logo

చెప్పినా చెవికెక్కితేగా?వైకాపా ప్రచారాల్లో వాలంటీర్లు..

ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉండాలని వాలంటీర్లను ఎన్నికల కమిషన్‌ ఆదేశించినా చెవికెక్కించుకోవడం లేదు.

Updated : 28 Mar 2024 09:06 IST

చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
ఈనాడు-విశాఖపట్నం

గంధవరం గ్రామ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు (వృత్తంలో)

న్నికల ప్రచారాలకు దూరంగా ఉండాలని వాలంటీర్లను ఎన్నికల కమిషన్‌ ఆదేశించినా చెవికెక్కించుకోవడం లేదు. వైకాపా అభ్యర్థుల ప్రచారాల్లో పాల్గొంటూ, జన సమీకరణ చేస్తున్నారు. వైకాపా నాయకులతో ఇంటింటికీ వెళ్లి ఓట్ల పరిశీలనలోనూ పాల్గొంటున్నారు. విశాఖ పరిధిలో ప్రధానంగా భీమిలి నియోజకవర్గాల్లో వాలంటీర్లు రెచ్చిపోతున్నారు.

భీమిలిలో ఇష్టారాజ్యంగా...: భీమిలి నియోజకవర్గం పరిధిలో వాలంటీర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైకాపా అభ్యర్థి ముత్తంశెట్టి చేపట్టే ప్రచారాలు, ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ర్యాలీకి అవసరమైన జనసేకరణ సైతం వాలంటీర్లే చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం భీమిలి మండల వైకాపా సమావేశంలో లక్ష్మీపురం సచివాలయ క్లస్టర్‌-1కు చెందిన వాలంటీరు గౌరీశంకర్‌ పాల్గొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, వైకాపా అభ్యర్థి ముత్తంశెట్టిలతో కలిసి ఫొటో దిగి హడావుడి చేశారు. ః ఈ నెల 22న రాజులతాళ్లవలసలో మాస్క్‌లు ధరించి ముగ్గురు వాలంటీర్లు వైకాపా అభ్యర్థి ముత్తంశెట్టి చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు.

పద్మనాభం, న్యూస్‌టుడే: ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొంత మంది వాలంటీర్లు వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పద్మనాభం మండలం గంధవరం గ్రామంలో ఈనెల 26వ తేదీన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఏకంగా ఏడుగురు వాలంటీర్లు పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఈ ప్రచారంలో గ్రామ వాలంటీర్లు  పిల్లి ముత్యాలు, కింగం శేఖర్‌, కొత్తపల్లి అప్పలరాజు, పల్లి ముత్యాలనాయుడు, తాండ్రంగి జగదీశ్‌, కొత్తపల్లి రామకుమారి, చిప్పాడ వెంకటలక్ష్మి పాల్గొన్నారు. వీరితో పాటు కో-ఆపరేటివ్‌ బ్యాంకు ఉద్యోగి రామకృష్ణ సైతం ఈ ప్రచారంలో పాల్గొనడాన్ని ఇతర పార్టీల నాయకులు తప్పుపడుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కరాస, న్యూస్‌టుడే : విశాఖపట్నంలోని 57వ వార్డు పరిధి 209వ బూత్‌కు చెందిన వాలంటీరు జి.గౌరీ బుధవారం వైకాపా శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. ఓటరు జాబితా చేతపట్టుకుని.. అందులోని వివరాలను వైకాపా కార్యకర్తలకు తెలియజేస్తూ.. వారితో కలిసి కాలనీల్లో పర్యటించారు. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు స్పందించి... ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

మిగిలిన చోట్లా అదే తీరు..: విశాఖ తూర్పులోనూ వాలంటీర్లు ఓటర్ల జాబితాలతో వైకాపా నాయకులతో కలిసి తిరుగుతున్నారు. వైకాపా అభ్యర్థి కోసం ఏకంగా వాలంటీరు పోస్టులకు స్వచ్ఛందంగా ఓ నలుగురు రాజీనామా చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. పెందుర్తిలో వైకాపా నాయకులు రహస్యంగా వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశాలు చేయడంతోపాటు, నగదు కానుకగా ఇస్తున్నట్లు సమాచారం.

అధికారులను నిలదీస్తున్నా...: వాలంటీర్ల పాత్రపై అధికారులను నిలదీస్తున్నా స్పందించడం లేదు. బుధవారం భీమిలి ఆర్డీవో కార్యాలయంలో అన్ని పార్టీల నాయకులతో రెవెన్యూ అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. వాలంటీర్లు ప్రచారంలో పాల్గొంటున్నా, చర్యలు కఠినంగా లేకపోవడంతో తిరిగి యథావిధిగా పాల్గొంటున్నారని, వారి ప్రచారాలకు అడ్డుకట్టవేయలేకపోతున్నారని మండల తెదేపా పార్టీ అధ్యక్షులు దంతులూరి అప్పల నరసింహరాజు ఆర్డీవోను నిలదీశారు. 50 కుటుంబాల సమాచారం వాలంటీర్ల వద్ద చరవాణిలో ఉంటుంది కనుక, వెంటనే ఆ ఫోన్లు రికవరీ చేసుకోవాలని కోరారు.

యూసీడీ ఆర్పీల హవా: రైల్వే న్యూకాలనీలో 43వ వార్డుకు చెందిన రిసోర్స్‌ పర్సన్‌ సరగడం అలివేణి ఉత్తర నియోజకవర్గం వైకాపా అభ్యర్థి కేకే రాజు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల తూర్పులో యూసీడీ అధికారుల ఆదేశాలతో ఆర్పీలను పిలిపించి, వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నోట్ల కట్టలు పంపిణీ చేశారు.

డ్వాక్రా గ్రూపు మహిళలకు తాయిలాలు అందించడంలో ఆర్పీల హవా ఎక్కువైంది. వైకాపా కండువాలు కప్పుకొని ఆర్పీలు తిరుగుతున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని