logo

సామాజిక బాధ్యత పెంచేందుకు ‘ప్రేరణ’

సాంకేతిక ప్రపంచంలో విద్యార్థులు సెల్‌ఫోన్‌కు బానిసలవుతున్న తీరును అరికట్టేందుకు, వారికి దేశంపై అభిమానం పెంపొందించేలా, సామాజిక బాధ్యత, క్రమశిక్షణ గలవారిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

Published : 17 Apr 2024 04:44 IST

ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు

న్యూస్‌టుడే, భూపాలపల్లి : సాంకేతిక ప్రపంచంలో విద్యార్థులు సెల్‌ఫోన్‌కు బానిసలవుతున్న తీరును అరికట్టేందుకు, వారికి దేశంపై అభిమానం పెంపొందించేలా, సామాజిక బాధ్యత, క్రమశిక్షణ గలవారిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.. కేంద్ర విద్యాశాఖ ‘ప్రేరణ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను బహుముఖ ప్రజ్ఞావంతులుగా, విజ్ఞానవంతులుగా, బాధ్యత గల వ్యక్తులుగా మార్చేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి, వారం పాటు గుజరాత్‌లోని దేశ ప్రధాని నరేంద్రమోదీ చదివిన పాఠశాలలో తొమ్మిది అంశాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచే విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. ప్రధాని మోదీ చదివిన గుజరాత్‌లో వాదానగర్‌ పాఠశాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం మ్యూజియంగా మార్చింది. ‘ప్రేరణ’లో భాగంగా దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక బాలుడు, ఒక బాలికను, ఒక ఉపాధ్యాయురాలిని గైడ్‌ టీచర్‌గా ఎంపిక చేసి, ప్రత్యేక శిక్షణ కోసం ఆ పాఠశాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఏడు రోజుల పాటు జరిగే శిక్షణలో ఒక్కో బ్యాచ్‌లో 10 జిల్లాలకు చెందిన 20 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఇలా శిక్షణ పొందిన వారిని అంబాసిడర్లు (రాయబారులు)గా పరిగణిస్తారు. పాఠశాల, జిల్లా స్థాయిలో విద్యార్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. వరంగల్‌ కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్‌ దీనికి నోడల్‌ అధికారిగా వ్యవహరించనున్నారు. ఆయన ఆధ్వర్యంలో పారదర్శకంగా తుది ఎంపిక జరుగుతుంది.

శిక్షణ ఇలా..

జిల్లా స్థాయిలో దేశీయ విజ్ఞానం, సాంకేతికత, సృజనాత్మకత, స్ఫూర్తిదాయకమైన నాయకులు, క్షేత్ర సందర్శన, యోగా, ధ్యానం విషయాలపై శిక్షణ ఇస్తారు. గుజరాత్‌లోని శిక్షణ కేంద్రంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులను ఒక్కచోటుకు చేర్చి, విభిన్న నాగరికతలపై అవగాహన కల్పిస్తారు. ఐదు రోజుల పాటు నిపుణుల ప్రసంగాలు, రెండు రోజుల పాటు క్షేత్ర పర్యటన ఉంటుంది. అక్కడ స్వాభిమాన్‌, శౌర్య, సాహస్‌, పరిశ్రమ్‌, కరుణ సేవ, భిన్నత్వంలో ఏకత్వం, సత్యనిష్ఠ, కుతూహలం, కొత్త విషయాలపై ఆసక్తి, శ్రద్ధ- విశ్వాస్‌, స్వతంత్రత- కర్తవ్యం అనే అంశాలపై విద్యార్థులకు తర్ఫీదునిస్తారు.

్జ‌్రఎంపిక విధానం..

‘ప్రేరణ’కు నమోదు చేసుకున్న బాలబాలికల నుంచి పాఠశాల స్థాయిలో ప్రతిభ, నాయకత్వం లక్షణాలు, సామాజిక బాధ్యత, కొత్త విషయాలపై ఆసక్తి తదితర అంశాలను పరీక్షించి, ప్రతి పాఠశాల నుంచి ఒక బాలుడు, ఒక బాలికను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయిలోనూ ప్రేరణ ఉత్సవాలు ఉంటాయి. ఇందులో నాకిష్టం, నా దృష్టిలో భారతదేశం, వికసిత్‌ భారత్‌, ఆయా అంశాలపై పోటీలు నిర్వహించి, 30 మందిని(15 మంది బాలికలు, 15 మంది బాలురు) ఎంపిక చేస్తారు. మూడో దశలో వరంగల్‌ కేంద్రియ విద్యాలయం ప్రిన్సిపల్‌ ఆధ్వర్యంలో వీరికి వివిధ అంశాలపై ప్రత్యేక శిక్షణ కల్పిస్తారు. అన్ని కోణాల్లో పరీక్షించి అత్యంత ప్రతిభ కనబర్చిన ఓ బాలిక, ఒక బాలుడిని, ఒక గార్డియన్‌గా ఉపాధ్యాయురాలిని ఎంపిక చేస్తారు. వీరికి ఈ నెల చివరి వారంలోపు గుజరాత్‌కి ప్రత్యేక శిక్షణ కోసం పంపిస్తారు.


ప్రతిభ గలవారికే అవకాశం

- రాంకుమార్‌, జిల్లా విద్యాశాఖ అధికారి

జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 15 పాఠశాలలు రిజిస్టర్‌ చేసుకున్నాయి. ఆయా పాఠశాలల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులకు ఈ నెల 23న వరంగల్‌ కేంద్రీయ విద్యాలయంలో శిక్షణ ఉంటుంది. అక్కడ పలు రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతే గుజరాత్‌కు వెళ్లేవారిని ఎంపిక చేస్తారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యేలా ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు దృష్టి పెట్టాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని