logo

నగదు చోరీలో ఇంటి దొంగలు

ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఇండియన్‌ పెట్రోల్‌ బంకు వద్ద సీఎంఎస్‌ వాహనం నుంచి గురువారం చోరీకి గురైన రూ.66 లక్షల నగదు కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ తెలిపారు.

Published : 20 Apr 2024 02:58 IST

స్వాధీనం చేసుకున్న నగదును పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌, పోలీసులు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఇండియన్‌ పెట్రోల్‌ బంకు వద్ద సీఎంఎస్‌ వాహనం నుంచి గురువారం చోరీకి గురైన రూ.66 లక్షల నగదు కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంతనూతలపాడు మండలం కామేపల్లివారిపాలేనికి చెందిన సన్నమూరి మహేష్‌, రాచర్ల రాజశేఖర్‌ కలిసి ఈ నేరానికి పాల్పడినట్లు వివరించారు. ఈ కేసులో ఫిర్యాదిగా ఉన్న సీఎంఎస్‌ సంస్థ ఒంగోలు బ్రాంచి మేనేజర్‌ గుజ్జుల పెదకొండారెడ్డి ప్రమేయంతోనే తాము ఈ నేరానికి పాల్పడినట్లు ప్రధాన నిందితుడు విచారణలో తెలిపాడన్నారు. ఈ మేరకు అతన్ని కూడా నిందితుడిగా చేర్చి విచారిస్తున్నట్లు చెప్పారు. ప్రధాన నిందితుడు మహేష్‌ గతంలో సీఎంఎస్‌లో పనిచేసి మానేశాడని, ఏటీఎంలలో నింపేందుకు నగదు తరలించే క్రమంలో సీఎంఎస్‌ సంస్థ నిర్దేశిత ప్రమాణాలు పాటించలేదని ఎస్పీ సుమిత్‌ సునీల్‌ తెలిపారు. నగదుతో కూడిన వాహనం ఎక్కడైనా నిలిపి ఉంచినప్పుడు డ్రైవర్‌ పాటు ఇద్దరు సాయుధ గార్డులు కాపలా ఉండాలని, వాహనంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మల్టిపుల్‌ లాక్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వాహనంలోని నగదు చోరీకి గురైన సమయంలో సంబంధిత ఏజెన్సీ ఇవేవీ పాటించలేదని చెప్పారు. చోరీ విషయం తెలిసిన వెంటనే అదనపు ఎస్పీ(క్రైమ్స్‌) ఎస్వీ.శ్రీధర్‌రావు, డీఎస్పీ కిషోర్‌బాబు ఆధ్వర్యంలో ఒంగోలు తాలూకా సీఐ భక్తవత్సలరెడ్డి, సీసీఎస్‌ సీఐ టి.విజయ్‌కృష్ణ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ వివరించారు. దర్యాప్తులో కీలకపాత్ర పోషించిన ఎస్సైలు పున్నారావు, విజయ్‌కుమార్‌, మద్దిపాడు ఎస్సై వి.మహేష్‌లతో పాటు క్రైమ్‌ పార్టీ ఏఎస్సైలు టి.బాలాంజనేయులు, కె.సురేష్‌, నాగేశ్వరరావు, రమేష్‌బాబు, హెడ్‌ కానిస్టేబుళ్లు రామకృష్ణ, రాంబాబు, ఖాజావలి, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని