logo

భాజపా జిల్లా అధ్యక్షుడిగా పరమేశ్వరరావు

కేంద్రంలోని భాజపా అభివృద్ధికి పెద్దపీట వేస్తుంటే, రాష్ట్రంలోని వైకాపా దోపిడీయే విధానంగా పాలన సాగిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విమర్శించారు.

Published : 02 Feb 2023 05:22 IST

పరమేశ్వరరావును సత్కరిస్తున్న వీర్రాజు

అనకాపల్లి, న్యూస్‌టుడే: కేంద్రంలోని భాజపా అభివృద్ధికి పెద్దపీట వేస్తుంటే, రాష్ట్రంలోని వైకాపా దోపిడీయే విధానంగా పాలన సాగిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విమర్శించారు. అనకాపల్లి రోటరీ కల్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా భాజపా నూతన అధ్యక్షుడిగా ద్వారపురెడ్డి పరమేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. సమావేశానికి డాక్టర్‌ గండి వెంకట సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ ఇసుక, కంకర.. ఇలా ప్రతిదీ దోచుకోవడమే పనిగా వైకాపా నాయకులు పెట్టుకున్నారన్నారు. ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశానన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్‌, జిల్లా ఇన్‌ఛార్జి ప్రకాశ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు చదరం నాగేశ్వరరావు, వర్మ పాల్గొన్నారు. స్థానిక చదువులవారి వీధిలో భాజపా జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పరమేశ్వరరావుతోపాటు, దిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో కూచిపూడి ప్రదర్శన ఇచ్చిన బృందానికి నృత్య దర్శకత్వం వహించిన అనకాపల్లి వాసి కర్రి కిశోర్‌ను వీర్రాజు సత్కరించారు.

వర్గీకరణ బిల్లు పెట్టాలని వినతి

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి): పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణకు బిల్లు ప్రవేశపెట్టేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షులు కొల్లి చినఅప్పారావు కోరారు. బుధవారం అనకాపల్లి వచ్చిన సోము వీర్రాజును కలసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నియోజకవర్గ అధ్యక్షులు కటుమూరి మంగరాజు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని