logo

‘జగన్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా జనం’

ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో నిరుద్యోగం, డ్రగ్స్‌, మద్యం రాష్ట్రంలో విలయం తాండవం చేస్తున్నాయని విశాఖ లోక్‌సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు

Published : 29 Mar 2024 04:13 IST

 మాట్లాడుతున్న విశాఖ లోక్‌సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో నిరుద్యోగం, డ్రగ్స్‌, మద్యం రాష్ట్రంలో విలయం తాండవం చేస్తున్నాయని విశాఖ లోక్‌సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ముఖ్యమంత్రి నిర్వాకం కారణంగా యువత డ్రగ్స్‌, మద్యానికి బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా గంజాయి, డ్రగ్స్‌ అందుబాటులో ఉంటున్నాయని, వాటిని నియంత్రించడంలో పోలీసు యంత్రాంగం వైఫల్యం చెందిందన్నారు.

 రాష్ట్రంలో దోపిడీలు నిత్యకృత్యంగా మారాయని, ప్రశ్నించే వారిని పోలీసులు బెదిరిస్తున్నారని బాబ్జీ ఆరోపించారు. జగన్‌ గ్రామ పంచాయతీ వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో జగన్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కూటమి అధికారంలోకి వస్తే వాలంటీరు వ్యవస్థను తొలగిస్తారని ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని, మరింతగా బలోపేతం చేసి మెరుగైన సేవలందిస్తామన్నారు. విశాఖ డ్రగ్స్‌ కేసును వివేకానంద హత్య కేసు మాదిరిగా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో విశాఖ లోక్‌సభ నియోజకవర్గ కమిటీ తెదేపా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని