logo

అత్యాచారం కేసులో యువకుడి అరెస్టు

కళాశాలలో పరిచయమైన యువతిని అత్యాచారం చేయడంతో పాటు తరచూ వేధింపులకు గురి చేస్తున్న యువకుడిని పెందుర్తి పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

Published : 09 Dec 2022 05:42 IST

పెందుర్తి, న్యూస్‌టుడే: కళాశాలలో పరిచయమైన యువతిని అత్యాచారం చేయడంతో పాటు తరచూ వేధింపులకు గురి చేస్తున్న యువకుడిని పెందుర్తి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీఐ గొలగాని అప్పారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సింహాచలం సమీపంలోని ఓ కాలనీకి చెందిన యువతి(19) బీఆర్క్‌ మూడో ఏడాది చదువుతోంది. ఏడాదిన్నర క్రితం పెందుర్తి మండలం వి.జుత్తాడకు చెందిన కె.భార్గవ్‌(20) తనను తాను పరిచయం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇంకో కళాశాలలో బీబీఏ రెండో ఏడాది చదువుతున్నాడు. ఇద్దరూ స్నేహంగా ఉన్నా ... ఓ రోజు యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి అత్యాచారం చేశాడు. తరువాత అతడిని దూరం పెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన భార్గవ్‌ ఆమెను వేధించడం ప్రారంభించాడు. యువతి ఆమె సోదరుడితో కలిసి ఈ నెల 5న అర్ధరాత్రి సమయంలో జుత్తాడలోని భార్గవ్‌ ఇంటికి వెళ్లి తన ఇంటికి రావద్దని అతడిని, కుటుంబ సభ్యులను కోరారు. కోపోద్రుక్తుడైన భార్గవ్‌ ఆమె వ్యక్తిగత ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానని బెదిరించాడు. ఈ నెల 6న భార్గవ్‌ తల్లి యువతి చరవాణికి ఆశ్లీల సందేశాలను పంపడంతో పాటు అదే రోజు యువతి ఇంటికి వెళ్లి గొడవపడింది. దీంతో ఆమె డయల్‌ 100కు ఫోన్‌ చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ మేరకు పెందుర్తి సీఐ గొలగాని అప్పారావు భార్గవ్‌పై అత్యాచారం కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా భార్గవ్‌ తల్లి యువతి కుటుంబ సభ్యులు తనను కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు యువతితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు