logo

కేజీబీవీల్లో దోపిడీ!

ప్రజాధనాన్ని పక్కదారి పట్టించడంలో వైకాపా నాయకులను మించిన పాత్ర సమగ్ర శిక్షాలో పని చేస్తున్న కొందరు అధికారులు పోషిస్తున్నారు.

Published : 17 Apr 2024 04:55 IST

నిత్యావసర సరకుల కొనుగోలులో అవకతవకలు
బిల్లుల మంజూరులో అధికారుల ఉదాసీనత
ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, న్యూస్‌టుడే కలెక్టరేట్‌ (శ్రీకాకుళం)

ప్రజాధనాన్ని పక్కదారి పట్టించడంలో వైకాపా నాయకులను మించిన పాత్ర సమగ్ర శిక్షాలో పని చేస్తున్న కొందరు అధికారులు పోషిస్తున్నారు. బాలికల విద్యను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలకు నిత్యావసర సరకుల కొనుగోళ్లలో భారీగా అక్రమాలకు పాల్పడుతూ అందినకాడికి దోచేస్తున్నారు. టెండర్ల ప్రక్రియ నుంచి నిత్యావసర సరకుల సరఫరా వరకు తమ కనుసన్నల్లో జరిగేలా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. అంతా వారు అనుకున్న ప్రకారం తతంగం నడిపించి బిల్లులు సృష్టించడంలో తెలివి ప్రదర్శిస్తున్నారు. అధికారులను సైతం మెప్పించి సొమ్ము చేసుకుంటున్నారు. భారీగా మెక్కుతున్నా అంతా పారదర్శకంగా జరిగినట్లు తనిఖీల్లో చూపుతుండటం గమనార్హం.

జిల్లాలోని 25 కేజీబీవీలు, 13 ఆదర్శ పాఠశాలలకు కూరగాయలు, పండ్లు, పాలు, కోడి మాంసం, గుడ్లు సరఫరాకు 34 మంది గుత్తేదారులు టెండర్లు వేయగా నలుగురిని ఎంపిక చేశారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. టెండర్లు దాఖలు చేసిన వారిలో పత్రిక ధరలకే సరకులు ఇస్తామని సమారు ఏడుగురు ఉండగా కొందరికే మొత్తం కట్టబెట్టడంలో అధికారులు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. గుత్తేదారులు అధికంగా బిల్లులు పెడుతున్నా ఎలాంటి అభ్యంతరం లేవనెత్తకుండా చెల్లించేస్తుండటం గమనార్హం. టెండరు నిబంధనల ప్రకారం గుడ్లు, పాలు, కోడి మాంసం పేపరు ధరలకు సరఫరా చేయాలి. కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపల్స్‌ బిల్లులను ఉన్నతాధికారులకు పంపుతుండగా అక్కడా పచ్చజెండా ఊపేస్తున్నారు.

నిబంధనలకు తూట్లు..

టెండర్‌ ఒప్పందంలో నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఏజెన్సీలను ఎంపిక చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులకు అనుకూలంగా ఉన్నవారికి, ధరలు ఎక్కువగా కోడ్‌ చేసిన వారికి నిత్యావసర సరకుల సరఫరాకు అనుమతులు ఇచ్చేశారు. కూరగాయలు, గుడ్లు, పాలు, చికెన్‌ సరఫరాకు టెండర్లను 2023 ఆగస్టులో పిలిచారు. పత్రికలో ధరల ఆధారంగా గుడ్లు, చికెన్‌ సరఫరా చేయాలని టెండర్‌ ప్రకటనలో స్పష్టం చేశారు. 2023 ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 5వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆరో తేదీన సీల్డు టెండరు బాక్సును సంయుక్త కలెక్టర్‌ సమక్షంలో తెరిచినా పారదర్శకత లేదనే విమర్శలు వస్తున్నాయి. నందిగాం, సంతబొమ్మాళి, రణస్థలం, ఇతర కేజీబీవీలకు పాలు, గుడ్లు, కోడి మాంసం సరఫరా చేసిన మహిళ పేరిట బిల్లు పెట్టాలి. మరో వ్యక్తి పేరిట బిల్లులు పెట్టారు. ఇలాంటివి కోకొల్లలుగా ఉన్నాయి.

మౌనంగా అధికారులు..

నిత్యావసర సరకుల సరఫరాకు గుత్తేదారులను ఎంపిక చేసే కమిటీకి సంయుక్త కలెక్టర్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. సరకులు సరఫరా చేసే సమయానికి  పత్రికలో ఉన్న ధరను అనుసరించాలి. అందుకు భిన్నంగా మొత్తం వ్యవహారం సాగుతున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బిల్లులు ఇష్టానుసారం పెడుతున్నా ప్రిన్సిపాళ్లు సంతకాలు చేసేస్తున్నారు. ఈక్రమంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నా పర్యవేక్షించాల్సిన అధికారులు మౌనంగా ఉండటం గమనార్హం.


గుడ్డులోనే మింగుతున్నారు..

కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలకు కోడిగుడ్ల సరఫరాలోనే నెలకు రూ.లక్షలు కాజేస్తున్నారు. గతేడాది డిసెంబరు 10న పత్రిక ధర ప్రకారం కోడిగుడ్డు ధర రూ.5.64 ఉండగా ఆ నెల మొత్తానికి రూ.6.30తో బిల్లులు పెట్టారు. గుత్తేదారులు పెట్టిన ధరకే ప్రిన్సిపల్స్‌ పరిశీలించకుండా సంతకాలు పెట్టేశారు. ఆపై అధికారులు వాటిని మంజూరు చేయడం గమనార్హం. గుత్తేదారు సరఫరా చేసిన కూరగాయలు, పండ్లు, గుడ్లు, కోడి మాంసం ధరల్లో వ్యత్యాసం, నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే వారిపై చర్యలు తీసుకోవాలి. పత్రిక ధరకు మించి వారు బిల్లులు పెడుతున్నా ప్రిన్సిపల్‌... ఆపై అధికారులు వాటిని పరిశీలించకుండా మంజూరు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు