logo

Vizag: క్రికెట్‌ అభిమానులకు నో టికెట్‌.. సోషల్‌ మీడియాలో ‘బేరసారాలు’

నగరంలోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Updated : 28 Mar 2024 09:25 IST

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: నగరంలోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. గత నెలలో షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ.. విశాఖకు రెండు మ్యాచ్‌లు కేటాయించింది. అందులో భాగంగా దిల్లీ క్యాపిటల్స్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది. దిల్లీ, చెన్నై మ్యాచ్‌ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆన్‌లైన్‌లో టికెట్‌ విక్రయాలు ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే మొత్తం ఖాళీ అయిపోయాయని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆయా టికెట్లకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో బేరసారాలు జరగడం గమనార్హం.

రూ.3,500 టికెట్‌ రూ.30 వేలకు..

ఈనెల 31న దిల్లీ, చెన్నై మ్యాచ్‌ జరగనుంది. బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్ల విక్రయం ప్రారంభించారు. 7 గంటల నుంచే అభిమానులు ఆన్‌లైన్‌లో ఎదురుచూశారు. ప్రారంభించిన వెంటనే ప్రయత్నించినా టికెట్లు దొరకలేదని పలువురు చెబుతున్నారు. రూ.1000, రూ.1500 టికెట్లు 30 నిమిషాల్లోనే ఖాళీ అయిపోయాయి. కొందరు నాలుగు, అయిదు చరవాణులతో ప్రయత్నిస్తే ఒక్కో టికెట్‌ దొరికింది. ఒక్కో ఫోన్‌ నంబర్‌పై రెండు మాత్రమే కొనుగోలు చేసేందుకు అవకాశముంది. కానీ కొందరు 5, 6, 8 టికెట్లు అందుబాటులో ఉన్నాయని, మ్యాచ్‌కు రాలేకపోతున్నాంటూ.. సామాజిక మాధ్యమాల్లో విక్రయిస్తున్నారు. రూ.1500 టికెట్‌ను రూ.7 వేలకు, రూ.3,500 టికెట్‌ను రూ.30 వేలకు, రూ.5 వేల టికెట్‌ను రూ.12 వేలకు కొనుగోలు చేసినట్లు కొందరు చెబుతున్నారు. అంత ధరేంటని అడిగితే.. ధోనీ ఆడే మ్యాచ్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉందని చెప్పడం గమనార్హం.

ఆన్‌లైన్‌లోనూ అదే పరిస్థితి..

గతంలో ఆఫ్‌లైన్‌ విక్రయాలు చేపట్టిన సమయంలోనూ పెద్దఎత్తున టికెట్లు పక్కదారి పట్టాయనే ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు ఆన్‌లైన్‌ విధానంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సంబంధించి స్టేడియంలోని కొన్ని బ్లాకుల టికెట్లనే విడుదల చేశారు. వాటిలోనూ ఆన్‌లైన్‌ సంస్థ, టీం మేనేజ్‌మెంట్‌ కలసి చాలా వరకు బ్లాక్‌ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో తమ ప్రమేయం లేదని ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. వారి తరఫున కూడా కొన్ని టికెట్లు పక్కదారి పట్టి ఉంటాయని అభిమానులు ఆరోపిస్తున్నారు.

ధోనీ ఆట చూడాలని..

చెన్నై తరఫున ఆడుతున్న మహేంద్రసింగ్‌ ధోనీ ఆటతీరుకు ఎందరో అభిమానులున్నారు. 2019 ఫిబ్రవరి 24న ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌ తర్వాత విశాఖలో ఆడలేదు. దీంతో స్థానిక అభిమానుల చూపులన్నీ దిల్లీ, చెన్నై మ్యాచ్‌ మీదే ఉన్నాయి. మరోవైపు గత ఐపీఎల్‌లో ధోనీ ఎక్కడికి వెళ్లినా స్టేడియాలు కిక్కిరిసిపోయాయి. ఈ సీజన్‌లోనూ చెన్నై జట్టు తలపడిన రెండు స్టేడియాలు ప్రేక్షకులతో నిండిపోయాయి. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఆ జట్టు సత్తా చాటింది. దీంతో ఈనెల 31న జరిగే మ్యాచ్‌ను ఎలాగైనా వీక్షించాలని చాలా మంది ఉవ్విళ్లూరారు. ఆ అవకాశాన్ని కొందరు క్రికెట్‌ పెద్దలు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఎక్స్‌ (ట్విటర్‌)లో టికెట్లు ఉన్నాయంటూ కొందరు పెట్టిన మెసేజ్‌లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని