logo

పరికరాలు మాయం!

బహుళ ప్రయోజనకరంగా నిర్మించిన కొమ్మాదిలోని క్రీడా శిక్షణ కేంద్రంలో పరికరాలు కనిపించడం లేదు. ఇప్పటికే చాలావరకు మాయమయ్యాయి. టీవీ, విలువైన వస్తువులు ఈ జాబితాలో ఉన్నాయి.

Published : 05 Jun 2023 03:51 IST

దీన స్థితిలో క్రీడా శిక్షణ కేంద్రం
ఈనాడు, విశాఖపట్నం న్యూస్‌టుడే, కొమ్మాది

కళావిహీనంగా కొమ్మాది శిక్షణ కేంద్రం

బహుళ ప్రయోజనకరంగా నిర్మించిన కొమ్మాదిలోని క్రీడా శిక్షణ కేంద్రంలో పరికరాలు కనిపించడం లేదు. ఇప్పటికే చాలావరకు మాయమయ్యాయి. టీవీ, విలువైన వస్తువులు ఈ జాబితాలో ఉన్నాయి. చాలా పరికరాలను తుక్కు కింద విక్రయించేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.

వివిధ జిల్లాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఓ ప్రైవేటు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో కొమ్మాదిలో శిక్షణ ఇప్పించేది. ఫుట్‌బాల్‌, హాకీ, సైక్లింగ్‌ క్రీడల్లో సత్తా చాటేలా మెలకువలు నేర్పేవారు. ఎంపికై ఇక్కడికొచ్చే దాదాపు 68 మందిని సమీపంలోని పాఠశాలలు, కళాశాలల్లో చదివిపించేవారు. సైక్లింగ్‌, ఫుట్‌బాల్‌, హాకీ శిక్షణకు ఖరీదైన స్టిక్స్‌, ఫుట్‌బాళ్లు, నెట్లు అందుబాటులోకి తెచ్చారు. కొమ్మాది సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వసతికి అవసరమైన పడకలు, పరుపులు, భోజనం చేసేందుకు బల్లలు, కుర్చీలు, గ్లాసులు ఇతర సామగ్రి 100 నుంచి 150 మందికి సరిపడేలా అప్పట్లో కొన్నారు. ఇందులో ఇనుప మంచాలు, చదువుకునే బల్లలు, లాకర్లు, 250 వరకు కుర్చీలు ఉండేవి. కొవిడ్‌ సమయంలో శిక్షణ ఆగిపోయింది. వసతికి తెచ్చిన ఉపకరణాలన్ని కొమ్మాది శిక్షణ కేంద్రానికి తరలించారు. ఈ సమయంలో అధిక సఖ్యలో వస్తువులు మాయమయ్యాయి. ఆ తరువాత కేంద్రం నిర్వహణపై పెద్దగా ఎవరూ దృష్టిసారించలేదు. క్రీడాకారులకు శిక్షణ నిలిచిపోయింది. ఇదే అదనుగా కొందరు పరికరాలను విక్రయించేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

వ్యాయామశాల పరిస్థితి ఇది

ఇదే ప్రాంగణంలోని వ్యాయామశాల నిరుపయోగంగా మారింది. దీనిని మూసేశారు. ఇక్కడ ఉండాల్సిన డంబెల్స్‌, ఇతర పరికరాలు కనిపించడం లేదు. మరికొన్ని పాడైపోయాయి. రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసిన పరికరాలు ఇప్పుడు ఎవరికీ ఉపయోగం లేకుండా ఉన్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కేంద్రం దీనావస్థకు చేరుకుంది. క్రీడాకారులతో కళకళలాడాల్సిన కేంద్రం కళావిహీనంగా తయారైందనే విమర్శలొస్తున్నాయి.

మంచాలు కొన్ని కనిపించడం లేదు. గదుల్లో ఉంచిన వస్తువులు పాడైపోతున్నాయి. పరుపులు బూజుపట్టిపోతున్నాయి. తుప్పుపట్టిన కొన్ని ఇనుప మంచాలు అధ్వానంగా ఉన్నాయి. వంటసామగ్రి ఇతర వస్తువులదీ అదే పరిస్థితి. రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసిన కొన్ని క్రీడా పరికరాలు వృథాగా పడి ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని