logo

కూటమి కూర్పులో స్వల్ప మార్పు

సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.

Published : 28 Mar 2024 02:53 IST

అరకులోయ అసెంబ్లీ కమలానికి..
పాడేరులో మళ్లీ సైకిల్‌ పరుగులు

అరకు అసెంబ్లీ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు

ఈనాడు, పాడేరు - న్యూస్‌టుడే, అరకులోయ, పాడేరు: సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. సామాజిక సమీకరణాలు, పొత్తుల్లో భాగంగా కొన్ని స్థానాల్లో ముందుగా ప్రకటించిన అభ్యర్థులను ఇరుపార్టీలు మార్చుతున్నాయి. అధికార వైకాపా అరకులోయ అసెంబ్లీ సమన్వయకర్తగా ముందు ఎంపీ గొడ్డేెటి మాధవిని ప్రకటించింది. తర్వాత హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడు రేగం మత్స్యలింగాన్ని నియమించింది. ఆయనకే టికెట్‌ ఇస్తామని ప్రకటించింది. తాజాగా తెదేపా కూడా అనూహ్యంగా అరకులోయ అభ్యర్థిని మార్చింది. ముందు తెదేపా నుంచి సియ్యారి దొన్నుదొరను బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించింది. తర్వాత తెదేపా, జనసేన, భాజపా కూటమి సీట్ల సర్దుబాటులో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అరకులోయ స్థానం నుంచి భాజపా అభ్యర్థి పాంగి రాజారావును పోటీలో దించుతున్నామని ప్రకటించింది. ఈ మేరకు భాజపా జాతీయ నాయకులు బుధవారం దిల్లీలో ప్రకటన విడుదల చేశారు. ముందు పాడేరు స్థానాన్ని భాజపాకు కేటాయించినట్లు ప్రచారం జరిగింది. ఆ పార్టీ నేతలు అరకులోయే కావాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఈమేరకు మార్పు చేయాల్సి వచ్చింది. ఇన్నాళ్లూ దొన్నుదొర తెదేపా శ్రేణులను ముందుకు నడిపించినా దివంగత ఎమ్మెల్యే సోమా కుమారుడు, ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం అసమ్మతి స్వరం వినిస్తున్నారు. తాజాగా రాజారావును రంగంలోకి దించుతామని ప్రకటించడం, ఆయన కూడా మన్యంలో బలమైన నేత కావడంతో కూటమి మద్దతుతో విజయం సాధించగలరని విశ్వాసం ఆయన వర్గీయుల్లో వ్యక్తమవుతోంది.

అభ్యర్థి ఎవరైనా గెలిచి చూపిస్తాం..: తెలుగుదేశం పార్టీ రెండు విడతల్లో మెజారిటీ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. ఏజెన్సీలో పాడేరు స్థానాన్ని భాజపాకి కేటాయించినట్లు ప్రచారం జరిగింది. ఆ మేరకు అక్కడ అభ్యర్థిని కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. దీంతో భాజపానే బరిలోకి దిగుతుందని భావించారు. తెదేపా నుంచి టికెట్‌ ఆశించిన గిడ్డి ఈశ్వరి, ఆమె మద్దతుదారులు భాజపాకి కేటాయించొద్దని ర్యాలీలు చేశారు. అనూహ్యంగా భాజపానే పాడేరుకు బదులు అరకులోయనే కోరుకోవడంతో పాడేరు తెదేపా శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న పార్టీ నేతలంతా ఒక్కసారిగా ఆనందంలో ముగిపోయారు. అభ్యర్థి ఎవరైనా సరే తెదేపా నుంచి బరిలోకి దిగి గెలిచి చూపిస్తామంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని