logo

వైద్య కళాశాల ఏర్పాటుకు అడుగులు

భూపాలపల్లిలో వైద్య కళాశాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. కాలేజీ, జనరల్‌ ఆసుపత్రి నిర్మాణానికి రూ. 168 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 07 Aug 2022 05:33 IST

వెయ్యి క్వార్టర్ల సమీపంలో స్థల పరిశీలన చేస్తున్న డీఎంహెచ్‌ఓ శ్రీరామ్‌, తహసీల్దార్‌ మహ్మద్‌ ఇగ్బాల్‌

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, భూపాలపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: భూపాలపల్లిలో వైద్య కళాశాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. కాలేజీ, జనరల్‌ ఆసుపత్రి నిర్మాణానికి రూ. 168 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే భూపాలపల్లి సింగరేణి వెయ్యి క్వార్టర్ల సమీపంలో 22 ఎకరాల స్థలాన్ని అధికారులు ఎంపిక చేశారు. మెడికల్‌ కాలేజీ నిర్మాణం పూర్తయితే ఇక్కడ వంద సీట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే 350 బెడ్స్‌తో కూడిన జనరల్‌ దవాఖానా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందుతాయి. వచ్చే ఏడాదికి కళాశాల అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
అందనున్న చికిత్సలు
వైద్య విద్యార్థులకు తరగతులు బోధించేందుకు ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లతో పాటు వైద్యాధికారులు, పారామెడికల్‌ సిబ్బంది తదితరులు సుమారు 600 మందికి పైగా ఇక్కడ విధులు నిర్వహించే అవకాశం ఉంటుందని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు మొదటి రెండు సంవత్సరాలు తరగతులు, తర్వాత రెండున్నర నుంచి మూడు సంవత్సరాలు వరకు చికిత్స అందించే విధానంపై శిక్షణ ఉంటుంది. జనరల్‌ ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యే వరకు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో విద్యార్థులు సేవలు అందిస్తారు. ఫలితంగా మరిన్ని సేవలతో శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వస్తాయి. నీట్‌ మెడిసిన్‌లో మంచి ర్యాంకు వచ్చిన వారికి ఇక్కడ సీటు దొరికే అవకాశం ఉంటుంది. దీంతో దేశ నలుమూలల నుంచి ఏటా 100 మంది వైద్య విద్యను అభ్యసించే వారు వస్తుంటారు.
మంజూరు లేఖ అందజేత
భూపాలపల్లి టౌన్‌:  ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్‌ ఆసుపత్రికి అనుమతులకు సంబంధించిన లేఖను సీఎం కేసీఆర్‌ శనివారం హైదరాబాద్‌లోని ప్రగతిభవనంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి అందజేశారు. రూ.168 కోట్ల వ్యయంతో 100 సీట్లతో కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

 


గొప్ప మైలురాయి
వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే

భూపాలపల్లికి వైద్యకళాశాల, జనరల్‌ ఆసుపత్రి మంజూరు కావడం గొప్ప మైలురాయి. నేను ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పుడు అందరూ ఇది అయ్యేపనేనా అన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్లకు ఇదే సమాధానం. జిల్లాకు వైద్యకళాశాల ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. వచ్చే సంవత్సరానికి తరగతులు ప్రారంభం అవుతాయి.


శుభపరిణామం
సంజీవయ్య, డీసీహెచ్‌ఎస్‌

భూపాలపల్లికి  ఇదెంతో శుభపరిణామం. మారుమూల ప్రాంతాల వారికి మెరుగైన వైద్యం అందుతుంది. జిల్లాలో సరైన వైద్య సదుపాయం లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. అన్నీ ఇక్కడే అందుబాటులోకి వస్తాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని