logo

మానుకోట మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం!

మేజర్‌ గ్రామ పంచాయతీ నుంచి పురపాలక సంఘంగా.. అనంతరం జిల్లా కేంద్రంగా అవతరించిన మహబూబాబాద్‌ పట్టణం క్రమేణా విస్తరిస్తోంది.

Published : 04 Dec 2022 04:47 IST

ప్రభుత్వ పరిశీలనలో దస్త్రం

ప్రణాళిక ముసాయిదా పటం

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: మేజర్‌ గ్రామ పంచాయతీ నుంచి పురపాలక సంఘంగా.. అనంతరం జిల్లా కేంద్రంగా అవతరించిన మహబూబాబాద్‌ పట్టణం క్రమేణా విస్తరిస్తోంది. 2018లో ఆరు పంచాయతీలు పట్టణంలో విలీనమయ్యాయి. పెరుగుతున్న జనాభాతో ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఓ ప్రణాళికా ప్రకారం పట్టణీకరణ చేపట్టి భూవినియోగం, ప్రజలకు అవసరమైన వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. వాణిజ్య అవసరాలు, నీటి వనరులు, పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, ఉద్యానవనాలు, సుందరీకరణ, క్రీడా మైదానాలు, ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి రహదారుల విస్తరణలాంటి పలు వసతులను కల్పించాలనే లక్ష్యంతో 2011 జనాభా ప్రకారం 2044 నాటికి భవిష్యత్తు అవసరాల మేరకు బృహత్తర ప్రణాళిక రూపకల్పన చేయాలని డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే

దీంతో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు 2022 మే నుంచి సంబంధిత విభాగం సిబ్బంది పట్టణంలో ఉన్న వనరులు, ఇతర అవసరాలపై సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే నిర్వహించారు. పట్టణ అభివృద్ధి తదితర అంశాలపై వివిధ శాఖల నుంచి వివరాలను సేకరించి అనంతరం ముసాయిదా బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించారు. ఏయే అవసరాలకు ఎంత కమతాలను కేటాయించాలనే అంశంపై క్షేత్రస్థాయిలో సిబ్బంది రూపొందించిన ప్రణాళిక దస్త్రం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ ఏడాది డిసెంబర్‌ నెలాఖరు నాటికి ముసాయిదా ప్రణాళికలను ప్రభుత్వానికి పంపించాలని తాజాగా పురపాలక శాఖ అన్ని పురపాలక సంఘాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మహబూబాబాద్‌ పట్టణానికి సంబంధించిన ముసాయిదా ప్రతి పభుత్వం వద్ద ఉండడంతో ఆమోద ముద్ర పడాల్సి ఉంది. నిపుణుల ఆధ్వర్యంలో సిద్ధం చేసిన ఈ మాస్టర్‌ ప్లాన్‌ను పాలకవర్గం, అధికారులు యథావిధిగా అమలు చేస్తే పట్టణ రూపురేఖలు మారనున్నాయి.


ప్రభుత్వానికి పంపించాం
- నవీన్‌, పట్టణ ప్రణాళిక విభాగం అధికారి

డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ శాఖ ఆదేశాల మేరకు పట్టణానికి సంబంధించి సర్వే చేసి బృహత్తర ప్రణాళిక ముసాయిదాను ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం ఆమోదం ప్రకారం పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని