logo

‘కోతల’రాయుడు

పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆచరణలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పథకాల వారీగా ఇప్పటికే కోతలు పెట్టారు.

Published : 18 Apr 2024 03:32 IST

ఇంటింటా సంక్షేమమంటూ కబుర్లు
ఉత్తుత్తి బటన్లు నొక్కి సంబరాలు
నెలలుగా ఖాతాలకు జమ కాని నగదు
ఎన్నికల ముంగిట మరో జగ‘న్నాటకం’
న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆచరణలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పథకాల వారీగా ఇప్పటికే కోతలు పెట్టారు. ఆరంచెలు అంటూ ఏటికేటికీ ఒక్కో పథకాన్ని నీరుగార్చారు. లబ్ధిదారుల సంఖ్యనూ గణనీయంగా తగ్గించారు. గతంలో లబ్ధి అందుకున్న వారినీ దూరం చేశారు. సరాసరిన నెలకు 300 యూనిట్ల విద్యుత్తు వాడకం, పింఛను, నాలుగు చక్రాల వాహనం ఉన్నా కోతలతో వాతలు పెట్టారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ముగింట వాగ్దానాలను అమలు చేస్తున్నామంటూ బహిరంగ సభలు పెట్టి ఆర్భాటంగా బటన్లు నొక్కారు. అందుకు సంబంధించి నెలలైనా ఖాతాలకు ఇంకా నగదు జమ కాలేదు. దీంతో ఉత్తుత్తి బటన్లు నొక్కి సీఎం తమను మోసం చేశారని.. ఎన్నికల వేళ ఇది మరో జగన్నాటకమంటూ మహిళలు బహిరంగంగా విమర్శిస్తున్నారు.


ఎస్సీ, ఎస్టీ మహిళలకు మోసం

పథకం పేరు: వైఎస్సార్‌ చేయూత
జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు: 98,848 మంది
ప్రకటించిన ఆర్థిక లబ్ధి: రూ.185.34 కోట్ల మేర
బటన్‌ నొక్కింది: మార్చి 7వ తేదీ
క్షేత్రస్థాయిలో పరిస్థితి: నెల రోజులు దాటినా ఇంకా 70 శాతం మహిళల ఖాతాలకు నగదు జమ కాలేదు. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ మహిళల్లో 50 శాతం మందికే జమ అవగా, బీసీ, మైనార్టీలకు వారికి ఊసే లేదు. వైఎస్సార్‌ చేయూత కింద ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ మహిళల్లో 50 శాతం మందికే నగదు జమైంది. బీసీ, మైనార్టీలకు చెందిన మహిళలకు ఇంకా నగదు జమ కాలేదు. పలువురు నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. నగదు జమ కాకపోవడంతో ఈసురోమంటూ వెనుదిరిగి వెళ్తున్నారు. ఉత్తుత్తి బటన్‌ నొక్కి జగన్‌ తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నేస్తమంటూ ఈబీసీలకు ద్రోహం...

 

పథకం పేరు: వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం
జిల్లాలోని లబ్ధిదారులు: 38,001 మంది
ప్రకటించిన ఆర్థిక ప్రయోజనం: రూ.57.కోట్లు
చివరి విడత నగదు విడుదల: గత నెల 14
తాజా పరిస్థితి: నెల రోజులు గడిచినప్పటికీ లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లోఒక్కరికి కూడా నగదు జమ కాలేదు. ఈబీసీ నేస్తం పథకానికి 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు అగ్రకులాల మహిళలు అర్హులు. వీరిలో జీవన ప్రమాణాలను మరింత మెరుగు పరచడంతో పాటు, ఆర్థికంగా సాధికారత సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం వారికి రూ.15 వేలు చొప్పున వరుసగా నాలుగు సంవత్సరాలు తోడ్పాటు అందించనున్నట్లు వైకాపా ప్రభుత్వం ప్రచారం చేసింది. నెల రోజులు దాటినా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లోఒక్కరికి కూడా నగదు జమ కాకుండటంతో వారంతా ఈసురోమంటున్నారు.


ఆసరా ఇచ్చేది ఇలాగేనా!

పథకం పేరు: వైఎస్సార్‌ ఆసరా
మొత్తం స్వయం సహాయక సంఘాలు: 36,769
అందులోని సభ్యులు: 3,59,506 మంది
జమ కావాల్సిన నిధులు: రూ. 50 కోట్లు
బటన్‌ నొక్కింది: జనవరి 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్‌ నాలుగో విడత నగదు జమంటూ బటన్‌ నొక్కారు.
సంబరాలంటూ నాటకాలు: ఆ తర్వాత ఆసరా సంబరాల పేరుతో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో కార్యక్రమాలు చేపట్టారు. మహిళలను బలవంతంగా తరలించి సభలు ఏర్పాటు చేశారు. ప్రదర్శనలు నిర్వహించారు.
వాస్తవ పరిస్థితి: బటన్‌ నొక్కి మూడు నెలలవుతున్నా ఇంకా ఎక్కువ సంఘాలకు నగదు జమ కాలేదు. సదరు మహిళలు బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నారు.‌

స్వయం సహాయక సంఘాల మహిళలు 2019 ఏప్రిల్‌ 11 నాటికి తీసుకుని బకాయి ఉన్న బ్యాంక్‌ లింకేజీ రుణాలను వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో రుణ మాఫీ చేస్తామని వైకాపా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నాలుగో విడత కింద రూ.280.50 కోట్ల నగదును బ్యాంక్‌ ఖాతాలకు జమ చేయాలి. గత మూడేళ్లుగా మూడు విడతల్లో కొంత జమ చేయగా, నాలుగో విడత అమలుకు ఇటీవల శ్రీకారం చుట్టారు. అందులో ఓసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు సంబంధించి మరో రూ.50 కోట్ల మేర నిధులు జమ కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని