logo

అంతని.. ఇంతని.. ఆరంభంతోనే సరి!

ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్‌ వస్తువులను జీవీఎంసీ పరిధిలో నిషేధించి వంద రోజులు కావస్తున్నా అనకాపల్లి అమలు అంతంతమాత్రంగానే ఉంది. ప్రారంభంలో హడావుడి చేసిన జోనల్‌ అధికారులు తర్వాత వాటి జోలికి పోలేదు.

Published : 26 Sep 2022 05:22 IST

అనకాపల్లి, న్యూస్‌టుడే

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నాం. దీనివల్ల నేల, నీరు, గాలి అన్నీ కలుషితం అవుతాయి. అనకాపల్లిలో వ్యాపారాలు ఎక్కువగా జరుగుతాయి. ఇక్కడకు జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి వినియోగదారులు వస్తుంటారు. ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్థాలపై వ్యాపారులే వినియోగదారులకు వివరించాలి. ఇకపై ప్లాస్టిక్‌ వినియోగిస్తే భారీగా అపరాధ రుసుం విధిస్తాం.

- జూన్‌ 2న ప్లాస్టిక్‌ నిషేధంపై అనకాపల్లి కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులతో అప్పటి జీవీఎంసీ కమిషనర్‌ జి.లక్ష్మిశ అన్నమాటలివీ.


కసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్‌ వస్తువులను జీవీఎంసీ పరిధిలో నిషేధించి వంద రోజులు కావస్తున్నా అనకాపల్లి అమలు అంతంతమాత్రంగానే ఉంది. ప్రారంభంలో హడావుడి చేసిన జోనల్‌ అధికారులు తర్వాత వాటి జోలికి పోలేదు. జులై ప్రారంభం నుంచి ఒకసారి వినియోగించి పారేసే 11 రకాల ప్లాస్టిక్‌ వస్తువులపై దేశవ్యాప్తంగా నిషేధం విధించారు. అంతకు ముందే జీవీఎంసీ పరిధిలో నిషేధం అమలులోకి తెచ్చారు. ప్రారంభంలో జోనల్‌ కమిషనర్‌ కె.కనకమహాలక్ష్మి వార్డుల్లో పర్యటించి ప్రజల్ని చైతన్యవంతులను చేసే కార్యక్రమాలు చేపట్టారు. నిషేధించిన పాలిథిన్‌ కవర్లు, వస్తువుల అమ్మకాలు, వినియోగం లేకుండా చర్యలు చేపట్టారు. పట్టణంలోని పలు దుకాణాల్లో పారిశుద్ధ్య, ప్రణాళికా విభాగం అధికారులు తనిఖీలు చేశారు. నెల రోజుల వరకు బాగానే ఉన్నా తర్వాత అంతగా పట్టించుకోలేదనే చెప్పాలి. నిషేధం అమలులోకి వచ్చి వంద రోజులు దాటుతున్నా ఇంతవరకూ కేవలం 36 కేసులు మాత్రమే నమోదు చేశారు. వారి నుంచి నామమాత్రంగా రూ. 13,400 అపరాధ రుసుం వసూలు చేశారు. అంటే సరాసరి ఒక్కోరి నుంచి రూ. 370 వసూలు చేశారన్నమాట.

టాస్క్‌ఫోర్స్‌ బృందాలెక్కడ?

పట్టణంలో ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులు, కప్పులు, ప్లేటులు వంటివి విక్రయించే వారందరితో గతంలో అధికారులు సమావేశం ఏర్పాటు చేసి నిషేధిత వస్తువులు అమ్మకాలు చేస్తే చర్యలు గట్టిగానే ఉంటాయని చెప్పారు. నిషేధం పక్కాగా అమలు చేసేందుకు టాస్స్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించారు. జోన్‌ పరిధిలో 27 సచివాలయాలు ఉన్నాయి. ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురుతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు సచివాలయ పరిధిలో నిషేధం పూర్తిస్థాయిలో అమలయ్యే విధంగా చూడాల్సి ఉంది. ఇదెక్కడా అమలు కావడం లేదు.


ఎక్కడ చూసినా కవర్లే

కొన్ని రోజులుగా పట్టణంలో వినాయక ఉత్సవాల సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. అన్నిచోట్లా వేలాదిగా ప్లాస్టిక్‌ నీటిప్యాకెట్లు ఉపయోగించారు. పట్టణంలోని మురుగు కాలువల్లో ఇటీవల యంత్రాల సహాయంతో పూడిక తీశారు. ఎక్కుడా చూసినా ప్లాస్టిక్‌ వస్తువులే కనిపించాయి. దీన్నిబట్టి పట్టణంలో ప్లాస్టిక్‌ వినియోగం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.


పక్కాగా అమలు చేస్తున్నాం
- కనకమహాలక్ష్మి, జోనల్‌ కమిషనర్‌

ప్లాస్టిక్‌ నిషేధం పక్కాగా అమలు చేస్తున్నాం. ఇందులో సిబ్బంది ఎవరు నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవు. ఇంతవరకూ 419 తనిఖీలు చేశాం.. కేసులు పెట్టి అపరాధ రుసుం వసూలు చేయడం కన్నా వ్యాపారులు, ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్లాస్టిక్‌ వాటర్‌ ప్యాకెట్లు విక్రయించే వారిపై చర్యలు తప్పవు.  

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని