logo

ఆనందం.. అంతలోనే విషాదం

కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.

Published : 29 Mar 2024 01:45 IST

వివాహానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు
రోడ్డు ప్రమాదంలో వధువు తల్లి, ఇద్దరు బంధువుల దుర్మరణం

కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీస్తున్న పోలీసులు

టంగుటూరు, న్యూస్‌టుడే: కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. వారి సంతోషం చూసి విధికి కన్నుకుట్టిందేమోగాని, కొన్ని గంటల్లోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ముగ్గురిని కబళించింది. దీంతో పెళ్లి కుమార్తె ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. అత్యంత హృదయ విదారకమైన ఈ సంఘటన టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం శివారున 16వ నంబరు జాతీయ రహదారిపై గురువారం ఉదయం 6 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వధువు తల్లి, మేనమామ భార్య, పిన్ని కూతురు దుర్మరణం పాలవగా.. వధువు సోదరుడు, మేనమామ, మేనమామ కుమారులు గాయాలపాలయ్యారు. కుటుంబ సభ్యులు, పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన రాయని అరుణ కుమార్తెకు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తపాల్వంచకు చెందిన యువకుడితో సంబంధం కుదిరింది. బుధవారం రాత్రి 9 గంటలకు వరుడి స్వగ్రామంలో వివాహమైంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు బస్సుల్లో హాజరయ్యారు. అనంతరం వధువు తరఫున బంధువులంతా ఆయా వాహనాల్లో కందుకూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. వధువు తల్లి అరుణ, సోదరుడు వేణు, మేనమామ తలపునేని వినోద్‌, ఆయన భార్య దివ్య, వారి కుమారుడు రామ్‌, పిన్ని కూతురు గుళ్లాపల్లి శ్రావణిలు కారులో బయలుదేరారు. గురువారం ఉదయం వీరు ప్రయాణిస్తున్న కారు తూర్పునాయుడుపాలెం వద్దకు వచ్చేసరికి వాహనం నడుపుతున్న వినోద్‌ నిద్రలోకి జారుకోవడంతో పక్కనే రోడ్డు అంచున ఉన్న ఫెన్సింగ్‌ సిమెంట్‌ దిమ్మెలను వేగంగా ఢీకొంది. ఈ క్రమంలో కారు పల్టీలు కొడుతూ రెండు దిమ్మెలను ఢీకొట్టి మరో దిమ్మెకు తగిలి ఆగింది. దీంతో వాహనం మొత్తం నుజ్జయింది. రాయని అరుణ(50), తలపనేని దివ్య(30), గుళ్లాపల్లి శ్రావణి (22)ల తలలకు తీవ్ర గాయాలు కావడంతో కారులోనే మృతిచెందారు. రాయని వేణు (27), తలపనేని వినోద్‌(35)లకు తీవ్ర గాయాలుకాగా.. చిన్నారి రామ్‌ (3)కు చిన్నపాటి గాయాలై ప్రాణాలతో బయటపడ్డారు. బస్సుల్లో వస్తున్న బంధువులు సంఘటనా స్థలం వద్ద ఆగారు. విగతజీవులుగా పడిఉన్న వారిని చూసి విలపించారు.

క్షతగాత్రుల హాహాకారాలు..

వేగంగా వెళ్తున్న కారు పల్టీలు కొట్టడంతో భారీ శబ్దం వచ్చిందని, లోపల ఉన్నవారు హాహాకారాలు చేశారని ఘటన చూసిన వాహన చోదకులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన కొందరు వాహన చోదకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న టంగుటూరు ఎస్సై నాగేశ్వరరావు, సింగరాయకొండ సీఐ రంగనాథ్‌, అగ్నిమాపక, జాతీయ రహదారి భద్రత, పెట్రోలింగ్‌ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. కారులో ప్రాణాలతో ఉన్న వారిని బయటకు తీసి 108 వాహనం ద్వారా ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. ప్రమాద  స్థలానికి ఒంగోలు డీఎస్పీ కిషోర్‌ కుమార్‌ చేరుకొని జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్ట్‌మార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కి తరలించారు.

ప్రమాదంలో నుజ్జయిన కారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని