logo

వీడిన ఉత్కంఠ..

ఎచ్చెర్ల నియోజకవర్గ తెదేపాలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఇక్కడ తొలి నుంచి పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు, సీనియర్‌ నేత కలిశెట్టి అప్పలనాయుడు సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు.

Updated : 30 Mar 2024 05:24 IST

విజయనగరం ఎంపీ అభ్యర్థిగా అప్పలనాయుడు
బొత్సను ఢీకొట్టనున్న కళా

ఎచ్చెర్ల నియోజకవర్గ తెదేపాలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఇక్కడ తొలి నుంచి పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు, సీనియర్‌ నేత కలిశెట్టి అప్పలనాయుడు సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. పొత్తులో భాగంగా అనూహ్యంగా ఎచ్చెర్లను భాజపాకు కేటాయించారు. దీంతో వారిద్దరికీ పార్టీ అధిష్ఠానం విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో సర్దుబాటు చేసింది. కళా వెంకటరావుకు చీపురుపల్లి అసెంబ్లీ, కలిశెట్టికి విజయనగరం పార్లమెంట్‌ స్థానాలను కేటాయించింది.

ఈనాడు, విజయనగరం, న్యూస్‌టుడే, ఎచ్చెర్ల


ఎచ్చెర్ల నుంచి చీపురుపల్లి

పేరు: కిమిడి కళావెంకటరావు
వయసు: 71
భార్య: చంద్రమౌళి
పిల్లలు: రామ్‌మల్లిక్‌నాయుడు, అన్నపూర్ణసాయిని యశస్విని
విద్యార్హత: బీఏ బీఎల్‌
స్వగ్రామం: రేగిడి

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావుకు అవకాశం దక్కింది. 1983, 1985, 1989, 2004 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో అప్పటి ఉణుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డైరెక్టర్‌గా, ఏపీ టూరిజం డైరెక్టర్‌, 1984లో తితిదే పాలక మండలి సభ్యుడిగా పనిచేశారు. 1985లో ఎన్టీఆర్‌ మంత్రి వర్గంలో పురపాలక, వాణిజ్యపన్నుల శాఖ మంత్రిగా సేవలు అందించారు. 1988లో హోం మంత్రిగా పదవి చేపట్టారు. 1989లో తితిదే పాలక మండలి అధ్యక్షుడిగా పని చేశారు. 1998లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎచ్చెర్ల స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2014లో ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా ఎన్నికై ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2015-21 తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. ప్రస్తుతం తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఎచ్చెర్ల నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. వైకాపాలో కాపు నాయకుడిగా ఎదిగి అధికార పార్టీ  రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న బొత్సకు రాజకీయంగా చెక్‌  పెట్టాలన్న ఉద్దేశంతో తెదేపా అధినేత కళావెంకటరావును ఎంపిక చేశారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.


కలిశెట్టికి కలిసొచ్చె..

  • కలిశెట్టి అప్పలనాయుడు
  • వయసు 49
  • విద్యార్హత: బీఏ, బీఎల్‌

విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా జిల్లాకు చెందిన కలిశెట్టి అప్పలనాయుడు పేరును ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఆది నుంచి ఎచ్చెర్ల శాసనసభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చొరవ తీసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. రణస్థలం మండలం వరహనరసింహపురం కలిశెట్టి స్వగ్రామం. తల్లిదండ్రులు సూరప్పమ్మ, బోడినాయుడు. భార్య ప్రభానాయుడు. రైతు కుటుంబంలో పుట్టి పెరిగి రాజకీయాల్లో ఆసక్తితో తెదేపాలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. పొందూరు మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడిగా.. పాతపట్నం నియోజకవర్గ పార్టీ బాధ్యుడిగా పని చేశారు. పార్టీ ఉత్తరాంధ్ర నాయకత్వ శిబిరం డైరెక్టర్‌గా పని చేశారు.

కలిశెట్టికి మిఠాయి తినిపిస్తున్న లోకేశ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు