logo

ఉప్పెనలా రండి.. ఓటెత్తండి..!

పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్ల కోసం ప్రభుత్వ ఉద్యోగులు పోటెత్తారు. మండే ఎండ మాడ్చేస్తున్నా తగ్గలేదు. గంటల కొద్దీ నిరీక్షించి ఓటు వేశారు.

Updated : 10 May 2024 06:12 IST

స్ఫూర్తి నింపిన ప్రభుత్వ ఉద్యోగులు
13న జరిగే ఎన్నికలకు పౌరులు పోటెత్తాలి..

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్ల కోసం ప్రభుత్వ ఉద్యోగులు పోటెత్తారు. మండే ఎండ మాడ్చేస్తున్నా తగ్గలేదు. గంటల కొద్దీ నిరీక్షించి ఓటు వేశారు. పేర్లు లేకపోయినప్పటికీ నిరాశ చెందలేదు. ఎన్నికల అధికారులను సంప్రదించి అక్కడికక్కడే ఫాం-12ను అందజేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ కోసం జిల్లా యంత్రాంగం ఏయూ తెలుగు, ఆంగ్లమాధ్యమ పాఠశాలలలో విస్తృత ఏర్పాట్లు చేసింది. నాలుగు రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. మొదటి మూడు రోజుల్లో జిల్లాకు చెందిన ఉద్యోగుల్లో 95శాతం మంది, ఇతర జిల్లాల ఉద్యోగుల్లో 77శాతం మంది ఓటు వినియోగించుకోవడం చూస్తుంటే వారిలో చైతన్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇదే స్ఫూర్తి ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పౌరులు కనబర్చాలని జిల్లా యంత్రాంగం కోరుతోంది.

ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంది. దీంతో జిల్లా యంత్రాంగం 1941 పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దివ్యాంగులు, వృద్ధులు, మహిళలకు ప్రత్యేకంగా క్యూలైన్లు పెడుతున్నారు. బీఎల్‌ఓలు ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు. వాటిల్లో పేరు, ఓటరు జాబితాలో క్రమసంఖ్య, పోలింగ్‌ కేంద్రం చిరునామా వంటి అంశాలు ఉంటాయి. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ జరగనున్నది. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పౌరులను కోరుతోంది.

2019లో కేవలం 65.75శాతం మాత్రమే..

2019 ఎన్నికలను పరిశీలిస్తే జిల్లాలో 65.75 శాతం పోలింగ్‌ నమోదైంది. పెందుర్తి, భీమిలిలో మాత్రమే 70శాతం దాటింది. పశ్చిమంలో అతి తక్కువగా 58.19శాతం నమోదైంది. నాడు తొలిసారి వీవీప్యాట్‌ యంత్రాలను వినియోగించారు. అప్పటిలో ఆ యంత్రాలు మొరాయించడంతో పోలింగ్‌ ప్రక్రియ మందకొడిగా సాగింది. ఈసారి అలా జరగకుండా ఈసీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. అదే విధంగా జిల్లాలో ఎక్కడికక్కడ ‘స్వీప్‌’ కార్యక్రమాలు నిర్వహించి ఓటర్లలో చైతన్యం కల్పించింది. యువతను ఓటర్లుగా చేర్చడానికి కళాశాలల్లో సదస్సులు నిర్వహించింది. దీంతో జిల్లాలో ఈసారి 70శాతానికిపైగా పోలింగ్‌ నమోదయ్యే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం భావిస్తోంది.


ఉద్యోగులు తరలిరావడం శుభపరిణామం

అధికారులు నాకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఓటు హక్కు వినియోగించుకున్నా. గతంలో తపాలా ద్వారా పోస్టల్‌ బ్యాలట్‌ పంపేవాళ్లం. ఇప్పుడు పనిచేస్తున్న ప్రాంతంలోనే ఓటు వేయడం ఆనందాన్నిచ్చింది. ఉద్యోగులు భారీ ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవడం శుభపరిణామం. 

వి.మానస, పంచాయతీ కార్యదర్శి


సిబ్బంది ఎంతో సహకరించారు

నా ఓటు అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో ఉంది. ప్రస్తుతం నేను చంద్రపాలెం జడ్పీ హైస్కూల్‌లో విధులు నిర్వహిస్తున్నా. ఫాం-12 ద్వారా దరఖాస్తు చేసుకున్నా. ఏయూ పాఠశాలలోని సిబ్బంది అన్ని విధాల సహకరించడంతో ఇక్కడ ఓటు వేయగలిగా. ఏర్పాట్లు కూడా బాగున్నాయి.

ఎల్‌.శ్రీదేవి, ఉపాధ్యాయురాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని