logo

ఐఐపీఈ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతుల చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఎదగాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుశాఖ సహాయమంత్రి రామేశ్వర్‌

Published : 22 Jan 2022 02:15 IST

స్నాతకోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి

ప్రతిజ్ఞ చేస్తున్న పట్టభద్రులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతుల చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఎదగాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుశాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తెలి అన్నారు. శుక్రవారం వి.ఎం.ఆర్‌.డి.ఎ బాలల ప్రాంగణంలో ‘భారత పెట్రోలియం, శక్తి సంస్థ’ (ఐఐపీఈ) తొలి స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలను అందించి అభినందించారు.. కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ 19వ శతాబ్దంలో పెట్రోలు కంపెనీ అసోమ్‌లో ఉండేదని, ఇక్కడి నుంచి ఎగుమతి జరిగేదని తెలిపారు. బ్రిటిష్‌ పాలకుల తీరుతో దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఐఐపీఈలో చదివిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐఐపీఈ సంచాలకులు ఆచార్య వి.ఎస్‌.ఆర్‌.కె. ప్రసాద్‌ మాట్లాడుతూ 2014లో ఐఐపీఈ మంజూరవగా 2016 నుంచి నిర్వహిస్తున్నామన్నారు. 201 ఎకరాలు పక్కాభవనాలకు కేటాయించగా న్యాయపరమైన చిక్కుల కారణంగా ఇంతవరకు భవనాలకు నోచుకోలేదన్నారు. ఇటీవలే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో అందులో 160ఎకరాల భూమి యాజమాన్యహక్కు లభించిందని తెలిపారు. అంతా సవ్యంగా ఉంటే 2025-26 నాటికి సొంత ప్రాంగణం నుంచి ఐఐపీఈ నిర్వహిస్తామన్నారు. ఐఐపీఈ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ అధ్యక్షులు పి.కె.బానిక్‌ మాట్లాడుతూ ఐఐపీఈ ద్వారా విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తొలుత విద్యార్థులతో ప్రమాణం చేయించారు. 2016-20, 2017-21 సంవత్సరాలకు చెందిన 170మంది విద్యార్థులకు పట్టాలు అందించాల్సి ఉండగా కొవిడ్‌ నిబంధనల వల్ల హాజరైన 65మందికి మాత్రమే అందించారు. రెండు బ్యాచ్‌ల్లోని ఆరుగురు విద్యార్థులకు ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాలు అందించారు.

ఉప రాష్ట్రపతికి ఘన వీడ్కోలు

విశాఖపట్నం జిల్లాలో మూడు రోజుల పర్యటన అనంతరం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక విమానంలో హైదారాబాద్‌కు బయలుదేరారు. విమానాశ్రయంలో మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా సంయుక్త కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి, నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా, నేవీ ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

ఏయూ మైదానంలో ఉదయపు నడక

ఉదయం పూట నడక, యోగ, ధ్యానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. నగరానికి వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం ఏయూ ఫుట్‌బాల్‌ మైదానంలోకి ఉదయపు నడకకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ వ్యాయామం చేస్తున్న క్రీడాకారులతో కొద్దిసేపు మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని