logo

Balineni: వద్దు చెవిరెడ్డి.. నేనే ఎంపీ: వ్యూహం మార్చిన బాలినేని

మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యూహం మార్చినట్లు తెలిసింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాకుండా పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను సుముఖంగా ఉన్నానంటూ తాడేపల్లి ప్యాలెస్‌కు సంకేతాలు పంపినట్లు సమాచారం.

Updated : 04 Feb 2024 09:20 IST

తాడేపల్లి ప్యాలెస్‌కు ప్రతిపాదన

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యూహం మార్చినట్లు తెలిసింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాకుండా పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను సుముఖంగా ఉన్నానంటూ తాడేపల్లి ప్యాలెస్‌కు సంకేతాలు పంపినట్లు సమాచారం. తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని వైకాపా అధిష్ఠానం జిల్లా ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించింది. ఈ నిర్ణయంపై బాలినేని అలకబూనారు. అనంతరం హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ కీలక అనుచరులతో సమాలోచనలు సాగిస్తున్నారు. జిల్లాపై తన పట్టును పోగొట్టేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని భావిస్తున్నారని.. ఈ క్రమంలోనే చెవిరెడ్డిని తెర పైకి తెచ్చినట్లు భావిస్తున్నారు. ఆయనకు చెక్‌ పెట్టేందుకు తానే పార్లమెంట్‌ బరిలో నిలవాలనే ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది.

చంద్రగిరికి చెక్‌ పెట్టే వ్యూహం: జిల్లా వైకాపా రాజకీయం ఇప్పటి వరకు బాలినేని చుట్టూ పరిభ్రమిస్తోంది. అధిష్ఠానం మాత్రం ఆయన ప్రాధాన్యాన్ని క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి కోసం బాలినేని పట్టుబట్టడంతో అది కుదిరే పనికాదని ఇప్పటికే తాడేపల్లి తేల్చిచెప్పింది. ఆయన స్థానంలో చెవిరెడ్డిని ప్రతిపాదించింది. అంతటితో ఆగకుండా ఆయన్ను ప్రాంతీయ సమన్వయకర్తగానూ నియమించింది. దీంతో కంగుతిన్న మాజీ మంత్రి.. మరోసారి అలకబూని హైదరాబాద్‌ వెళ్లారు. జిల్లాలో చెవిరెడ్డి అడుగు పెడితే ఇన్నాళ్లుగా సాగిన తన  ప్రభ అడుగంటిపోతుందని శ్రీనివాసరెడ్డి ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

ఇటు భేటీలు.. అటు పరుగులు: ఇదిలా ఉంటే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శుక్రవారం అర్ధరాత్రి బాలినేనితో భేటీ అయ్యారు. అంతకుముందు గిద్దలూరు, మార్కాపురం ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కుందురు నాగార్జునరెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రితో శుక్రవారం సాయంత్రం ఆయన భేటీ అయ్యారు. అనంతరం బయుదేరి హైదరాబాద్‌ వెళ్లి రాత్రి సుమారు 11.15 గంటల నుంచి సుమారు 12 గంటల వరకు బాలినేనితో సమాలోచనలు సాగించారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులపై చర్చించి అభ్యర్థులకు సహకరించాలని కోరినట్లు తెలిసింది. చెవిరెడ్డి వెళ్లిపోయిన తర్వాత ఆయన తన కీలక అనుచరులతో మరోసారి భేటీ అయ్యారని.. జిల్లాపై పట్టు సాధించే యోచనలో ఉన్న చెవిరెడ్డికి చెక్‌ చెప్పాలంటే తాను ఎంపీగా పోటీ చేయడం ఒక్కటే మార్గమని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ద్వారా తాడేపల్లి ప్యాలెస్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. జిల్లా సమన్వయకర్తగా వస్తూనే చెవిరెడ్డి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. జేసీ, ఎస్పీల బదిలీల్లో ఇప్పటికే చక్రం తిప్పారు. ఈ పరిణామాలతో మాజీ మంత్రి అనుచరులు కంగుతిన్నారు. ఇంకా ఉపేక్షిస్తూ కూర్చుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని భావించారు. ఈ క్రమంలోనే బాలినేని తన వ్యూహాన్ని మార్చారు. తొలుత తన తనయుడు ప్రణీత్‌ రెడ్డిని ప్రతిపాదించినప్పటికీ.. ఇప్పుడు తానే ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమనే సంకేతాలను అధిష్ఠానానికి పంపారనే చర్చ సాగుతోంది.


కుందురుకు స్థానికేతర చిక్కు...

మార్కాపురం నుంచి గిద్దలూరుకు బదిలీపై వెళ్లిన కందురు నాగార్జునరెడ్డికి చిక్కులు తప్పేలా లేవు. నియోజకవవర్గ మార్పుపై నాగార్జునరెడ్డి మొదటి నుంచీ అయిష్టంగానే ఉన్నారు. అధిష్ఠానం నచ్చజెప్పడంతో విధి లేక వెళ్లారు. ఇప్పటికే గిద్దలూరు టికెట్‌ను ఆశించి భంగపడిన ఆశావహులు స్థానికేతర అంశాన్ని ఇప్పుడు బలంగా లేవనెత్తుతున్నారు. కుందురు హయాంలో మార్కాపురంలో చోటుచేసుకున్న భూ అవినీతి, అక్రమాలపై కూడా గళమెత్తాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కొందరు నాయకులు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని