logo

ఎత్తుకు పైఎత్తులు.. పంచ్‌మీద పంచ్‌లు..

అమ్మాయిలకు ఆత్మ రక్షణతో పాటు మెదడు చురుకుగా పని చేసేలా ఉపయోగపడే క్రీడ చెస్‌ బాక్సింగ్‌. ఇందులో పట్టు సాధించాలంటే కఠోర సాధనతో పాటు మానసికంగా, శారీరకంగా సన్నద్ధం కావాలి.

Updated : 25 Sep 2022 06:01 IST

జాతీయ చెస్‌ బాక్సింగ్‌ పోటీల్లో అమ్మాయిల సత్తా
టర్కీలో నిర్వహించనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపిక

సాధనలో భాగంగా వ్యాయామం చేస్తున్న అమ్మాయిలు

మ్మాయిలకు ఆత్మ రక్షణతో పాటు మెదడు చురుకుగా పని చేసేలా ఉపయోగపడే క్రీడ చెస్‌ బాక్సింగ్‌. ఇందులో పట్టు సాధించాలంటే కఠోర సాధనతో పాటు మానసికంగా, శారీరకంగా సన్నద్ధం కావాలి. శరీర నియంత్రణ, నైపుణ్యాలు, పట్టుదల, బలం, ఆత్మవిశ్వాసం, చురుకుదనం చాలా అవసరం. ఇటువంటి క్రీడలో రాణిస్తున్నారు పరవాడ మండలం పి.భోనంగిలోని ఓ పాఠశాలలకు చెందిన విద్యార్థులు. కోచ్‌ల వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుని నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జాతీయ స్థాయిలో సత్తాచాటి పతకాలను సాధిస్తున్నారు. ఈనెల 9 నుంచి 11 వరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన జాతీయ చెస్‌ బాక్సింగ్‌ పోటీల్లో సత్తాచాటి నవంబరు 11 నుంచి 17 వరకు తుర్కియే(టర్కీ) దేశంలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. వీరి కుటుంబ నేపథ్యం, క్రీడా సాధన, శిక్షణ తదితర అంశాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.. - న్యూస్‌టుడే, పరవాడ
స్నేహితుల సాధన చూసి..
స్నేహితుల సాధన చూసి క్రీడపై ఆసక్తి పెంచుకున్నా. గత నాలుగేళ్లుగా తర్ఫీదు పొందుతున్నాను. స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సోంపేట. తండ్రి రమేశ్‌ వ్యాపారి. తల్లి సుశీల గృహిణి. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన జాతీయ చెస్‌ బాక్సింగ్‌ పోటీల్లో 58 కేజీల సబ్‌ జూనియర్‌ విభాగంలో ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారిణిలను ఎదుర్కొని బంగారు పతకం సాధించాను. పోటీతత్వం, ఫిట్‌నెస్‌, జ్ఞాపకశక్తి పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ పోటీల్లో పతకమే లక్ష్యంగా సాధన ముమ్మరం చేశాను.   - సాయిసమీరా, 9వ తరగతి

తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో..
తల్లిదండ్రుల, అధ్యాపకుల ప్రోత్సాహంతో చెస్‌ బాక్సింగ్‌ నేర్చుకుంటున్నా. ప్రతిరోజు 2 గంటల పాటు కఠోర సాధన చేస్తున్నా. తండ్రి మెహతాజీ వైద్యులు. అమ్మ దత్తప్రియ గృహిణి. స్వగ్రామం యలమంచిలి దరి తులసీనగర్‌. అహ్మదాబాద్‌ పోటీల్లో 48 కేజీల సబ్‌ జూనియర్‌ జూనియర్‌ విభాగం పోటీల్లో ఇతర రాష్ట్రాల క్రీడాకారులను ఓడించి అంతర్జాతీయ పోటీలకు ఎంపికవడం సంతోషంగా ఉంది. ప్రత్యర్థి చేస్తున్న తప్పులను, శరీర కదలికలపై దృష్టిసారించంతో బాగా రాణిస్తున్నాను.  - ఎన్‌.హాసిని, 9వ తరగతి

ఆత్మరక్షణ కోసమే నేర్చుకున్నా..
కోచ్‌ల సమక్షంలో రోజూ తర్ఫీదు పొందుతున్నాను. స్వగ్రామం నర్సీపట్నం దరి శారదానగర్‌. తండ్రి శ్రీనివాసరావు వ్యాపారి. తల్లి గంగాభవాని గృహిణి. ఆత్మరక్షణ కోసం నాన్న నేర్చుకోమనడంతో ఆసక్తి పెంచుకున్నా. మూడేళ్లుగా ప్రతిరోజూ రెండు గంటల పాటు సాధన చేసి నైపుణ్యాలు పెంచుకుంటున్నా. జాతీయ పోటీల్లో 54 కేజీల సబ్‌ జూనియర్‌ విభాగంలో అర్హత సాధించి అర్హత సాధించాను. పాఠశాలలో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని తగిన పౌష్టికాహారాన్ని తీసుకుంటూ చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తున్నా.- ఎం.తన్వితగాయత్రి, 9వ తరగతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని