logo

దేవుడా.. నీ భూములనూ వదల్లేదు..!

పశ్చిమ ప్రకాశంలోని పలు ప్రసిద్ధ ఆలయాల మాన్యం భూములు ఈ అయిదేళ్ల వైకాపా పాలనలో ఆక్రమణల పాలయ్యాయి. అంతకు ముందు కొంత భూమినే ఆక్రమించుకున్న అక్రమార్కులకు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరీ అడ్డూ అదుపు లేకుండా పోయింది.

Published : 17 Apr 2024 03:33 IST

అయిదేళ్లలో చెలరేగిన వైకాపా నాయకులు
అడ్డూ అదుపు లేకుండా ఆక్రమణలు
ధూప, దీప  నైవేద్యానికి ఇబ్బందులు

పొదిలమ్మ దేవాలయం ముందు వెలిసిన గృహాలు

మార్కాపురం, పొదిలి, న్యూస్‌టుడే: పశ్చిమ ప్రకాశంలోని పలు ప్రసిద్ధ ఆలయాల మాన్యం భూములు ఈ అయిదేళ్ల వైకాపా పాలనలో ఆక్రమణల పాలయ్యాయి. అంతకు ముందు కొంత భూమినే ఆక్రమించుకున్న అక్రమార్కులకు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరీ అడ్డూ అదుపు లేకుండా పోయింది. మార్కాపురం పట్టణం, మండల పరిధిలోని గ్రామాల పరిధిలో ఉన్న చెన్నకేశవుడి భజంత్రీలకు సంబంధించిన మాన్యం భూమికి ఆక్రమణదారులు శఠగోపం పెట్టారు. అధికారపార్టీకి చెందిన నాయకుల అండదండలతో ఆక్రమణదారులు ఏకంగా ఆక్రమించుకొని స్వాధీనం చేసుకున్నారు. రూ కోట్లు విలువైన మాన్యం భూమిని ఆక్రమించుకోవడం ఆ తర్వాత ఆ భూమి మాది, అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పడంతో వివాదం ప్రస్తుతం కోర్టుల్లో నడుస్తున్నాయి.‌్ర మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానానికి ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ రికార్డుల ప్రకారం ఈ దేవాలయానికి అన్ని చోట్లా సర్వీసుల ఇనాంకు చెందిన దేవస్థానం భూమి 269.55 ఉండేది. ప్రస్తుతం దేవస్థానానికి చెందిన భూమి కేవలం 58.23 ఎకరాలు మాత్రమే ఉంది. దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆక్రమణలు ఎంత జరిగాయో.‌్ర కొనకనమిట్ల మండలంలోని అంబాపురం గ్రామంలో శివాలయానికి చెందిన మాన్యం భూమి 91.29 ఎకరాలు ఉంది. అయితే ఈ భూమిని కౌలుకు పెట్టకుండా గ్రామానికి చెందిన పెద్దల ముసుగులో అధికార పార్టీకి చెందిన నాయకుల కనుసన్నల్లో భూమి మొత్తం ఉంది. వారే సాగు చేసుకోని స్వామి వారికి దూప, దీప నైవేద్యం చేయకుండా స్వామి వారి భూమిని అనుభవిస్తున్నారు. ‌్ర పొదిలిలోని పొదిలమ్మ, పోలేరమ్మ దేవాలయం భూములు క్రమంగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఈ అయిదేళ్లకాలంలో ఆక్రమణలు పెరిగాయి. ప్రభుత్వం ఆక్రమణలను నిలువరించడంలో విఫలమవడంతో క్రమంగా ఆక్రమణలు పెరుగుతున్నాయి. చిన్నబస్టాండ్‌ సమీపంలోని పోలేరమ్మ దేవాలయం చుట్టూ కూడ ఆక్రమణలు వెలిశాయి. ప్రస్తుతం దేవాలయానికి లోపలికి వెళ్లేందుకు సరైన దారి కూడ లేకుండా చుట్టూ దుకాణాలు వెలిశాయి.

బ్రాహ్మణ కార్పొరేషన్‌ నిర్వీర్యం

వైకాపా ప్రభుత్వం 2019 నుంచి 024 వరకు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం బ్రాహ్మణుల కోసం ఒక్క పథకం ప్రవేశపెట్టలేదు. కనీసం ఉన్న పథకాలను కూడా నిలిపివేశారు. గ్రామీణ ప్రాంతాల్లో దేవాదాయాధర్మాదాయశాఖ పరిధిలో ఉన్న దేవాలయాల్లో పూజారులు చాలీచాలని వేతనాలతో జీవిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పూజారుకు నెలకు రూ.5 వేల వేతనం అందజేస్తున్నారు. ఈ వేతనంలో కూడా రూ.2500 పూజా సమాగ్రికి ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కనీస వేతనం ఇవ్వాలి

దేవాదాయధర్మాదాయశాఖ పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రామాలయం వంటి దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులకు కనీస వేతనం ఇవ్వాలి. నెలకు గౌరవ వేతనం కింద రూ.5 వేలు ప్రభుత్వం అందజేస్తోంది. ఈ వేతనంలో సగం పూజ సామగ్రికి ఖర్చు అయిపోతుంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక్క రూపాయి గౌరవ వేతనం పెంపుదల చేయలేదు. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం రూ.18,500 ఇవ్వాలని ప్రభుత్వాలను కోరుతున్నా.

దామసాని ప్రశాంత్‌శర్మ, రామాలయం పూజారి,  వేములకోట

పూర్తిగా ఆగిపోయాయి

పేద బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ కార్పొరేషన్‌ను అమలు చేసిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కింది. ఆయన ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ను వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిధులు లేకుండా నిర్వీర్యం చేశారు.  ప్రతి ఏడాదికి బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని గొప్పలు చెప్పింది. కనీసం ఒక్క రూపాయి విదల్చలేదు. బ్రాహ్మణుల కోసం ఏర్పాటు చేసిన పథకాలన్నీ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయాయి.

ఓరుగంటి మల్లిక్‌, బ్రాహ్మణ సంఘం నాయకుడు, మార్కాపురం

రుణం అందలేదు

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పేద బ్రాహ్మణుడికి కార్పొరేషన్‌ ద్వారా రుణం అందలేదు. రాయితీ రుణాలు ఊసే లేకుండా పోయింది. బ్రాహ్మణకార్పొరేషన్‌కార్యాలయం కూడా తాళం వేసే పరిస్థితికి వచ్చింది. నిధులు లేని కార్యాలయంలో ఛైర్మన్లు, డైరెక్టర్లు ఎందుకు పని చేస్తారు. కనీసం వారికి నిధులు ఇవ్వకుండా ఏవిధంగా కార్పొరేషన్‌ను నడుపుతారు.  బ్రాహ్మణులపై దాడులు జరిగాయి ప్రభుత్వం ఒక్క చర్య తీసుకోలేదు. కనీసం కేసులు కూడా నమోదు చేయలేదు.

మేడవరం మల్లికార్జునశర్మ, బ్రాహ్మణ సేవా సంఘం నాయకుడు, మార్కాపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని