logo

ఆలోచన భళా.. ఆచరించి చూపారిలా..

నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తూ విద్యార్థులు ఆలోచనలకు పదును పెడుతున్నారు.

Published : 07 Feb 2023 05:02 IST

పేట విద్యార్థుల వినూత్న ప్రాజెక్టులు

పట్టు పురుగుల పెంపకం చేస్తున్న విద్యార్థులు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తూ విద్యార్థులు ఆలోచనలకు పదును పెడుతున్నారు. వినూత్న రీతిలో ప్రయోగాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు పేటలోని స్పేసెస్‌ డిగ్రీ కళాశాల బయోటెక్నాలజీ విభాగం విద్యార్థులు. చదువుతో పాటు సృజనాత్మకత జోడించి వ్యవసాయం, సాంకేతిక రంగాల్లో నమూనాలు రూపొందిస్తూ ఆకట్టుకుంటున్నారు. పట్టుపురుగుల పెంపకం, రసాయనాలు వినియోగించకుండా సబ్బుల తయారీ,  సేంద్రియ విధానాల్లో మొక్కల పెంపకం తదితర ప్రయోగాలు చేస్తూ భళా అనిపించుకుంటున్నారు.

వర్మీవాష్‌తో మొక్కల పెంపకం


పట్టు పురుగులను చంపకుండానే...

పట్టు గూళ్లను వేడి నీటిలో వేసి పట్టు తయారు చేస్తారనే విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో గూళ్లలో ఉన్న పట్టు పరుగులు చనిపోతాయి. అవి చనిపోకుండా చిన్న జీవుల ప్రాణాలకు విలువనీయాలనే ఆలోచనతో
ఇ.పి.సారథి, రాఘవ, రాజ్‌కుమార్‌, దొరబాబు కలిసి ఆలోచనకు పదును పెట్టారు. పురుగులను చంపకుండానే పట్టు తయారు చేయొచ్చనే ప్రాజెక్టును రూపొందించారు. దీనికోసం పట్టుపురుగుల పెంపకాన్ని స్వయంగా చేపట్టారు. గుడ్ల నుంచి ఆరు రోజుల్లో పురుగులు బయటకు వచ్చాయి. వాటికి మల్బరీ ఆకులను ఆహారంగా ఇచ్చారు. పట్టుగూళ్లలోని పురుగు జీవితకాలం ముగిసే వరకు ఆగి ఆతర్వాతే గూళ్లను వేడి నీళ్లలో వేసి పట్టు సేకరించారు. దీనివల్ల పురుగులను చంపకుండా పట్టు సాధించవచ్చని నిరూపించారు. ఈ విధానంలో వారం పాటు ఆలస్యమవుతుందని విద్యార్థులు పేర్కొంటున్నారు.


సేంద్రియ విధానంలో

 

సేంద్రియంతో వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధించొచ్చని పి.జ్యోతి, టి.సౌజన్య, హరిత, లాస్య నిరూపించారు. వర్మీకంపోస్టు, వర్మీవాష్‌ (వాన పాముల నుంచి సేకరించిన వ్యర్థాలు) వాడి మొక్కల పెంపకాన్ని చేపట్టారు. కొన్ని మొక్కలకు వర్మీ కంపోస్టు, మరికొన్నింటికి వర్మీవాష్‌ ఎరువుగా ఇచ్చారు. మిగతా వాటికి రెండింటినీ కలిపి ఇచ్చారు. రెండూ వాడిన మొక్కల పెరుగుదల మిగతా వాటితో పోలిస్తే ఎక్కువగా ఉంది. పువ్వులు పెద్దగా పూశాయి. కూరగాయల పెంపకంలోనూ మంచి ఫలితాలు వచ్చాయి.


పుట్టగొడుగుల పెంపకంతో..

స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసేందుకు యువత ప్రయోగాలు చేస్తున్నారు. దీనిలోభాగంగా నవ్య, శ్రీలక్ష్మి, రమ్య, దుర్గ వీరంతా కలిసి పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టారు. రైతులు చేస్తున్న పద్ధతులతో సత్ఫలితాలు సాధించారు. పుట్టగొడుగుల సాగు చేపట్టడంతో పాటు వినూత్న పద్ధతులకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. మరింత తేలికగా తయారీ చేపడతామని వివరించారు.


రసాయనాలు వాడకుండా...

రసాయన రహితంగా సబ్బుల తయారీ

రసాయనాలు వాడకుండా సబ్బుల తయారీకి పి.దివ్య, కె.హర్షిత, వి.తనూష, పి.నాగలక్ష్మి శ్రీకారం చుట్టారు. కొబ్బరినూనె, గ్లిజరాల్‌, నీరు, కాస్టిక్‌ సోడా వినియోగించారు. పసుపు, వేప, గులాబీ, చందనం సువాసనల కోసం సహజసిద్ధమైన పదార్థాలు వాడారు. తులసి, కలబందతోనూ సబ్బులు రూపొందించారు. నురుగు బాగా వచ్చేలా, సువాసనతో రసాయన రహితంగా మంచి ఫలితాలు సాధించారు.


మునగ గింజల పొడితో...

నీటిలో మలినాలు తొలగించేందుకు చిట్కాను గుర్తించారు. లీటరు నీటిలో 10 గ్రాముల మునగ గింజల పొడిని వేసి ఉంచితే దానిలోని మలినాలు తొలగించే ప్రాజెక్టు రూపొందించారు. రసాయనాలు వినియోగించకుండా నీటిని శుద్ధి చేయొచ్చని పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని