logo

అడవిలో ఇళ్లిచ్చిన అన్న

నవరత్నాలు..పేదలందరికీ ఇళ్లు అంటూ జగన్‌ ప్రకటనతో మురిసిపోయిన వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ముఖ్యమంత్రి చెప్పిన మర్మం అయిదేళ్ల తర్వాత తెలియడంతో వారంతా ఖిన్నులయ్యారు.

Published : 20 Apr 2024 03:11 IST

దిక్కుతోచని పేదలు
రూ.కోట్లు దోచుకున్న వైకాపా నేతలు
జగనన్న కాలనీల పేరిట మాయ

నవరత్నాలు..పేదలందరికీ ఇళ్లు అంటూ జగన్‌ ప్రకటనతో మురిసిపోయిన వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ముఖ్యమంత్రి చెప్పిన మర్మం అయిదేళ్ల తర్వాత తెలియడంతో వారంతా ఖిన్నులయ్యారు. కొండలు, గుట్టలు, శ్మశానాలు, ఊరికి సుదూరంగా..నివాసయోగ్యం కాని భూముల్లో స్థలాలు కేటాయించడంతో దిక్కుతోచని వారయ్యారు. తమకు గూడు కాదు గోడు మిగిలిందని.. అసలు లబ్ధి పొందింది మాత్రం వైకాపా నేతలేనని లబ్ధిదారులు విలపిస్తున్నారు.

అబ్బో మూడిళ్లు కట్టేశారు: తూర్పు కోడిగుడ్లపాడులో జగనన్న కాలనీ దుస్థితి

ఒంగోలు గ్రామీణం, కనిగిరి న్యూస్‌టుడే: జగనన్న లేఅవుట్‌లో ఇంటి స్థలంతోపాటు, పక్కాగృహం మంజూరు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఆ హామీని నెరవేర్చలేకపోయారు. 2019లో అధికారంలోకి వచ్చాక 2020 డిసెంబర్‌ నెల 25న ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. అప్పటికే రూపొందించిన లేఅవుట్లల్లో పట్టాలు సైతం ఇచ్చి లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేశారు. ఏడాదికల్లా అందులో ఇల్లు కట్టుకోవాలని చెప్పినా..నివాసయోగ్యం కానివి కావడంతో వారెవరూ ఆసక్తి చూపలేదు.

ఇచ్చే రూ.లక్షన్నరకు ఎంత ఆర్భాటమో: గ్రామీణ, పట్టణ ప్రాంతాల వ్యత్యాసం లేకుండా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. అందులోనే ఉపాధిహామీ పథకం కింద కూలీల ఖర్చులు రూ.30 వేలుపోనూ, లబ్ధిదారులకు చేతికి వచ్చేది రూ.1.50 లక్షలు మాత్రమే. రాయితీపోనూ లబ్ధిదారుని నెత్తిన మరో రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు భారం పడుతోంది. ప్రతి వారం బిల్లులు జమ చేస్తామని అధికారులు ప్రకటించినా సకాలంలో రాలేదు. రుణాలిప్పిస్తామని ప్రభుత్వం మాటలతో కాలక్షేపం చేయడంతో బ్యాంకులు కూడా ముందుకు రాలేదు.

చిట్టడవుల్లో స్థలానికి రూ.7 కోట్లు

‘కొండ’ంత దూరం: కనిగిరికి దూరంగా కొండల్లో కాలనీ

ఇదిగో ఈ చిత్రం  జగనన్న లే అవుట్‌లోని ఓ ఇంటి పునాది. కనిగిరి పట్టణానికి ఆరు కిలోమీటర్ల కనిగిరి చిట్టడవులు, కొండలు, గ్రానైట్‌ గుట్టలున్న చోట జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. అదే ఓ విచిత్రమంటే.. అక్కడి స్థలాన్ని రూ.7 కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేసి 1129 మందికి ఇళ్లు మంజూరు చేశారు. అయిదేళ్లలో కనీసం 150 గృహాలు కూడా పూర్తి కాలేదు.

గృహాలు లేవు.. 400 విద్యుత్తు స్తంభాలు

రూ.కోట్ల ఖర్చు..పూర్తయింది ఈ ఇల్లు గుమ్మలంపాడులో వైచిత్రి

చూడండి ఇది మరీ వి‘చిత్రం’ ఈ ఆర్చి ఉన్నది పామూరు మండలం గుమ్మలంపాడు వద్ద జగనన్న కాలనీ. ఇక్కడ ఏడొందలమందికి ఇళ్లు మంజూరు చేశారు. వైకాపా నేతల స్వలాభం కోసం చౌడు నేల ఎంపికచేశారు. రూ. కోటి ఖర్చు చేశారు. అది చాలదన్నట్లు గృహాలు నిర్మించక ముందే రూ 1 కోటి వెచ్చించి నాలుగొందల విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ చేపట్టిన ఒకే ఒక్క గృహం అసంపూర్తిగా మిగిలింది.

నాలుగు రెట్ల దోపిడీ

వైకాపా ప్రభుత్వం వచ్చిన ఆరంభం నుంచే జిల్లావ్యాప్తంగా 656 జగనన్న లేఅవుట్ల నిమిత్తం భూ సేకరణ చేశారు. ప్రతి గ్రామంలోనూ సరాసరిన 4 నుంచి 5 ఎకరాల వరకు ప్రభుత్వ భూమితోపాటు, ప్రైవేట్‌ భూమిని సేకరించారు. మార్కెట్లో సరాసరిన ఎకరా పొలం రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు ఉండగా, స్థానిక ప్రజాప్రతినిధులు సిఫార్సు మేరకు రూ.30 లక్షల వరకు చెల్లించారు. ఇలా కొన్నిచోట్ల నాలుగురెట్ల మేర దోచుకున్నారు. ఇందులో సింహభాగం అధికార పార్టీ నేతలకే చేరిందన్న ఆరోపణలున్నాయి. లేఅవుట్లల్లో మెరక, అంతర్గత రహదారుల నిర్మాణానికి ఉపాధి హామీ నుంచి నిధులు కేటాయించారు. మొక్కుబడిగా పనులు చేసి కోట్లాది రూపాయలతో జేబులు  నింపుకున్నారు.

వసతులు విస్మరించిన పాలకులు

జగనన్న లేఅవుట్లల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రధానమైన తాగునీరు, విద్యుత్తు సౌకర్యం, అంతర్గత రహదారుల మాట మరిచారు. జిల్లాలో సగం లేఅవుట్లు ఊరికి దూరంగా ఉండటంతో రాకపోకలకు వీలుగా రహదారి కూడా లేదు. కొన్నిచోట్ల స్తంభాలు ఏర్పాటు చేసినా విద్యుత్తు సరఫరా ఊసే లేదు. జలజీవన్‌ మిషన్‌ పథకం కింద కాలనీల్లో ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి ఇవ్వాలని ప్రతిపాదించారు. బిల్లుల భయంతో గుత్తేదారులు ఎవరూ పనులు చేపట్టేందుకు ముందుకు రాలేదు. దీంతో తాగునీటితోపాటు, వాడుక నీటిని దూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో తాగునీటి పైపులైన్లు వేసినా నీటి వనరుల లభ్యత సమస్యగా మారింది.

నిర్మాణం తడిచి మోపెడై..

ఇంటి కట్టుబడి, క్యూరింగ్‌ అవసరాలకు తొట్టెలు నిర్మించి, స్థానికంగా ఉన్న పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తామని హడావుడి చేశారు. అది కూడా అరకొరగానే జరగడంతో కొందరు లబ్ధిదారులు ట్యాంకర్లను ఏర్పాటు చేసుకున్నారు. అందుకు ఒక్కో ట్యాంకర్‌కు రూ.500 చొప్పున అదనపు వ్యయం. ఇవన్నీ తడిచి మోపెడయ్యాయి.  

గృహ ప్రవేశాలకూ విముఖత

జిల్లా వ్యాప్తంగా సుమారు 14 వేల ఇళ్లల్లో సామూహిక గృహ ప్రవేశాలు చేశారు. కనీస మౌలిక వసతులు లేకపోవడంతో ఎందుకొచ్చిన తలనొప్పి అంటూ మిగతా లబ్ధిదారులు వాటికీ ముందుకు రాలేదు. కలెక్టర్‌తోపాటు, మండల ప్రత్యేకాధికారులు ప్రతి వారం లేఅవుట్లు సందర్శన.. ఇళ్ల నిర్మాణాలపై లబ్ధిదారులతో మాట్లాడటం.. ఇదో ప్రహసనంలా మిగిలింది.


కనిగిరిలో జగనన్న ఇంటి దుస్థితి ఇది..

కనిగిరి:  కనిగిరి నియోజకవర్గంలో 6867 గృహాలు మంజూరు కాగా పూర్తయింది మాత్రం 1622 మాత్రమే!  రూ.30 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులు వెచ్చించి భూములు కొనుగోలు చేశారు. ఇవన్నీ పట్టణాలకు దూరంగా..కొండలు, శ్మశానాలకు దగ్గరగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే నగదు ఏ మాత్రం చాలడంలేదని, అప్పుల పాలవుతున్నామంటూ వారు చేతులెత్తేశారు. కనిగిరి అర్బన్‌ పరిధిలో 1807 ఇళ్లు మంజూరు కాగా కేవలం 150 లోపే పూర్తయ్యాయి.  పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. పామూరు మండలం తూర్పుకోడిగుడ్లపాడులో జగనన్న లేవుట్లో కేవలం మూడు ఇళ్లు మాత్రమే నిర్మించారు. ఇదే మండలం గుమ్మలంపాడు జగనన్న కాలనీలో భాగంగా ఒకే ఒక ఇల్లు నిర్మించారు.


గ్రానైట్‌ పేలుళ్లు భరించలేక ఇంటి నిర్మాణం వదిలేశాం  

మాకు కనిగిరి మోడల్‌ స్కూల్‌ సమీపంలో స్థలం ఇచ్చారు. ఇల్లు కొంత నిర్మించాక.. ఆ పక్కనే గ్రానైట్‌ క్వారీలున్నాయని తెలిసింది. పేలుళ్లతో గుండె గుభేలుమంటోంది. మా స్థలం వద్ద భూమి అదురుతోంది. దీంతో పునాదితోనే వదిలేశాం.

తిరుపతమ్మ, కనిగిరి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని