతోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని