logo

నిర్వాహకుల దశ ‘తిరిగిందా’?

విశాఖ నగరంలో చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా 338 టాటా ఏఎస్‌ వాహనాలను సమకూర్చింది. ఇవి రెండు నెలలుగా సేవలందిస్తున్నాయి.

Published : 18 Jan 2022 05:30 IST

 ‘చెత్త’ బండి లోగుట్టు.. ఎవరికెరుక!
లెక్కల్లేకుండా 338 వాహనాలకు నిధులు
కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

విశాఖ నగరంలో చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా 338 టాటా ఏఎస్‌ వాహనాలను సమకూర్చింది. ఇవి రెండు నెలలుగా సేవలందిస్తున్నాయి. వాటిని సమకూర్చిన గుత్తేదారుకు ఈ నెలాఖరుకు బిల్లులు చెల్లించడానికి మెకానికల్‌ విభాగ ఇంజినీరింగ్‌ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. అయితే అవి ఎన్ని కిలోమీటర్లు తిరిగాయనే వివరాలు జీవీఎంసీ వద్ద లేకపోవడం గమనార్హం.

పర్యవేక్షణ కొరవడి
ఒప్పందంలో భాగంగా కేటాయించిన సచివాలయ పరిధిలో నిత్యం మూడు సార్లు చెత్తను సేకరించి, తరలింపు కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. నిత్యం 35 కిలోమీటర్ల నుంచి 42 కిలోమీటర్లు తిరగాలి. వార్డు సచివాలయంలో పారిశుద్ధ్యం, పర్యావరణ కార్యదర్శి పర్యవేక్షణలో వాహనాలు తిరిగాలని జీవీఎంసీ కమిషనర్‌ ఆదేశించారు. ఏ రోజు వాహనం నిలిచిపోయింది, ఎన్ని ట్రిప్పులేసిందనే విషయాలను వార్డు కార్యదర్శితోపాటు, చెత్త తరలింపు కేంద్రంలోని వర్కు ఇన్‌స్పెక్టర్‌ పర్యవేక్షించాల్సి ఉంటుంది. చాలా మంది వారి కళ్లు గప్పి ట్రిప్పులు తిరగకుండా ఆపేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే వాహనం మరమ్మతుకు గురై నిలిచిపోయినా, బిల్లులో జీవీఎంసీ కోత విధించడానికి లేదు.


* వివరాలు ఇక్కడ లేవు

ప్రజారోగ్య విభాగంలో సేవలందిస్తున్న ప్రతి వాహనానికి జీపీఎస్‌ వ్యవస్థ ఉండాలి. నగరంలోని గుత్తేదారుల నుంచి జీవీఎంసీ  అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్న వాహనాలకు జీపీఎస్‌ వ్యవస్థ అమర్చారు. వాహనం ఏ రోజు ఎక్కడ తిరిగింది, ఎన్ని ట్రిప్పులు తిరిగిందనే అంశాలన్నీ అందులో ఉంటాయి. ఆ మేరకు బిల్లులు చెల్లిస్తున్నారు.
* ప్రభుత్వం సమకూర్చిన 338 వాహనాలతోపాటు, మరో 246 వాహనాలను గుత్తేదారుల నుంచి తీసుకుని చెత్త సేకరణకు వినియోగిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా సమకూరిన వాహనాలు ఎన్ని కిలోమీటర్లు తిరిగాయో జీవీఎంసీ వద్ద లెక్కలు లేవు. వారిచ్చిన బిల్లుల ప్రకారం నిధులు జమచేయాల్సి ఉంటుంది. ఆయా వాహనాల జీపీఎస్‌ వ్యవస్థ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ వద్ద ఉందని అధికారులు చెబుతున్నారు.
ఆ వ్యవస్థను జీవీఎంసీలోని కమాండ్‌ కంట్రోల్‌ సిస్టంకు అనుసంధానించాలని అధికారులు లేఖలు రాసినా స్పందన కరవైంది.


నెలకు రూ.210
వాహనాలకు జీపీఎస్‌ వ్యవస్థ అమర్చి, ప్రతి నెలా ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో తెలపడానికి నెలకు రూ.210 మాత్రమే వ్యయమవుతుంది. జీవీఎంసీ 338 వాహనాలకు జీపీఎస్‌ పరికరాలను అమర్చి, లెక్కలు తీసుకుని, స్వచ్ఛాÄంధ్ర కార్పొరేషన్‌ ఇచ్చే లెక్కలతో సరిచూస్తే కొంత వరకు నిధులు ఆదా చేసుకోవచ్చు. దానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఒప్పందంలో భాగంగా నిధులు
క్లాప్‌ కార్యక్రమంలో జీవీఎంసీకి కేటాయించిన వాహనాల జీపీఎస్‌ వ్యవస్థ జీవీఎంసీ దగ్గర లేదు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ వద్ద ఆ వివరాలుంటాయి. జీవీఎంసీకి బదలాయించాలని కోరినా ఇంకా రాలేదు. ఎన్ని కిలోమీటర్లు వాహనం తిరిగిందో లెక్కలు లేకపోయినా, ఒప్పందంలో భాగంగా నిధులు చెల్లించాల్సి ఉంటుంది.
- చిరంజీవి, కార్యనిర్వాహక ఇంజినీరు, మెకానికల్‌ విభాగం


వ్యయం ఇలా...
*ఒక్కో వాహనానికి నెలకు వ్యయం: రూ.68వేలు
* 338 వాహనాలకు...: రూ.2.29కోట్లు
* ఏడాదికి..: రూ. 27.58కోట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని