logo

కశ్మీరు నుంచి కన్యాకుమారి!!

కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు 3,800 కిలోమీటర్ల సైకిల్‌ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు ఆ యువకుడు.

Published : 02 Feb 2023 05:38 IST

కాజీపేట యువకుడి సైకిల్‌ యాత్ర పూర్తి

జమ్మూలో రోహన్‌ ఆనంద్‌

న్యూస్‌టుడే, కాజీపేట టౌన్‌: కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు 3,800 కిలోమీటర్ల సైకిల్‌ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు ఆ యువకుడు. ప్రతేకత ఏమిటంటే బ్యాటరీ, గేర్‌ లేని చైను సైకిల్‌పై ఆయన ముందుకు సాగారు. ఐదు నెలల యాత్రలో రెండు పంక్చర్లు, పుల్లలకు రూ.300 ఖర్చు చేశానని చెప్పారు.  ఆయనే హనుమకొండ జిల్లా కాజీపేటలోని వెస్ట్‌సిటీకి చెందిన రోహన్‌ ఆనంద్‌. యాత్ర విశేషాలను ఆయన ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే..

‘సర్వ మత సమ్మేళనం మన దేశం. ఇదే మన గొప్పతనం. నా యాత్రలో దేశ ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకొని అన్నం పెట్టి సాగనంపిన తీరు మరిచిపోలేని జ్ఞాపకం. యాత్రకు అమ్మానాన్నే స్ఫూర్తి. నాన్న రవి ఆనంద్‌ పంజాబీ. రైల్వేలో సీటీఐగా ఉద్యోగ విరమణ చేశారు. అమ్మ గేల్‌ ఆనంద్‌, ఆంగ్లో ఇండియన్‌. కాజీపేట సెయింట్‌ గ్యాబ్రియల్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. మేమిద్దరం అన్నదమ్ములం. నేను మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేశాను.

ఆగస్టు 7న వైష్ణోదేవి ఆలయంలో పూజలు చేసి..

ఒక చిన్న సంచి అందులో వాటర్‌ బాటిల్‌, జత దుస్తులు, పడుకోవడానికి ఒక పట్టా పెట్టుకొని రైలులో శ్రీనగర్‌కు వెళ్లాను. గతేడాది ఆగస్టు 7న కట్య్రాలలో వైష్ణోదేవి అమ్మవారిని దర్శనం చేసుకున్నా. అనంతరం లాల్‌చౌక్‌లో రూ.5,500 పెట్టి సైకిల్‌ కొని యాత్ర ప్రారంభించాను. జమ్మూలో సైనికులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలన్నీ చెప్పిన తర్వాత నాకు రక్షిత ప్రదేశంలో నిద్రకు పంపించారు. మరుసటి రోజు సెల్ఫీ తీసుకుని .. శుభయాత్ర పేరుతో పంపించారు. కశ్మీరు ఉద్దంపూర్‌, రాంబన్‌, జమ్మూ, పంజాబ్‌, హరియాణా, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడులోని కన్యాకుమారి వరకు యాత్రను సాగింది. ఆగస్టు 7న మొదలుపెట్టి జనవరి 23న పూర్తి చేశాను.

రెండుసార్లు అస్వస్థత..: భిన్న వాతావరణం ఉన్న రాష్ట్రాలను దాటుకుంటూ ప్రయాణం సాగింది. ఒక దశలో చలికి మాట రాలేదు. మరోసారి వైరల్‌ జ్వరం. యాత్ర నుంచి నిష్క్రమించాలన్న ఆలోచన వచ్చినా.. పట్టుదలతో కదిలాను. యాత్రలో గురుద్వార్‌, శ్రీకృష్ణ జన్మస్థానం, కురుక్షేత్రం, ఖజరహో, ఆదియోగి విగ్రహం, మధుర మీనాక్షి, దిల్లీలోని క్యాథడ్రల్‌ చర్చి, ఎర్రకోట, పంజాబ్‌లోని సుందర ప్రదేశాలను వీక్షించడంతో పాటు బెంగళూర్‌, మధ్యప్రదేశ్‌లోని ఎనుగుల క్రాసింగ్‌, టైగర్‌ జోన్‌ ప్రాంతాల మీదుగా యాత్ర సాహసంగా అనిపించింది’ అని చెప్పారు.

అక్కున చేర్చుకొని అన్నం పెట్టి..

యాత్రలో భాగంగా రోజుకు 48 నుంచి 60 కిలోమీటర్ల వరకు సైకిల్‌ తొక్కుతూ ప్రయాణం చేశాను. ఎక్కడ ఆగితే అక్కడ ప్రజలు భాషాబేధం లేకుండా అక్కున చేర్చుకుని ఆశ్రయం కల్పించారు. నా యాత్ర విశేషాలు తెలుసుకున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని