logo

తనివితీరా దర్శనం... తన్మయత్వంలో భక్తజనం

మేడారం మహా జాతరలో రెండు ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతమైన తర్వాత శుక్రవారం మొక్కుల చెల్లింపు కార్యక్రమం కొనసాగింది. భక్తజనులు తొలుత జంపన్నవాగులో పవిత్రస్నానం చేసి వడివడిగా అమ్మల దర్శనం కోసం గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. బంగారాన్ని అందంగా కుంకుమ బొట్టుతో తీర్చిదిద్ది ముఖానికి బండారి(పసుపు) పులుముకుని పిల్లా జల్లాతో అమ్మలను తనివితీరా దర్శించుకొని.... తన్మయత్వానికి లోనయ్యారు. మరోవైపు

Published : 19 Feb 2022 02:22 IST

ఏటూరునాగారం(మేడారం), న్యూస్‌టుడే

గద్దెల ప్రాంగణంలో..

మేడారం మహా జాతరలో రెండు ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతమైన తర్వాత శుక్రవారం మొక్కుల చెల్లింపు కార్యక్రమం కొనసాగింది. భక్తజనులు తొలుత జంపన్నవాగులో పవిత్రస్నానం చేసి వడివడిగా అమ్మల దర్శనం కోసం గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. బంగారాన్ని అందంగా కుంకుమ బొట్టుతో తీర్చిదిద్ది ముఖానికి బండారి(పసుపు) పులుముకుని పిల్లా జల్లాతో అమ్మలను తనివితీరా దర్శించుకొని తన్మయత్వానికి లోనయ్యారు. మరోవైపు అధికారగణం సైతం వరసకట్టి తల్లుల సేవలో తరించారు.  
మేడారం జాతరలో వనదేవతలైన సమ్మక్క-సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులస్వామి సైతం కొలువై ఉండడంతో భక్తజనం మొక్కులు చెల్లించుకొనేందుకు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ క్షణక్షణానికి పెరుగుతూ వచ్చింది. క్యూలైన్లు కిటకిటలాడాయి.

ఉదయం తోపులాట...: క్యూలైన్లలో శుక్రవారం ఉదయం భక్తజనులు దేవతల దర్శనానికి ఒక్కసారిగా పోటెత్తడంతో కొన్ని చోట్ల తోపులాట జరిగింది. అక్కడక్కడ కొందరు అస్వస్థతకు గురై క్యూలైన్ల నుంచి బయటికి వచ్చి కొద్దిసేపు సేదతీరారు. కొందరు క్యూలైన్లలోనే సొమ్మసిల్లి పడిపోయారు. సింగరేణి రక్షణ బృందాలు వారిని ఆసుపత్రికి చేర్చాయి.
6 రోజుల్లో రూ. 4.09 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.
శుక్రవారం ఆర్టీసీ బస్సుల్లో 49,381 మంది మేడారం రాగా, 1.32 లక్షల మంది తిరుగు  పయనం అయ్యారు.
మంత్రి దయాకర్‌రావు పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. సరిగా పనిచేయని  వారికి జరిమానా విధించారు.


నేడు గవర్నర్‌ తమిళిసై రాక
మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు శనివారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై దంపతులు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మేడారానికి చేరుకుంటారు. అమ్మవార్లను దర్శించుకుని ఎత్తు బెల్లం మొక్కును చెల్లించుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

రేవంత్‌రెడ్డి సైతం..: జాతరకు శనివారం టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి రానున్నట్లు వరంగల్‌, హనుమకొండ జిల్లాల కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.


తిరుగు ప్రయాణానికి బారులు..

క్తజనులు తిరుగు ప్రయాణానికి సిద్ధం కావడంతో ఆర్టీసీ బస్టాండు వద్ద భారీగా భక్తజన సందోహం నెలకొంది. దర్శనాల అనంతరం వివిధ ప్రాంతాలకు వెళ్లే వారితో  బస్టాండు కిటకిటలాడింది. మరోవైపు పస్రా మీదుగా ప్రైవేటు వాహనాల ప్రయాణికులు సైతం పెద్ద ఎత్తున తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. దీంతో పార్కింగ్‌ స్థలాలు ఒక్కొక్కటిగా ఖాళీ కావడం మొదలైంది. దేవతలందరూ కొలువై ఉండడంతో వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది దర్శనానికి ప్రాధాన్యం ఇచ్చారు. విధులు ముగించుకున్న అధికారులు, సిబ్బంది ఇంటి వద్ద ఉన్న తమ పిల్లలకు బొమ్మలు, ఆట వస్తువులు కొనుగోలు చేయడం కనిపించింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని