logo

ఆధార్‌ అనుసంధానానికి పరుగులు

ఓటుకు ఆధార్‌ అనుసంధాన కార్యక్రమంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నెలాఖరులోగా శత శాతం లక్ష్యం చేరుకోవాలంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో గ్రామాల్లో అధికారులు, బీఎల్వోలు పరుగులు తీస్తున్నారు.

Published : 29 Mar 2023 03:17 IST

జిల్లాలో 72% పూర్తి
నక్కపల్లి, న్యూస్‌టుడే

ఓటుకు ఆధార్‌ అనుసంధాన కార్యక్రమంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నెలాఖరులోగా శత శాతం లక్ష్యం చేరుకోవాలంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో గ్రామాల్లో అధికారులు, బీఎల్వోలు పరుగులు తీస్తున్నారు. మూడు వారాల వ్యవధిలో జిల్లాలో 13 శాతానికిపైగా ప్రక్రియ పూర్తి చేశారు.

వివరాలను ఆన్‌లైన్‌ చేస్తున్న సిబ్బంది

ఓటరు జాబితాల్లో ఇప్పటికీ తేడాలు ఉండటంతో ‘ఒకరికి ఒక ఓటు’ అనే లక్ష్యాన్ని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలను అమలు చేశారు. గతేడాది ఫొటో సిమిలర్‌ ఎంట్రీ ద్వారా చాలా వరకు రెండో ఓట్లను తొలగించారు.

జిల్లాలో సుమారు 23 వేల ఓట్లను రెండో ఓటుగా గుర్తించారు. ఇది పూర్తిస్థాయిలో జరగలేదు. ఓటుకు ఆధార్‌ అనుసంధానం చేయడం ద్వారా ఒకరికి ఒకే ఓటు ఉండేలా చేయొచ్చని గుర్తించారు. దీనికోసం ప్రతి ఓటరు నుంచి ఆధార్‌ నంబరు సేకరించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. బీఎల్వోలు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ఆధార్‌ వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

ఆధార్‌ వివరాలు సేకరిస్తున్న బీఎల్వోలు

ప్రత్యేక కార్యాచరణ

ఆధార్‌ వివరాలు తీసుకుని గరుడ యాప్‌లో అనుసంధానం చేస్తున్నారు. ఇదీ అంతంతమాత్రంగానే జరుగుతుండగా.. ఈ ప్రక్రియను వేగవంతం చేయడంపై దృష్టిసారించారు. ఈ నెల మొదటి వారానికి జిల్లా వ్యాప్తంగా 59 శాతం మాత్రమే పూర్తి చేయడంతో ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల నియోజకవర్గాల వారీగా అధికారులు, బీఎల్వోలతో ఈఆర్వోలు సమావేశం నిర్వహించారు.

బాగా వెనుకబడి ఉన్న ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆదివారం గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. రెవెన్యూ, మండల పరిషత్తు అధికారుల పర్యవేక్షణలో బీఎల్వోలంతా గ్రామాల్లో పర్యటించి ఆధార్‌ వివరాలను సేకరించి అనుసంధానించారు.

మొత్తం 12,74,918 ఓటర్లకు 9,22,579 మంది ఆధార్‌ వివరాలను అనుసంధానం చేశారు. తద్వారా 72.36 శాతంగా నమోదైంది. నెలాఖరులోగా మరింత పెంచాలనే లక్ష్యంతో ఇదే వేగాన్ని కొనసాగిస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం మాడుగుల నియోజకవర్గం మొదటి స్థానానికి చేరుకోగా, జిల్లాలో అత్యధిక ఓటర్లున్న ‘పేట’ నియోజకవర్గం తృతీయ స్థానôలో నిలిచింది. అనకాపల్లి చివరన ఉంది.


వలస ఓటర్లపైనా దృష్టి : జిల్లాలో కొన్ని మండలాల్లో ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ మరీ తక్కువగా ఉంది. సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాం. తద్వారా కాస్త మెరుగుపడింది. ఇది నిర్బంధమేమీ కాదు. అనుసంధానం వల్ల ఓటర్ల్లకే మేలు జరుగుతుంది. నకిలీ ఓటుకు అవకాశం ఉండదు. వలసవెళ్లిన ఓటర్లపైనా దృష్టిపెట్టాం. ఇలాంటి వారంతా పండగలకు, వ్యక్తిగత పనులపై సొంతూరుకి వచ్చినప్పుడు ఆధార్‌ అనుసంధానం చేసేలా ఆదేశాలిచ్చాం. ఇది నిరంతరం సాగే ప్రక్రియ.

పి.వెంకటరమణ, డీఆర్వో


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు