logo

సమరయోధుల పుట్టినిల్లు దిమిలి

స్వాతంత్య్ర సమరయోధుల పుట్టినిల్లు దిమిలి గ్రామం. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆంగ్లేయులు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా దేశభక్తే ఊపిరిగా నిలిచారు. 1920 నుంచి 1942 వరకు సహాయ నిరాకరణ ఉద్యమం నుంచి క్విట్‌ ఇండియా ఉద్యమం వరకు సాగిన అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారు. దీన్ని గుర్తించి దేశానికి స్వాతంత్య్రం

Published : 13 Aug 2022 04:35 IST

రజతోత్సవాల్లో స్తూపం ఆవిష్కరణ

రాంబిల్లి, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర సమరయోధుల పుట్టినిల్లు దిమిలి గ్రామం. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆంగ్లేయులు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా దేశభక్తే ఊపిరిగా నిలిచారు. 1920 నుంచి 1942 వరకు సహాయ నిరాకరణ ఉద్యమం నుంచి క్విట్‌ ఇండియా ఉద్యమం వరకు సాగిన అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారు. దీన్ని గుర్తించి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 1972లో జరుపుకొన్న రజతోత్సవాల్లో దిమిలి ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఉద్యమంలో పాల్గొన్న యోధుల పేర్లతో స్తూపాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శిష్ట్లా రామదాసు, కళానాథభట్ల జగన్నాథాయ చైనులు, శిష్ట్లా పురుషోత్తం, యల్లాయి అప్పలనరసింహం, సేనాపతి అప్పలనాయుడు, నేమాని సత్యనారాయణ, ఇంద్రగంటి కామేశ్వరరావు, శిష్ట్లా శ్యామసుందరమ్మ, చిట్రాజు సోమరాజు, గాదె నారాయణమ్మ తదితర ముఖ్యమైన 15 పేర్లను స్తూపంపై రాశారు. వీరిలో కొందరు ఎలమంచిలి, ఎస్‌.రాయవరం మండలాలకు చెందిన వారు ఉన్నారు. దిమిలి నుంచి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారిలో ముఖ్యంగా జైలు జీవితం గడిపినవారు, జైలులో ప్రసవించిన మహిళా యోధుల పేర్లను స్తూపంపై రాశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న యోధులున్న గ్రామం కావడంతో సంతబయలు వద్ద మహాత్ముడి విగ్రహాన్ని గ్రామస్థులు ప్రతిష్ఠించారు. వర్షాలకు తడవకుండా చతురస్రాకారంలో నిర్మాణం చేపట్టారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర పుస్తకంలో పేజీన్నర వరకు దిమిలి గ్రామం గురించి ఉండటం విశేషమని ఈ ప్రాంతానికి చెందిన పెద్దలు చెబుతున్నారు.

స్వాతంత్య్ర సమరయోధుల పేర్లతో దిమిలిలో ఏర్పాటు చేసిన స్తూపం

దేశానికి స్వాతంత్య్ర యోధులను అందించిన దిమిలి గ్రామం


తిరంగార్యాలీ

భారీ జాతీయ జెండాతో విద్యార్థులు ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. ఎన్‌.ఎస్‌.ఎస్‌. యూనిట్‌ ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులు వంద మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీగా పాల్గొన్నారు. రాచపల్లి కూడలి నుంచి మాకవరపాలెం తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. అవంతి ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సి.మోహనరావు, ఎస్సై రామకృష్ణారావు, అదనపు ఎస్సై సన్యాసిరావు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టారు.

- న్యూస్‌టుడే, మాకవరపాలెం


500 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ

కె.కోటపాడు, న్యూస్‌టుడే: కె.కోటపాడులో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు 500 అడుగుల త్రివర్ణ పతాకంతో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ చేపట్టామని అధికారులు పేర్కొన్నారు. ఎంపీపీ రెడ్డి  జగన్మోహన్‌, జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనూరాధ, ఎస్సై ధనుంజయ, డాక్టర్‌ ఖాసిమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని